శాసనసభలో హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం. చిత్రంలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. 96 నిమిషాల పాటు ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కావడం గమనార్హం. ఆర్థికమంత్రి హోదాలో హరీశ్‌రావు వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. హరీశ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఆయన చేతుల మీదుగా బడ్జెట్ ప్రతులను స్వీకరించారు. గురువారం ఉదయం 11.30కు శాసనసభ ప్రారంభం కాగా పది నిమిషాల ముందే హరీశ్‌రావు సమావేశ మందిరంలోకి చేరుకోగా.. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు.
సభ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు సమావేశ మందిరంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లి అభివాదం చేశారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పలు శాఖలు, పథకాలకు సంబంధించిన కేటాయింపులపై అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏటా రూ.5 కోట్లు ఇస్తామని పేర్కొనడంతో సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. బడ్జెట్ ప్రసంగం కాపీని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో సభ్యులకు అందజేయగా, బడ్జెట్ పూర్తి వివరాలను తొలిసారిగా పెన్‌డ్రైవ్‌ల ద్వారా అందజేయడంతో పాటు సభ్యులకు ఐపాడ్లు అందజేశారు.
చైర్మన్, స్పీకర్‌కు బడ్జెట్ ప్రతులు
రాష్ట్ర బడ్జెట్ 2021–22 ప్రతులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉదయం అందజేశారు. శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ సమర్పణకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి వేముల తనకు రెండో పర్యాయం అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆశీర్వాదం తీసుకున్నారు. వేములకు సహచర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.
సీఎంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల భేటీ
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయించడంపై స్థానిక సంస్థల కోటా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఇటీవల ఈ ఎమ్మెల్సీలు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నారదాసు లక్ష్మణ్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పురాణం సతీష్‌కుమార్, బాలసాని లక్ష్మినారాయణ, దామోదర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment