rate cuts
-
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం
ముంబై: ద్రవ్యోల్బణాన్ని లకి‡్ష్యత స్థాయికి కట్టడి చేయడంలో విఫలమైందంటూ వస్తున్న విమర్శలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తగిన బదులిచ్చారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమన్న ప్రాథమిక లక్ష్యంలో వెనుకబడినట్టు అంగీకరిస్తూనే.. ఆర్బీఐ అనుసరించిన విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. ముంబైలో జరిగిన ఎఫ్‌ఐబీఏసీ సమావేశంలో భాగంగా శక్తికాంతదాస్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ ఆర్బీఐ ముందుగానే రేట్లను కట్టడి చేసి ఉంటే ఆర్థిక వ్యవస్థ అధోముఖం పాలయ్యేదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలమైన, సుస్థిర, ఆశావాదంగా ప్రపంచం చూస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పుడిక మోస్తరు స్థాయికి దిగొస్తుందన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో విరుద్ధమైన అంశాలను కూడా చూడాల్సి ఉంటుందని, ముందస్తుగానే రేట్లను కట్టడి చేయడం వృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని దాస్ సూచించారు. ‘‘అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులకు భారంగా మారి ఉండేది. భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది’’అని దాస్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సురక్షిత స్థానానికి చేర్చాల్సి ఉందంటూ, అటువంటి తరుణంలో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు అవరోధం కలిగించరాదన్నారు. ‘‘కరోనా సమయంలో ద్రవ్యోల్బణం నిర్ధేశిత లక్ష్యం 2–6 శాతం పరిధిలో కొంచెం పెరిగినా పర్వాలేదనే విధంగా ఆర్బీఐ సులభతర మానిటరీ పాలసీ చర్యలను అనుసరించింది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇలా చేసింది. దీంతో 2021–22, 2022–23లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది’’అని వివరించారు. భారత ఆర్థిక వృద్ధి రికవరీ విస్తత స్థాయిలో ఉందంటూ.. సకాలంలో, సరైన లక్షి్యత ద్రవ్య, మానిటరీ, నియంత్రణపరమైన విధానాల ఫలితమే ఇదన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఆర్బీఐ ఎంపీసీ గురువారం (ఈ నెల 3న) నాటి సమావేశం ఎజెండాను శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో ఎందుకు విఫలమైందనే, కారణాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. వరుసగా తొమ్మిది నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగడానికి దారితీసిన కారణాలను వివరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ రుణాల ప్రయోగాత్మక డిజిటైజేషన్‌పై దాస్ స్పందిస్తూ.. చిన్న వ్యాపార రుణాలకు సైతం 2023 నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ‘అర్జునుడు–చేప కన్ను’ ప్రస్తావన... ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిపైనే దృష్టినంతా కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ భావిస్తోందని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. మహాభారత ఇతిహాసంలో పైన తిరిగే చేప కంటిని గురి చూసి కొట్టడంపై అర్జునుడు దృష్టి సారించిన దృష్టాంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం. ‘‘అర్జునుడి పరాక్రమానికి ఎవరూ సాటిలేరు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే మా నిరంతర ప్రయత్నం’’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు టోకు (హోల్‌సేల్) మాదిరే రిటైల్ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్‌సేల్ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు మంగళవారమే మొదలు కావడం గమనార్హం. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి)ని విడుదల చేయడం దేశ కరెన్సీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని దాస్ పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. రూపాయి విలువ క్షీణతను భావోద్వేగాల కోణం నుంచి బయటకి వచ్చి చూడాలన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి రూపాయి క్రమపద్ధతిలోనే చలించిందని చెప్పారు. తద్వారా దీనిపైపై విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉన్నట్టు చెప్పారు. యూఎస్ డాలర్ మినహా మిగిలిన కరెన్సీలతో బలపడినట్టు గుర్తు చేశారు. -
వడ్డీరేట్ల విషయంలో ట్రెండ్‌కు భిన్నంగా చైనా
బీజింగ్: ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు బాట పడితే, చైనా ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంభిస్తోంది. ఎకానమీకి ఊపును అందించడానికి కీలక రుణ రేటు తగ్గిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ సోమవారం నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత రాజకీయంగా సున్నిత సమయంలో సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మరో ఐదేళ్లపాటు బాధ్యతల్లో కొనసాగడానికి వరుసగా మూడవసారి జి జిన్‌పింగ్ పావులు కదుపుతారన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ మందగమన పరిస్థితిలో ఉండరాదని ఆయన కోరుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏడాది రుణ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికితోడు రుణ మార్కెట్లలోకి 400 బిలియన్ చైనా యువాన్లను (60 బిలియన్ డాలర్లు) పంపుతున్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం రుణ వ్యయాలు భారీగా పెరిగాయి. వైరస్ సంబంధ ఆంక్షలు, వాణిజ్య అడ్డంకులు, తయారీ–వినియోగంలో తగ్గిన వ్యయాలు, రియల్టీ రంగంలో సవాళ్లు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీ, రిటైల్ అమ్మకాలు జూలైలో బలహీనంగా ఉన్నాయి. గృహ విక్రయాలు భారీగా పడిపోయాయి. -
ఆగని విలయం!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్‌తో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆరంభం నుంచి అదే వరుస.... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం విరామం అనంతరం స్టాక్ మార్కెట్లో నష్టాలు మళ్లీ కొనసాగాయి. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్ బ్యాంక్ షేర్ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది. యస్ బ్యాంక్‌లో వివిధ బ్యాంక్‌లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండటం, నగదు విత్‌డ్రాయల్ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి. రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.62 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... కోవిడ్–19 వైరస్ కల్లోలం.... కోవిడ్–19 వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు. గణాంకాలతో గజగజ.... చైనా తయారీ రంగ, రిటైల్ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి. కోవిడ్–19 వైరస్ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి. ప్రపంచ మార్కెట్ల పతనం..... ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోవడం, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మరింత పతనం.... ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్ మరో అనూహ్య కోత వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది. వెరసి ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది. రెండు వారాల్లోనే రేటును ఫెడ్ ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది. తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్‌తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్–19 వైరస్ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2008 తదుపరి... 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్‌ప్రైమ్ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి అమెరికా ఫెడ్ ఫండ్ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది. తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్ రిక్వైర్మెంట్స్ నిబంధనలు సడలించింది. అధ్యక్షుని ప్రశంసలు... మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. అనుసరించనున్న ఆర్బీఐ! మరోవైపు భారత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు. ఏప్రిల్ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొ న్నారు. కోవిడ్ ఆందోళనలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. రూపాయి, క్రూడ్ క్రాష్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్–19 భయాలు, ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం. శుక్రవారం రూపాయి ముగింపు 73.75. ట్రేడింగ్ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్, బంగారం ‘బేర్’ మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది. బ్రెంట్ బ్యారల్ ధర ఇదే సమయానికి 11.73 శాతం నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ కార్డ్స్‌కు కరోనా సెగ ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్–19 వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 13 శాతం నష్టంతో లిస్టింగ్..... ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ బీఎస్ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్‌కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 41.6 లక్షలు, ఎన్ఎస్ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57,199 కోట్లకు చేరింది. ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 22 రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం.. పేలవంగా లిస్టింగ్ 10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు ఐపీఓలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరిన్ని విశేషాలు.... సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. టాటా స్టీల్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 11 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 10% మేర నష్టపోయాయి. ► యస్ బ్యాంక్ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్బీఎల్ బ్యాంక్ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది. ► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్‌లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్ బ్యాంక్, పీవీఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఈ జాబితా కొన్ని. ► 600కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్, ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, సువెన్ ఫార్మా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, డీహెచ్ఎఫ్ఎల్, వెల్స్పన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్‌కు పడగొట్టాయి. సెన్సెక్స్‌ను....రిలయన్స్ ఇండస్ట్రీస్ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి. ఫెడ్ తగ్గించినా... నష్టకష్టాలే! అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్ రేట్‌ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్ రేటు 0–0.25 శాతం రేంజ్లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. పార్క్ హోటల్స్ ఐపీఓ @ రూ.1,000 కోట్లు... పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, జైపూర్, జోధ్‌పూర్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ద పార్క్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది. ఐపీఓలు వాయిదా...: కోవిడ్–19 వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. జీడీపీకి కరోనా కాటు! వృద్ధి 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్ ఏజెన్సీ కేర్ 150 మంది సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. రేట్ల కోతతో కీడే ఎక్కువ వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కోవిడ్ వైరస్ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్‌ల రేట్ల తగ్గింపు సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ పతనం కొనసాగే అవకాశాలే అధికం దేశీయంగా కోవిడ్–19 వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్. -
తగ్గిన ఎస్బీఐ రుణ రేటు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 8% నుంచి 7.90%కి దిగివచ్చింది. తన గతవారం పాలసీ సమీక్షలో ఆర్బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 బేసిస్ పాయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ఓవర్‌నైట్ రుణ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 7.75%కి దిగివచ్చింది. ఇతర కాలపరి మితి రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.30% నుంచి 8.20%కి చేరింది. -
మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5%కి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చనేది నిపుణుల అంచనా. శక్తికాంతదాస్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్బీఐ ఇప్పటిదాకా ప్రతీ భేటీలోనూ రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు కూడా. అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్‌లో ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి (4.5%)ని దాటుకుని 4.6%కి చేరింది. దీంతో మరో విడత రేట్లపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్ బిశ్వాస్ తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది. -
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!
దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది. ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది. ఈ నిర్ణయాలకు స్టాక్ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రధాన నిర్ణయాలు ► కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది. ► 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది. ► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి. ► బేస్ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది. ► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్ ఉండదు. ► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది. ► కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు. ► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే. ► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. -
ఆతిథ్య, వాహన రంగాలకు ఊతం
పణజి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం గోవాలోని పణజిలో సమావేశమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్.. దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్ సామర్థ్యమున్న పెట్రోల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సీతారామన్ ఈ వివరాలను ప్రకటించారు. 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీని 5 నుంచి 1.5 శాతానికి తగ్గిస్తున్నామనీ, విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ లింక్.. వెట్ గ్రైండర్లపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకింగ్ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రిజస్ట్రేషన్ సందర్భంగా ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సీతారామన్ చెప్పారు. జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే.. భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అండర్–17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలపై జీఎస్టీ ఉండదన్నారు. ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేశారు. అలాగే ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినంను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు. కెఫిన్ పానీయాలపై కొరడా.. కెఫిన్ ఉన్న పానీయాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్నును పెంచింది. ప్రస్తుతం కెఫిన్ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అదనంగా 12 శాతం సెస్ విధిస్తామని తెలిపింది. దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. అలాగే బాదంపాలపై 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. మెరైన్ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చమురు–గ్యాస్ అన్వేషణ కోసం వాడే కొన్ని వస్తువులపై 5 శాతం పన్నును విధించనున్నారు. ఆతిథ్య పరిశ్రమకు ప్రోత్సాహం అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా జీఎస్టీ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించారు. ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఔట్‌డోర్ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. దీనివల్ల హోటళ్లలో ధరలు తగ్గుతాయనీ, తద్వారా ఆతిథ్య పరిశ్రమకు ఊతం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. -
పాలసీని స్వాగతించని మార్కెట్!
అంచనాలకు తగ్గట్లుగానే ఆర్బీఐ రేట్ల కోత ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 38,700 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సేవల రంగం గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. ప్రధాన స్టాక్ సూచీలు ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు పతనమై 38,685 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. అంచనాలకు తగ్గట్లే రేట్ల కోత అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. అంతంతమాత్రం వృద్ధితో మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గింది. దీంతో రెపో రేటు ఏడాది కనిష్ట స్థాయి 6 శాతానికి చేరింది. ఈ రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభిస్తాయి. నెలవారీ వాయిదాలు చౌక అవుతాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ముడి చమురు ధరలు పుంజుకుంటుండటంవల్ల తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని వివరించింది. కొత్త వర్క్ ఆర్డర్లు మందగమనంగా ఉండటంతో మార్చిలో భారత సేవల రంగం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.5 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ మార్చిలో 52కు పడిపోయింది. మూడు రోజులుగా లాభపడుతున్న రూపాయి గురువారం భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21ను తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా సూచీలు లాభపడ్డాయి. కొనసాగిన లాభాల స్వీకరణ... ప్రధాన స్టాక్ సూచీలు బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడే వరకూ పరిమిత శ్రేణి లాభ, నష్టాల్లోనే సూచీలు ట్రేడయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత అమ్మకాల జోరు పెరిగి నష్టాలు కూడా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 62 పాయింట్లు లాభపడగా, మరో దశలో 296 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 358 పాయింట్ల రేంజ్లో కదిలింది. మిశ్రమంగా ‘వడ్డీ’ ప్రభావిత షేర్లు... వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు 3–1 శాతం రేంజ్లో లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు చెరో అరశాతం మేర నష్టపోయాయి. బ్యాంక్ షేర్లలో సిటీ యూనియన్ బ్యాంక్ 2.2 శాతం, ఎస్బీఐ 0.3 శాతం మేర లాభపడగా, యస్ బ్యాంక్ 2 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.8 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ► టీసీఎస్ సెన్సెక్స్‌లో భారీగా 3.1 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ► రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.46 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,04,506 కోట్లకు పడిపోయింది. ► షేర్ల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నదన్న వార్తలతో యస్ బ్యాంక్ షేర్ 2 శాతం క్షీణించి రూ.268 వద్ద ముగిసింది. -
కుదిరితే మరిన్ని కోతలు
ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలకు రుణాల వృద్ధి కోసమే రేట్లను పావుశాతం మేర తగ్గించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అంచనాల పరిధిలోనే తక్కువగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనల పరిధిని మించి ఎంపీసీ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.9 శాతం పరిధిలో... గరిష్టంగా 4 శాతం లేదా అంతకులోపు ఉంటే రేట్ల తగ్గింపును పరిశీలించే అవకాశం ఉంటుంది’’అని దాస్ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రతిపాదనల వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త ద్రవ్యోల్బణం అంచనాలకు వచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కీలకమైన ఏ రంగానికీ నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్య లేదని శక్తికాంతదాస్ తెలిపారు. అవసరమైనప్పుడు తగినన్ని నిధులను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా వ్యవస్థలోకి రూ.2.36 లక్షల కోట్లను తీసుకొచ్చామని, ఫిబ్రవరి నెలలో రూ.37,500 కోట్లను తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని విరాళ్ ఆచార్య గుర్తు చేశారు. ఎన్పీఏ నిబంధనల్లో మార్పుల్లేవు రుణ చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా ఎన్పీఏలుగా గుర్తించాలన్న 2018 ఫిబ్రవరి 12 నాటి ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులను చేయడం లేదని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా లేదన్నారు. నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకులు నిర్ణీత గడువులోపు రుణ చెల్లింపులు చేయని ఖాతాల విషయంలో నిర్ణీత వ్యవధిలోపు పరిష్కారం చూడడం, విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఎన్సీఎల్టీకి నివేదించడం చేయాల్సి ఉంటుంది. మధ్యంతర డివిడెండ్... న్యాయబద్ధమే ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కోరడం చట్టబద్ధమేనని, ఈ నిధులను దేనికి వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమేనని దాస్ చెప్పారు. ఆర్బీఐ నుంచి మరిన్ని నిధులను బదిలీ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్లతోనే ఉర్జిత్ పటేల్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మిగులు నిధులు లేదా మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం అన్నది ఆర్బీఐ చట్టం పరిధిలోనిదే. ఈ చట్టపరమైన నిబంధనలను దాటి మేమేమీ చేయడం లేదు’’ అని దాస్ స్పష్టం చేశారు. చందాకొచర్‌పై నిర్ణయం దర్యాప్తు సంస్థలదే... ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ వ్యవహారంలో దాస్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల పరిధిలోనే ఉందన్నారు. నిబంధనలను వ్యక్తులు లేదా గ్రూపు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే విషయంలో ఆర్బీఐ పాత్ర పరిమితమేనన్నారు. ఒకవేళ ఏదైనా అంశాల్లో దర్యాప్తు అవసరం అయితే తదుపరి చర్యల అధికారం వారి పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సాగు రంగానికి వెసులుబాటు హామీల్లేకుండా వ్యవసాయానికి ఇచ్చే రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి రుణాల పరిస్థితిని సమీక్షించి ఆచరణాత్మక విధానాన్ని సూచించేందుకు ఓ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనుంది. గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ వృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ... ఈ రుణాల పంపిణీ విషయంలో ప్రాంతాల మధ్య అంతరాలు, కవరేజీ విస్తృతి వంటి సమస్యలు ఉన్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ అంశాలను ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు పరిగణనలోకి తీసుకోనుంది. డిపాజిట్లకు నిర్వచనంలో మార్పు బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ విషయంలో ఆర్బీఐ కొంత స్వేచ్ఛ కల్పించింది. ప్రస్తుతం రూ.కోటి ఆపై మొత్తాలను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటే, దీన్ని రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువకు మార్చింది. బ్యాంకులు చిన్న డిపాజిట్ల కంటే బల్క్ డిపాజిట్లపై కొంత మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. బ్యాంకులు తమ అవసరాలు, ఆస్తులు, అప్పుల నిర్వహణ సమతుల్యత కోసం బల్క్ డిపాజిట్లపై భిన్నమైన రేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దివాలా ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు ఈసీబీ సదుపాయం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) పరిధిలోని కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ)లో పాల్గొనే కంపెనీలు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) మార్గంలో నిధుల సమీకరణకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీ లేదా రూపాయి మారకంలో ఈసీబీ ద్వారా సమీకరించే నిధులను తిరిగి చెల్లింపులు లేదా రూపాయి మారకంలోని రుణాలను తీర్చివేసేందుకు అనుమతి లేదు. మరో రేటు కోత అంచనా! తాజా రేటు తగ్గింపు వృద్ధికి దోహదపడే అంశమని పలు వర్గాలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనితోపాటు త్వరలో మరో దఫా రేటు కోత తథ్యమని మెజారిటీ విశ్వసిస్తోంది. తాజా పాలసీపై పలువురి అభిప్రాయాలు ఇలా... తటస్థ వైఖరి... సానుకూలం పాలసీపై ‘తటస్థం’ దిశగా ఆర్బీఐ అడుగులు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి తగిన సానుకూలతను సృష్టిస్తోంది. ధరలు పెరక్కపోతే మరో కోతకు చాన్సుంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు కీలక నిర్ణయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు మరింత రుణం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైతుల రుణ సమస్యలు కొంత తీరుతాయి. ఇక వ్యవస్థలో మొత్తంగా రుణ డిమాండ్ పెరుగుతుంది. – దినేష్ ఖేరా, ఎస్బీఐ ఎండీ వేచి చూడాల్సి ఉంది వృద్ధికి తాజా పాలసీ కొంత అవకాశం కల్పించింది. అయితే పూర్తి ఫలితానికి వేచి చూడాల్సి ఉంటుంది. ద్రవ్యలోటుసహా పలు అంశాలపై వృద్ధి జోరు ఆధారపడి ఉంటుంది. – ప్రజుల్ భండారీ, హెచ్ఎస్బీసీ (ఇండియా) చీఫ్ ఎకనమిస్ట్ మరింత తగ్గింపు ఉండవచ్చు ఆర్బీఐ నిర్ణయం హర్షణీయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో రేటు తగ్గింపు మరో విడత ఉండవచ్చని భావిస్తున్నాం. పెట్టుబడులు, వినియోగం పెరుగుదలకు ఇది అవసరం. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్ ఏప్రిల్‌లో మరో కోత ఏప్రిల్‌లో మరో దఫా రేటు కోత ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ధి మందగమనం దీనికి కారణం. ఆర్బీఐ నిర్ణయాలు వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతున్నాయి. – రాధికారావు, డీబీఎస్ ఎకనమిస్ట్ బ్యాంకింగ్ రంగానికి సానుకూలం శక్తికాంతదాస్ మొదటి పాలసీ బ్యాంకింగ్‌పై పెద్ద స్థాయిలో సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో రుణ వృద్ధికి అలాగే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే నిర్ణయం ఇది. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ -
డిసెంబర్లో తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: సంవత్సరాంతంలో ఆర్బీఐ తీపికబురు అందించనుంది. డిసెంబర్ 6న జరిగే ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతానికి తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉంది. అదే జరిగితే వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం కొంత మేర దిగివస్తుంది. డిసెంబర్లో ఆర్బీఐ వడ్డీ రేట్ల సమీక్ష సందర్భంగా పావు శాతం కోత ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 3.3 శాతానికి తగ్గడం ఈ దిశగా ఆర్బీఐకి సానుకూలాంశమని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ (బీఓఎఫ్‌ఏఎంల్) నివేదిక పేర్కొంది. ఈ నెలలో ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. వరుసగా ఆగస్ట్, సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతంగా ఉండటం, టొమాటో, ఉల్లి ధరలు తగ్గడంతో పాటు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో సైతం అదుపులో ఉండే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. దీంతో ఆర్బీఐ తన తదుపరి ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా డిసెంబర్లో వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గిస్తుందని అంచనా వేస్తున్నామని బీఓఎఫ్‌ఏఎంల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయిలో 5.7 శాతానికి పతనమైన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. -
కోతలు లేని ఆర్బీఐ చేతల్లో బ్యాంకులు
పాలసీ రేట్లు మార్చని ఆర్బీఐ బ్యాంకులు తగ్గించకపోవడం నాన్సెన్స్ అన్న రఘురామ్ రాజన్ ఇప్పుడే సాధ్యంకాదంటూ తొలుత బ్యాంకర్ల సన్నాయి నొక్కులు తర్వాత నాటకీయంగా బేస్ రేటు తగ్గించిన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ముంబై: రిజర్వుబ్యాంక్ గవర్నర్ ‘నాన్సెన్స్’ హెచ్చరిక పనిచేసినట్లుంది. మంగళవారంనాటి తాజా పాలసీ సమీక్షలో రఘురామ్‌రాజన్ కోతలకు నో చెప్పినా, బ్యాంకులు మాత్రం యస్ అన్నాయి. గత మూడు నెలల్లో రెండు దఫాలు పావుశాతం చొప్పున ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు ఫలితాన్ని వినియోగదారులకు బ్యాంకులు మళ్లించకపోవడంతో రాజన్ విరుచుకుపడిన వెంటనే బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వాటి బేస్ రేటును నాటకీయంగా తగ్గించాయి. కీలక రేట్లలో ఆర్బీఐ మార్పేదీ చేయకపోయినా, బ్యాంకులు రేట్లను తగ్గించడం విశేషం. ఎక్కడి రేట్లు అక్కడే... 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన తన మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రస్తుత రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ఏడాది చోటుచేసుకున్న రెండు దఫాల కీలక రేట్ల తగ్గింపూ పాలసీ సమీక్ష సందర్భంగా కాకపోవడం ఇక్కడ గమనార్హం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 7.5 శాతంగా కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు (బ్యాంకులు స్వల్పకాలికంగా తన వద్ద ఉంచే నిధులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.5 శాతంగానే ఉంటుంది. ఇక బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతుంది. ఇక స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన పరిమాణం) యథాతథంగా 21.5%గా ఉండనుంది. కారణం ఇదీ.. రేట్లు ఎక్కడివక్కడే ఉంచడానికి కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. ప్రత్యేకించి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలి అకాల వర్షాలను ప్రస్తావించింది. దీనివల్ల ఆహార ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఎప్పటికప్పుడు లభ్యమయ్యే స్థూల ఆర్థిక గణాంకాల ఆధారంగా తగిన ద్రవ్య పరపతి విధానాన్ని అనుసరించడం జరుగుతుందని గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం ఆయా అంశాలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఇక ఇప్పటికే రెండు దఫాలుగా అరశాతం పాలసీ రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించే అంశం సైతం పెండింగులో ఉండగా... ఇప్పటికిప్పుడు మరో దఫా కీలక రేటు తగ్గింపు సరికాదని ఆర్బీఐ భావించినట్లు కనబడుతోందని విశ్లేషకులు పేర్కొం టున్నారు. తదుపరి ‘కోత’ నిర్ణయం సైతం దీనిపైనే ఆధారపడి ఉంటుందని పాలసీ పేర్కొనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఊహించిన విధంగానే..: కేంద్రం పాలసీ నిర్ణయం ఊహించిన విధంగానే ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. బ్యాంకింగ్ కోర్టులో బంతి: పరిశ్రమలు పాలసీ రేటును ఆర్బీఐ తాజాగా తగ్గించకపోవడం పట్ల పరిశ్రమలు కొంత నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు పునరుత్తేజం, డిమాండ్ పునరుద్ధరణ వంటి అంశాలు రుణ రేటు కోతమీదే ఆధారపడి ఉన్నాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. అయితే రెండు దఫాలు పాలసీ రేటు కోతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం ఇక బ్యాంకింగ్ నిర్ణయంమీదే ఆధారపడి ఉందన్నారు. గత 2 దఫాల రుణ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం వినియోగదారులకు బదలాయించాలని రియల్టర్ల ప్రధాన సంఘం క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులు ఇప్పటికే పెండింగులో ఉన్నాయని, రుణ రేటు తగ్గింపు ప్రయోజనం ఇన్వెస్టర్లకు అందితేనే ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశముందని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ అన్నారు. బ్యాంకింగ్ ‘దిగిరాక’ తప్పదు: రాజన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాలు పాలసీ రేటు రెపోను అరశాతం తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించకపోవడంపై రాజన్ మాట్లాడుతూ, వడ్డీరేట్లు తగ్గించక తప్పని పరిస్థితిని మార్కెట్ పరిస్థితులే సృష్టిస్తాయని అన్నారు. నిధుల సమీకరణ వ్యయమే అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో రుణ రేటు తగ్గింపు కష్టమని బ్యాంకింగ్ వర్గాలు కొన్ని పేర్కొనడం ‘నాన్సెన్స్’గా రాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల రెండుసార్లు పావుశాతం చొప్పున పాలసీ రేట్ల కోత అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనివల్ల వ్యవస్థలో తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితి కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. పాలసీ రేటు తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు బదలాయించేలా తగిన వెసులుబాటును కల్పించడం లక్ష్యంగా ఆర్బీఐ పనిచేస్తుందని అన్నారు. వడ్డీరేట్లు తగ్గితే రుణ వృద్ధి రేటూ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లిక్విడిటీ, పోటీ పూర్వక వాతారణం వంటి అంశాలు బ్యాంకింగ్ వడ్డీరేట్లు తగ్గించే పరిస్థితిని సృష్టిస్తాయని అన్నారు. ఇలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఉత్పన్నమవుతుందని, వెరసి ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కల్పిస్తుందని విశ్లేషించారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అక్కడి నిర్ణయాలు తమ పాలసీ విధానంపై పెద్దగా ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం దేశానికి ఉందని అన్నారు. భారత్ వద్ద 343 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు ద్రవ్య నిధులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. సీఆర్ఆర్కూ- తక్కువ రుణ రేటుకు సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, సీఆర్ఆర్ తగ్గింపునకు ఎస్బీఐ డిమాండ్‌ను తోసిపుచ్చారు. 2015-16లో వృద్ధి 7.8 శాతం 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం అంచనా. ఇది 2015-16లో 7.8 శాతానికి పెరిగే అవకాశం. 2016 మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 5.8 శాతం. ఈ ఏడాది ఆగస్టు నాటికి 4 శాతం. జూన్ 2న రెండవ ద్వైమాసిక విధాన ప్రకటన. ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే (బ్యాంకుల) ఆవరణకు వెలుపల, అలాగే మొబైల్ ఏటీఎంల ఏర్పాటునకు స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు అనుమతి. 0.15-0.25 శాతం తగ్గించిన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వడ్డీ రేట్ల తగ్గింపు షురూ ముంబై: రిజర్వ్ బ్యాంక్ అక్షింతల నేపథ్యంలో బ్యాంకులు ఒక్కొక్కటిగా రుణాలపై కనీస వడ్డీ రేట్లను (బేస్ రేటు) తగ్గించడం మొదలుపెట్టాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.15-0.25 శాతం మేర తగ్గించాయి. దీంతో ఇకపై ఎస్బీఐ బేస్ రేటు 10 శాతం స్థాయి నుంచి 9.85 శాతానికి తగ్గుతుంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 14.75 శాతం నుంచి 14.60 శాతానికి తగ్గుతుంది. కొత్త రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం బేస్ రేటును 0.15% తగ్గించడంతో ఇది 9.85 శాతానికి దిగివస్తుంది. కొత్త రేటు ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 0.25 శాతం మేర తగ్గించడంతో ఇకపై బేస్ రేటు 9.75 శాతంగా ఉండనుంది. 10 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక లక్ష్మీవిలాస్ బ్యాంక్ రేట్ 0.15% తగ్గి 11.10 శాతానికి చేరింది.