మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌! | Corporate tax rate cuts, changes in income tax rules explained | Sakshi
Sakshi News home page

మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌!

Published Sat, Sep 21 2019 4:06 AM | Last Updated on Sat, Sep 21 2019 4:27 AM

Corporate tax rate cuts, changes in income tax rules explained - Sakshi

దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్‌ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది.

ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్‌ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్‌ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు.

అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్‌ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్‌ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది.

 ఈ నిర్ణయాలకు స్టాక్‌ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్‌ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్‌ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్‌ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్‌ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్‌ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు.  

ప్రధాన నిర్ణయాలు
► కార్పొరేట్‌ ట్యాక్స్‌ బేస్‌ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్‌ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది.  

► 2019 అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది.

► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్‌ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి.

► బేస్‌ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్‌ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్‌ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది.  

► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్‌ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్‌ ఉండదు.  

► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది.   

► కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్‌ఆర్‌) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు.

► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే.   

► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement