ఆతిథ్య, వాహన రంగాలకు ఊతం | Nirmala Sitharaman cuts corporate taxes for domestic | Sakshi
Sakshi News home page

ఆతిథ్య, వాహన రంగాలకు ఊతం

Published Sat, Sep 21 2019 1:58 AM | Last Updated on Sat, Sep 21 2019 4:58 AM

Nirmala Sitharaman cuts corporate taxes for domestic - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి నిర్మలా సీతారామన్‌

పణజి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శుక్రవారం గోవాలోని పణజిలో సమావేశమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌.. దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో  వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్‌ సామర్థ్యమున్న పెట్రోల్‌ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.

జీఎస్టీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సీతారామన్‌ ఈ వివరాలను ప్రకటించారు. 1500 సీసీ ఇంజిన్‌ సామర్థ్యమున్న డీజిల్‌ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు సీతారామన్‌ తెలిపారు. అలాగే వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీని 5 నుంచి 1.5 శాతానికి తగ్గిస్తున్నామనీ, విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ లింక్‌..
 వెట్‌ గ్రైండర్లపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్‌ తెలిపారు. ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకింగ్‌ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రిజస్ట్రేషన్‌ సందర్భంగా ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సీతారామన్‌ చెప్పారు.   

జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే..
భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలపై జీఎస్టీ ఉండదన్నారు. ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేశారు. అలాగే ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినంను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు.  

కెఫిన్‌ పానీయాలపై కొరడా..
కెఫిన్‌ ఉన్న పానీయాలపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్నును పెంచింది. ప్రస్తుతం కెఫిన్‌ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అదనంగా 12 శాతం సెస్‌ విధిస్తామని తెలిపింది. దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. అలాగే బాదంపాలపై 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. మెరైన్‌ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచుతూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. చమురు–గ్యాస్‌ అన్వేషణ కోసం వాడే కొన్ని వస్తువులపై 5 శాతం పన్నును విధించనున్నారు.

ఆతిథ్య పరిశ్రమకు ప్రోత్సాహం
అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా జీఎస్టీ కౌన్సిల్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించారు. ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఔట్‌డోర్‌ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్‌ తెలిపారు. దీనివల్ల హోటళ్లలో ధరలు తగ్గుతాయనీ, తద్వారా ఆతిథ్య పరిశ్రమకు ఊతం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement