హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ పురోగమిస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపించిన హరీశ్‌రావు.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా ఇబ్బందులు పెడుతోందంటూ విరుచుకుపడ్డారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగాల్లో.. రాష్ట్రం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రంపై విరుచుకుపడేలా మాటల తూటాలు పేల్చడం అరుదు. ఆ ‘ఆనవాయితీ’కి భిన్నంగా ఈసారి బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ ప్రసంగ పాఠంలోని ఐదో పేజీ నుంచి వరుసగా ఆరు పేజీలు కేంద్రంపై విమర్శలకే కేటాయించటం గమనార్హం.
‘తెలంగాణ అస్థిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన కేసీఆర్ సారథ్యంలోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది’అంటూ హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే.. ‘ఒక కఠోర వాస్తవాన్ని ప్రస్తావించక తప్పడం లేదు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతోంది. అప్పుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రం వివక్ష చూపుతోంది.
కాళ్లల్ల కట్టె పెట్టినట్టు దాని తీరు ఉంది’అంటూ కేంద్రంపై దాడి చేశారు. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను ఏపీకి కట్టబెట్టడం, ఐటీఐఆర్, వెనకబడ్డ జిల్లాలకు నిధుల విడుదలలో జాప్యం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధుల కేటాయింపుపై నీతి ఆయోగ్ సిఫారసుల బుట్టదాఖలు, పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపులు, కాజీపేట రైల్ కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీలు పరిశ్రమ, గిరిజన వర్సిటీకి కంటితుడుపు సాయం, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక గ్రాంటు ఇవ్వకపోవటం, కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైతే ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవటం.. ఇలా ప్రతీ అంశాన్ని ప్రస్తావించి కేంద్రంపై దుమ్మెత్తిపోశారు.
కేసీఆర్ మార్కు బడ్జెట్
‘సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదల వైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్ డౌన్ థియరీ బడ్జెట్ కాదు మాది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ అంతకంటే కాదు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్. ఇది ముమ్మాటికీ, కేసీఆర్ మార్కు బడ్జెట్’’అని హరీశ్ పేర్కొన్నారు. ఇలా బడ్జెట్ యావత్తూ పదేపదే కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ సాగింది ప్రసంగం. అందుకే, బడ్జెట్ పాఠం అయిపోయేంతవరకు అసెంబ్లీలో అధికారపక్షంవైపు బల్లలు మోగుతూనే ఉన్నాయి. అటు కేంద్రంపై విమర్శలు, ఇటు కేసీఆర్‌పై పొగడ్తలు... వెరసి బడ్జెట్ ప్రసంగం రెండు గంటలు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment