సాగు, సంక్షేమం.. అంకెలు అదుర్స్‌ | Telangana Budget Is 2,30,825.96 Crores For List Of Allocation Over 2021 | Sakshi
Sakshi News home page

సాగు, సంక్షేమం.. అంకెలు అదుర్స్‌

Published Fri, Mar 19 2021 1:55 AM | Last Updated on Fri, Mar 19 2021 10:44 AM

Telangana Budget Is 2,30,825.96 Crores For List Of Allocation Over 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవ‘సాయం’ పెరిగింది.. సంక్షేమం మరింత ముందుకెళ్లింది.. సాగు నిధులకు ఢోకా లేదు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో ఎక్కడా కోతల్లేవు.. పన్ను మోతల్లేవు.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి భారీ గా కేటాయింపులు.. ఒక్క మాటలో చెప్పాలంటే... రైతు, పల్లె, పట్నం ప్రగతికి బాటలు వేస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ముందుకు తెచ్చింది.

కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టినా.. నిలకడగా ఉన్న వృద్ధిరేటు, పెరుగుతున్న తలసరి ఆదాయాలే ధీమాగా.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం 2021–22 ఏడాది బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,30,825.96 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను ప్రతిపాదించారు. రైతుబంధుకు నిధుల పెంపు, రుణమాఫీకి కేటాయింపులు, రైతు బీమా అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా కేటాయింపులు చేశారు.

హైదరాబాద్‌తోపాటు యావత్‌ తెలంగాణకే మణిహారమైన రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ కోసం రూ.750 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యమిస్తూనే.. సీఎం దళిత సాధికారత పేరుతో దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు పెంచడంతోపాటు ఎంపీపీలు, జెడ్పీలకు ప్రత్యేక నిధుల కింద రూ.500 కోట్లు కేటాయించారు. గిరిజనుల సాగు భూములకు త్రీఫేజ్‌ విద్యుత్, గొల్లకు ర్మలకు గొర్రెల పంపి ణీకి ప్రాధాన్యమిచ్చా రు. ఈ బడ్జెట్‌ గత బడ్జెట్‌ రూ.1.82 లక్షల కోట్లతో పోలిస్తే 25% అధికం కావడం విశేషం.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు.చిత్రంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, వేముల తదితరులు 
అన్ని శాఖలకూ పెంపు 
ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు కేటాయించింది. అన్ని స్థాయిల్లో విద్యకు గత బడ్జెట్‌ కంటే రూ.1,400 కోట్లు అదనంగా.. రూ.13,500 కోట్లను ఇచ్చింది. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌ శాఖలకు గత బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించగా.. ఈసారి ఒక్క పంచాయతీరాజ్‌ శాఖకే రూ.29,271 కోట్లు ప్రతిపాదించారు.

పురపాలక శాఖకు మరో రూ.15 వేల కోట్లు చూపారు. సాగునీటి రంగానికి ఎప్పటిలాగే ప్రాధాన్యమిస్తూ ఈసారి రూ.16,391 వేల కోట్లకుపైగా కేటాయించారు. ఎస్సీఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కింద గత బడ్జెట్‌ కంటే రూ.ఏడు వేల కోట్లు ఎక్కువగా ప్రతిపాదించారు. రీజనల్‌ రింగు రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు, మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు, హైదరాబాద్‌ తాగునీటి పథకాలకు రూ.2,381 కోట్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు రూ.250, రూ.150 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. 

సంక్షేమానికి ప్రాధాన్యం 
సబ్సిడీ, సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులిచ్చారు. విద్యుత్‌ శాఖకు గత బడ్జెట్‌ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువగా.. రూ.11,040 కోట్లు, పౌర సరఫరాలకు రూ.2,363 కోట్లు కేటాయించారు. బీసీ, మహిళా, మైనార్టీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యమిస్తూ రూ.8వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. రోడ్లు భవనాల శాఖకు కూడా రూ.8వేల కోట్లకుపైగా ఇచ్చారు.

రాష్ట్రంలో భూముల సర్వేకు అనుగుణంగా సమగ్ర సర్వే పేరుతో ఈసారి రూ.400 కోట్లు చూపెట్టడం గమనార్హం. ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయిస్తూనే.. మరో రూ.1,500 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎప్పటిలాగే ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాల అమలు కోసం రూ.14,500 కోట్ల మేర కేటాయించారు. మొత్తమ్మీద సంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సర్కారు 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసిందనే చర్చ జరుగుతోంది. 

పన్నుల రాబడిపై ధీమా 
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతిపాదనలు చూస్తే.. సొంత పన్ను రాబడులపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. కరోనా మహమ్మరి కొట్టిన దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నా.. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని బడ్జెట్‌ ప్రతిపాదనలు చెబుతున్నాయి. ఈసారి పన్ను రాబడుల కింద రూ.92,910 కోట్లను చూపెట్టగా.. పన్నేతర ఆదాయం కింద రూ.30,557 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా గతం కంటే తక్కువగా రూ.13,990 కోట్లు, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దును గతం కంటే భారీగా పెంచుతూ రూ.38,669 కోట్లు చూపెట్టారు.

ఆదాయ వనరుల వివరాల్లోకి వస్తే జీఎస్టీ, అమ్మకపు పన్ను కలిపి రూ.57,500 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ కింద రూ.17 వేల కోట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితోపాటు ఈసారి కూడా రుణాల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఆధారపడనుంది. బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాల ద్వారా రూ.47,500 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. మొత్తంగా ఈసారి రెవెన్యూ రాబడుల కింద రూ.1.76 లక్షల కోట్లకుపైగా వస్తాయని అంచనా వేసింది. ఇక రెవెన్యూ ఖర్చు కూడా రూ.1.69 లక్షల కోట్లకుపైగా ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొంది. రెవెన్యూ మిగులు రూ.6,743 కోట్లుగా చూపెట్టగా.. ద్రవ్యలోటు రూ.45,509 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. 

వచ్చిందంతా ఖర్చయింది! 
కరోనా మహమ్మరి తెచ్చిన ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడిన 2020–21 సంవత్సరపు సవరించిన బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వం సభ ముందుంచింది. గత బడ్జెట్‌లో మొత్తం రూ.1.82 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. రూ.1.66 లక్షల కోట్ల మేర సమకూరిందని వెల్లడించింది. ఇందులో దాదాపు అంతా ఖర్చయిందని తెలిపింది. ఇక గత బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు లేకపోగా.. ద్రవ్యలోటు రూ.42,399 కోట్లుగా పేర్కొంది.

 

విద్య..
గతేడాది పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలకు మొత్తంగా రూ. 12,138 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 13,564.66 కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,426.65 కోట్ల మేర అదనం. గతేడాది పాఠశాల విద్యాశాఖకు రూ. 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 11,693.08 కోట్లు కేటాయించింది. 

వైద్యం..
వెద్య, ఆరోగ్య శాఖకు గతేడాది రూ. 6,185.97 కోట్లు ఇవ్వగా.. ఈ సారి రూ. 6,295 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. ‘ఆరోగ్య మిషన్‌’కు అధిక నిధులు కేటాయించింది.

సాగు నీరు..
సాగునీటి శాఖకు రూ. 16,931 కోట్లు కేటాయించగా.. ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. గతేడాదికన్నా ఈసారి రూ. 5,878 కోట్ల మేర పెరిగాయి.

గ్రామీణాభివృద్ధి..
రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, ఇతర కేటాయిం పులు, తదితరాలు కలుపుకొని రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం.

పట్టణాభివృద్ధి..
పురపాలక శాఖకు 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021–22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. నిర్వహణ పద్దు కింద రూ.3,978.01 కోట్లు.. ప్రగతిపద్దు రూ.10,134.23 కోట్లు కేటాయించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలు..
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.33,611.06 కోట్లు కేటాయింపు. ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ కింద రూ.21,306.84 కోట్లు. ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ కింద రూ.12,304.22 కోట్లు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.7,304.81 కోట్లు అదనం. ‘బీసీ’ శాఖకు రూ.5,522.09 కోట్లు. గత బడ్జెట్‌లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది.

ఆర్టీసీ..
బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ.1500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. 

పరిశ్రమలు..
పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు. రాయితీలు, ప్రోత్సాహకాలకే రూ.2,500 కోట్లు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.1,130 కోట్లు. చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు. ఐటీ రంగానికి రూ.360 కోట్లు ప్రతిపాదన.

► ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ పల్లెలు తట్టుకుని నిలబడ్డాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు ఫలితం. కొన్నేళ్లుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య సేవలు, సమాచార, సాంకేతిక, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.  కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం  వ్యవసాయం. కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ  అభివృద్ధి క్రియాశీలకంగా ఉంది. గత ప్రభుత్వాలు దండగ అని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకుని అభివృద్ధి సాధించింది. ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యలతోనే ఇది సాధ్యమైంది.   – ఆర్థిక మంత్రి హరీశ్‌

► చెక్కు చెదరని వ్యవ‘సాయం’కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైనా.. రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సామాజిక–ఆర్థిక స్వరూపం నివేదిక వెల్లడించింది. 2020–21లో జీఎస్డీపీ వృద్ధి రేటు –1.26%కి తగ్గింది. అయితే దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 8%కి పడిపోయింది. దేశంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు మెరుగైన స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం చెక్కుచెదరలేదు.

ఈ మూడూ చాలా కీలకం.. 
► కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరగని భూముల మార్కెట్‌ విలువల సవరణను అమల్లోకి తేవడం ద్వారా దాదాపు రూ.16,500 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 

► గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి గతం కంటే రూ.28 వేల కోట్లు అదనంగా వస్తాయని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 

► సొంత పన్ను ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని సర్కారు అంచనా వేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా రూ.76,195.65 కోట్లతో పోలిస్తే.. సుమారు రూ.16.5 వేల కోట్లు అదనంగా పన్నుల రాబడి ఉంటుందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement