GST Council meeting
-
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తేస్తారా?
వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశంలో బీమా రంగం, ప్రభుత్వ ఖజానాపై విస్తృత ప్రభావాలను కలిగించే ఒక ముఖ్యమైన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఆ ప్రధాన ప్రతిపాదన.దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.“జీఎస్టీ నుంచి ఆరోగ్య బీమాను పూర్తిగా మినహాయిస్తే, నష్టం దాదాపు రూ. 3,500 కోట్లు. సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ నుండి ఆరోగ్య బీమా మినహాయింపును కౌన్సిల్ ఆమోదిస్తే భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది” అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.కమిటీ సిఫార్సులే కీలకంప్రస్తుతం అన్ని రకాల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ పన్ను నుండి ఆరోగ్య బీమాను మినహాయించాలనే ప్రతిపాదన రాష్ట్ర, కేంద్ర రెవెన్యూ అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ చర్చలో ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కౌన్సిల్‌కు సిఫార్సులు చేయడం కమిటీ బాధ్యత.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వ రెవెన్యూపై ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్నది ఫిట్మెంట్ కమిటీ విశ్లేషించి సిఫార్సులు చేస్తుంది. వీటిపైనే కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. -
Nirmala Sitharaman: పెట్రో జీఎస్టీ ఎంతన్నది... రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి
న్యూఢిల్లీ: ప్లాట్‌ఫాం టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదు. వాటితో పాటు రిటైరింగ్ రూములు, వెయిటింగ్ రూములు, క్లోక్ రూములు, ప్లాట్‌ఫాంలపై బ్యాటరీ వాహనాలు తదితర రైల్వే సేవలపై కూడా జీఎస్టీ తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా ఈ సందర్భంగా నిర్మల చర్చలు జరిపారు. కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల పథకం ప్రయోజనాలను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశమని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘అందుకు అంగీకరించాల్సింది ఇక రాష్ట్రాలే. అవి ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి పెట్రోల్, డీజిల్‌పై ఎంత శాతం జీఎస్టీ వేయాలో నిర్ణయించుకుని కౌన్సిల్‌కు తెలపాలి’’ అని భేటీ అనంతరం నిర్మల మీడియాతో అన్నారు. ‘‘ఇన్పుట్ క్రెడిట్ పన్నులో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయం జరిగింది. ఇన్వాయిసింగ్ తదితరాల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఇకపై దేశవ్యాప్తంగా బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. జీఎస్టీ చెల్లింపు తుది గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30కి పొడిగించాం. తద్వారా వర్తలకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు... → అన్ని రకాల సోలార్ కుక్కర్లపై ఇకనుంచి 12 శాతం జీఎస్టీ → అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. జమ్మూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల పళ్ల వ్యాపారులకు ప్రయోజనం. → స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. → విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా బయట ఉండే విద్యార్థులకు నెలకు రూ.20 వేల దాకా దాకా జీఎస్టీ మినహాయింపు → స్టీల్, అల్యుమినియం, ఇనుప పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ. → జీఎస్టీ ఎగవేత తదితర ఉదంతాల్లో జరిమానాలపై వడ్డీ ఎత్తివేత. -
తెలంగాణకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి: భట్టి విక్రమార్క
సాక్షి,ఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలలో తెలంగాణకు కొంత వెసులుబాటు కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరామని రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం(జూన్22) జీఎస్టీ కౌన్సిల్ భేటీ ముగిసిన తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి చేయాలి. సెస్, సర్ ఛార్జ్ పన్నులు పది శాతం మించకుండా చేయాలి. రాష్ట్రాల నికర రుణపరిమితి సీలింగ్ ముందుగానే చెపితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకుంటాం.జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద గత ఏడాది తెలంగాణకు 1.4 శాతమే నిధులు వచ్చాయి. ఉపాధి హామీ నిధులు ఆస్తుల సృష్టి పనులకి వినియోగించేలా అనుమతులు ఇవ్వాలి’అని కోరినట్లు భట్టి తెలిపారు. -
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా నిర్మలా సీతారామన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీని ప్రకటించింది.ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు, కౌన్సిల్ సభ్యులు, ఆర్థిక సహాయ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరవుతున్నారు.అంతకుముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2023 అక్టోబర్ 7న జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం సుంకం విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఆ తర్వాత మార్చి జీఎస్టీ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై విధించిన 28 శాతం పన్ను సమీక్షను కౌన్సిల్ వాయిదా వేసింది. -
ఆ ఉత్పత్తులపై జీరో జీఎస్టీ! కానీ... మెలిక పెట్టిన జీఎస్టీ కౌన్సిల్
అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meet) ముగిసింది. ఈ సమావేశంలో ఏయే నిర్ణయాలు తీసుకుంటారోనని అందరూ ఆతృతగా ఎదురుచూశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. 70 శాతం కంపోజిషన్ ఉన్న చిరుధాన్యాల (millet) పొడి ఉత్పత్తులపై జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే బ్రాండెడ్ చిరుధాన్యాల పొడి ఉత్పత్తులపై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని పేర్కొన్నారు. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బరువు ప్రకారం కనీసం 70 శాతం కంపోజిషన్‌తో కూడిన మిల్లెట్ పొడి ఉత్పత్తులను బ్రాండింగ్ లేకుండా విక్రయిస్తే జీఎస్టీ ఉండదని స్పష్టం చేశారు. కాగా గతంలో జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ పొడి మిల్లెట్ ఉత్పత్తులపై పన్ను మినహాయింపును సిఫార్సు చేసింది. భారత్ 2023ని 'చిరుధాన్యాల సంవత్సరం'గా పాటిస్తోంది. అధిక పోషక విలువలున్న చిరు ధాన్యాల పొడి ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా జీఎస్టీ మినహాయింపు, తగ్గింపులను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. Goods and Services Tax (GST) Council has decided to slash GST on millet flour food preparations from the current 18% GST to 5%: Sources to ANI — ANI (@ANI) October 7, 2023 -
చిన్న నీటి వనరుల మరమ్మతులపై జీఎస్టీని ఎత్తేయాలి
సాక్షి, హైదరాబాద్: చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో చిన్ననీటి వనరుల కింద 46 వేల జలాశయాలున్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ భేటీలో మంత్రి హరీశ్‌రావు పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమైనదని అందువల్ల మరమ్మతు పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అలాగే పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలకు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని ఆయన వివరించారు. లక్షలాది మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమపై ఇప్పటికే 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, బీడీ ఆకులపై మరో 16 శాతం పన్ను విధించడం వల్ల పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీడీలపై పన్నును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలి బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని హరీశ్ కోరారు. పన్నుల ఇన్వాయిస్ నిబంధనల సవరణ ప్రతిపాదనలను తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. టెలికాం సేవలకు సంబంధించి ట్రాయ్ నిబంధనల వల్ల ఆన్లైన్ వ్యాపారాల్లో వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని, దీనిని పరిశీలించి మార్పులు చేయాలని కోరారు. కాగా, ఈ విజ్ఞప్తులను పరిశీలన కోసం ఫిట్మెంట్ కమిటీకి సిఫారసు చేస్తూ కౌన్సిల్ ఆదేశించింది. పన్నుల ఇన్వాయిస్ లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీశ్‌తోపాటు సీఎస్ సోమేశ్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. -
పన్ను ఎగవేతల కట్టడిపై జీఎస్టీ మండలి దృష్టి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల మండలి (జీఎస్టీ కౌన్సిల్) శనివారం భేటీ కానుంది. జీఎస్టీ చట్టం కింద కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్ (కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించడం), అపీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు. వీటితో పాటు పాన్ మసాలా.. గుట్ఖా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టే విధానం రూపకల్పనపై ఇందులో చర్చించనున్నారు. జీఎస్టీతో పాటు ఆన్లైన్ గేమింగ్, కేసినోల అంశాలు కూడా 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమింగ్‌పై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 18 శాతం నుండి 28 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన పట్ల తమకు అభ్యంతరం ఏదీ లేదని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయి పన్ను స్థూల గేమింగ్ రాబడి (జీజీఆర్) పైనే విధించాలని, పోటీకి సంబంధించిన ప్రవేశ మొత్తంపై (సీఈఏ) 28 శాతం జీఎస్టీ విధింపు సరికాదని పేర్కొంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ప్రవేశ మొత్తంపైనే ఈ స్థాయి పన్ను విధిస్తే, అది దాదాపు 2.2 బిలియన్ డాలర్ల విలువచేసే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. జీజీఆర్ అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ ప్లాట్‌ఫారమ్‌లోని గేమ్‌లో పాల్గొనడానికి సర్వీస్ ఛార్జీలుగా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుము. అయితే పోటీ ఎంట్రీ అమౌంట్ (సీఈఏ) అనేది ప్లాట్‌ఫారమ్‌పై పోటీలో పాల్గొనడానికి ప్లేయర్ డిపాజిట్ చేసిన మొత్తం. ఆయా అంశాలు, సమస్యలపై గేమింగ్ పరిశ్రమ నిపుణులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. (గుడ్‌న్యూస్: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!) నేపథ్యం ఇదీ... ఆన్లైన్ గేమింగ్ జీజీఆర్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచడంపై డిసెంబర్ 17న జరుగుతుందన్న భావిస్తున్న జీఎస్టీ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో గేమింగ్ రంగంలో నిపుణులు కేంద్రానికి తమ కీలక సూచనలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జరగబోయే రానున్న జీఎస్టీ సమావేశంలో ప్యానెల్ క్యాసినో, రేస్ కోర్స్ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన ఎజెండాను చేపట్టవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్‌పై నివేదిక సమర్పించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. నివేదిక రూపకల్పన విషయంలో ఈ రంగానికి సంబంధించి పలు అంశాల పరిశీలనతో పాటు రాష్ట్రాల నుండి వచ్చే మరిన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) గేమ్స్ ఇవీ... నైపుణ్యాల ప్రాతిపదికన జరిగే ఆన్లైన్ గేమ్‌లలో ఇ–స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్‌లు, రమ్మీ, పోకర్ లేదా చెస్ ఉన్నాయి. ఇటువంటి గేమ్‌లు ఆన్లైన్లో ఉచితంగానూ ఆడవచ్చు. లేదా ఫ్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో డబ్బు చెల్లించి ఆడే వారూ ఉంటారు. చట్టబద్ద పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలి పోటీ ప్రవేశ మొత్తంపై కాకుండా స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ విధించాలని ఒకే పరిశ్రమగా ఒకే తాటిపై మేము కోరుతున్నాము. స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ 18 శాతం నుండి 28 శాతానికి పెరగడం వలన కేంద్రానికి పన్ను రాబడి పెరుగుతుంది. పరిశ్రమ కూడా దీనిని భరించగలుగుతుంది. ఇక పోటీ ప్రవేశ మొత్తంపై పన్ను విధించడం వల్ల పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. పెరిగిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపవలసి ఉంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎటువంటి పన్ను బాధ్యతలు లేని గ్రే మార్కెట్, ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆటగాళ్లు మారిపోతారు. దీనితో చట్టబద్ధమైన గేమింగ్ వ్యాపార సంస్థలు తమ కస్టమర్ బేస్‌ను కోల్పోతాయి. చివరకు చట్టబద్దమైన సంస్థలపై, ప్రభుత్వ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది- త్రివిక్రమన్ థంపి, గేమ్స్ 24గీ7 కో–చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతికూల ప్రభావాలు ఎంట్రీ ఫీజుల కంటే స్థూల గేమింగ్ రాబడిపై పరిశ్రమ జీఎస్టీ విధించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఎంట్రీ ఫీజుపై పన్ను విధింపు మాత్రం భారత్దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న గేమింగ్ రంగం వృద్ధిని నియంత్రిస్తుంది. ప్రవేశ రుసుములపై జీఎస్టీని వర్తింపజేయడం వలన ఇప్పటికే అనేక రకాల పన్నులు– రుసుములను చెల్లించే ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహపడతారు. స్థూల గేమింగ్ రాబడిపై పన్ను విధించడం వలన ప్లేయర్లు వారి నైపుణ్యం లేదా విజయంతో సంబంధం లేకుండా, న్యాయమైన సమానమైన మార్గంలో పన్ను చెల్లింపులకు సహకరిస్తారు. ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ విధింపు వల్ల కంపెనీలు లేదా ప్లేయర్లు చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ జూదం యాప్‌ల వైపు నడిచే అవకాశం ఉంది. ఇవి భారత్ చట్టాలకు అనుగుణంగాగానీ లేదా ఎకానమీకి లాభదాకంగా ఉండే అవకాశమే ఉండదు -సుమంత డే, డిజిటల్ వర్క్స్ సీనియర్ డైరెక్టర్ -
చేనేతకు ఊరట.. జీ ఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
-
ముగిసిన 46 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
చేనేత రంగాన్ని ఆదుకోవాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: చేనేత వస్త్రాలపై 12శాతం పన్ను వేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 12శాతం పన్నును అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి వివరాలు లేకుండా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. మన రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారని తెలిపారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని,నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. -
చేనేతపై జీఎస్టీ తగ్గించాలని కోరాం: బుగ్గన
-
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
పెట్రోల్ విషయంలో సామాన్యులకు మరోసారి నిరాశ!
లఖ్‌నవూలో ఈ రోజు జరిగిన 45వ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు అడిగిన విధంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కౌన్సిల్ చర్చినట్లు పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేధించనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితో పాటు సెప్టెంబర్ 30 వరకు వర్తించే కోవిడ్-19 సంబంధిత ఔషధాలపై రాయితీ జీఎస్టీ రేట్లు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించినట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, క్యాన్సర్ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వివరించారు. (చదవండి: మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ బైక్ : ధర?) -
ప్రారంభమైన జీఎస్టీ మండలి సమావేశం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి– జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం శుక్రవారం లక్నోలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైంది. 20 నెలల తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇది. కోవిడ్–19 లాక్‌డౌన్‌కు ముందు 2019 డిసెంబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ భౌతికంగా సమావేశం అయ్యింది. అన్ని పరోక్ష పన్నులను ఒకటిగా చేస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. ప్రస్తుతం నెలకు రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయి. (చదవండి: పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?) మండలి చర్చించే కీలక అంశాల్లో కొన్ని..! ► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోనికి తేవడం. ► పలు కోవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వ్యాధి నిర్ధారణ కిట్లు తదితర పరికరాలు, ఉత్పత్తులపై ప్రస్తుతం అమలు జరుగుతున్న సుంకాలు, పన్ను మినహాయింపులను డిసెంబర్ 31 వరకూ పొడిగింపు ► పొగాకువంటి సిన్ అండ్ డీమెరిట్ గూడ్స్‌పై సెస్ కొనసాగింపు, విధివిధానాలు ► దాదాపు 50 వస్తువులపై పన్ను రేట్ల సమీక్ష. ► జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా తయారు చేసిన సరఫరాలపై ఐదు శాతం జీఎస్టీ పన్ను విధింపు. చదవండి: అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ! -
FRBM Limit: 5 శాతానికి పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్బీఎం చట్టం కింద రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునే పరిమితిని 4 నుంచి 5 శాతానికి పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ అమలవుతోందని, దీని కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ 44వ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సచివాలయం నుంచి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఒక్క మే నెలలోనే తెలంగాణ రూ.4,100 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని హరీశ్‌రావు చెప్పారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచితే రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. త్వరగా వ్యాక్సిన్ ఇవ్వండి కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం వీలున్నంత త్వరగా ఉచిత వ్యాక్సినేషన్‌ను చేపట్టాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునైనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్సహా ఇతర వైద్య సామగ్రిపై జీఎస్టీ విధింపు విషయంలో మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు హరీశ్ మద్దతు పలికారు. చదవండి: నాలాల వెంబడి ఇళ్లలోని పేదలకు డబుల్ ఇళ్లు -
కోవిడ్ రాయితీపై చర్చ, నేడే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ మండలి సమావేశం కానుంది. బ్లాక్ ఫంగస్ మందులు, కోవిడ్ 19 అత్యవసరాలపై పన్ను రాయితీ అంశాన్ని మండలిలో చర్చించవచ్చని తెలుస్తోంది. 44వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో సహా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కోవిడ్ 19 చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్ శానిటైర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతరాలపై జీఎస్టీ రాయితీలిచ్చే విషయమై మేఘాలయ డిప్యుటీ సీఎం ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక సమావేశంలో చర్చకురానుంది. పలు రాష్ట్రాల మంత్రులు కరోనా ఎసెన్షియల్స్‌పై పన్నురాయితీలకు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా ముందులు, ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం, వాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. చదవండి : వామ్మో రూ. 3,500 కోట్లు ఎగ్గొట్టేశారు..! -
ఢిల్లీ: 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
2,641 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.2,641 కోట్లను వెంటనే ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. కరోనా మిగిల్చిన ఆర్థిక కష్టాలను పూడ్చుకునేందుకు ఈ నిధులు ఎంతో అవసరమని, వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని, ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలన్నారు. మంగళవారం బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అధ్యక్షతన జరిగిన ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి బీఆర్కేఆర్ భవన్ నుంచి మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ మొత్తం రూ.2,641 కోట్లు కాగా, జీఎస్టీ కౌన్సిల్ మాత్రం రూ.3 కోట్లు తగ్గించి చెబుతోందని, ఈ లెక్కలపై ఎలాంటి సమస్య లేదని, అయితే ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా రాష్ట్రాలకు చెల్లించాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ తరఫున సిఫార్సు చేయాలని మోదీని కోరారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మరో 3 నెలలు ఆగాల్సి వస్తుందని చెప్పారు. హరీశ్ ప్రతిపాదనపై స్పందించిన సుశీల్ మోదీ అక్టోబర్ 1న మరో మారు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తెలం గాణతో పాటు మరో 16 రాష్ట్రాలకు 2018 నుంచి ఐజీఎస్టీ బకాయిలు ఉన్నాయని, 8 రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులను కన్సాలిడేట్ ఫండ్ నుంచి చెల్లింపులు చేసే సమయంలో సర్దుబాటు చేయాలని హరీశ్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి హరీశ్‌తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది. గడువు దాటి దాఖలు చేసే రిటర్నులపై రుసుము, వడ్డీ భారాన్ని తగ్గించింది. రూ.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం కలిగిన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే, వడ్డీ రేటును సగానికి (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గిస్తూ శుక్రవారం జరిగిన భేటీలో నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాఖలు చేసే రిటర్నులకు ఈ తగ్గింపు అమలవుతుంది. ఇక ఈ ఏడాది మే, జూన్, జూలై నెలలకు సంబంధించిన రిటర్నులను ఎటువంటి వడ్డీ భారం లేకుండానే సెప్టెంబర్ వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం వెల్లడించారు. లాక్డౌన్ అమలైన ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం ఏ మేరకు ఉండొచ్చన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 45 శాతం వరకు ఉండొచ్చన్నారు. టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి జీఎస్టీ హేతుబద్ధీకరణపై నిర్ణయాన్ని కౌన్సిల్ వాయిదా వేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో.. పన్ను చెల్లించాల్సిఉండి, జీఎస్టీఆర్–3బీ రిటర్నులను 2017 జూలై 1 నుంచి 2020 జనవరి కాలానికి ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే అప్పుడు గరిష్ట ఆలస్యపు రుసుము రూ.500గానే ఉంటుంది. ప్రతి నెలా రిటర్నుపై రూ.500 చొప్పున అమలవుతుంది. ఇప్పుడున్న రూ.10,000 రుసుముతో పోలిస్తే భారీ గా తగ్గింది. అదేవిధంగా ఇదే కాలానికి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని సంస్థలు రిటర్నులు ఆలస్యం గా దాఖలు చేసినా ఆలస్యపు రుసుము ఉండదు. కాంపెన్సేషన్ సెస్సుపై జూలైలో నిర్ణయం రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించే ‘కాంపెన్సేషన్ సెస్సు’పై ప్రత్యేకంగా చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో మరోసారి భేటీ కానుంది. కేంద్రం గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలానికి రాష్ట్రాలకు పరిహారంగా రూ.36,400 కోట్లను విడుదల చేసినప్పటికీ.. వాస్తవ అంచనాలతో పోలిస్తే ఇంకా లోటు నెలకొంది. మార్చి నెల కు సంబంధించి రూ.12,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని అయినా తమకు చెల్లించాలని రాష్ట్రాలు కోరాయి. పరోటాలపై జీఎస్టీ 18% న్యూఢిల్లీ: తినడానికి సిద్ధంగా ఉండే (రెడీ టు ఈట్) పరోటాలను మానవ వినియోగానికి వీలుగా మరింత ప్రాసెస్ (సిద్ధం చేసుకోవడం) చేసుకోవాల్సి ఉంటుందని.. కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. హోల్ వీట్ పరోటా, మలబార్ పరోటాలను జీఎస్టీలోని చాప్టర్ 1905కింద గుర్తించి 5 శాతం జీఎస్టీ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థ ఏఏఆర్ను ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. చాప్టర్ 1905 లేదా 2106లో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఉత్పత్తులకే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందంటూ, అవి ఖాఖ్రా, సాధారణ చపాతీ లేదా రోటి అయి ఉండాలని ఏఏఆర్ స్పష్టం చేసింది. -
సెల్ఫోన్లపై జీఎస్టీ ఇకపై 18%
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 1నుంచి అమలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇక్కడ జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్వర్క్ డిజైన్ మెరుగుపరచాలని ఈ సమావేశం ఇన్ఫోసిస్‌ను కోరింది. ► పూర్తి స్థాయిలో జీఎస్టీ నెట్వర్క్ సామర్ధ్యం పెంపు, నిపుణులైన సిబ్బంది నియామకం, సమస్యలకు సులభ పరిష్కారాలు చూపడం వంటివి ఈ ఏడాది జూలై కల్లా పూర్తి కావాలి. కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ► మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. ► విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపైర్, ఓవర్‌హౌల్(ఎంఆర్వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎంఆర్వో సేవలు దేశంలోనే ప్రారంభం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ► ఈ–వాయిస్, క్యూఆర్ కోడ్ అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ► ఎగుమతిదారులకు ఈ–వాలెట్ స్కీం నమోదు గడువును 2021 మార్చి 31కి పొడిగించింది. ► ఆలస్యమైన జీఎస్టీ చెల్లింపులపై వడ్డీని జూలై 2017 నుంచి అమలయ్యేలా చట్టాన్ని సవరణకు నిర్ణయం. ► మార్చి 14 వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన వారు కావాలనుకుంటే తిరిగి జూన్ 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► 2018–19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్టీఆర్–9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపు నిచ్చింది. ► జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్ సప్లయర్’ పేరుతో కొత్త సౌకర్యం. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
ఆతిథ్య, వాహన రంగాలకు ఊతం
పణజి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం గోవాలోని పణజిలో సమావేశమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్.. దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్ సామర్థ్యమున్న పెట్రోల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సీతారామన్ ఈ వివరాలను ప్రకటించారు. 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీని 5 నుంచి 1.5 శాతానికి తగ్గిస్తున్నామనీ, విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్‌పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ లింక్.. వెట్ గ్రైండర్లపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకింగ్ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రిజస్ట్రేషన్ సందర్భంగా ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సీతారామన్ చెప్పారు. జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే.. భారత్‌లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అండర్–17 మహిళల ప్రపంచకప్‌కు కోసం వినియోగించే వస్తుసేవలపై జీఎస్టీ ఉండదన్నారు. ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేశారు. అలాగే ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినంను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు. కెఫిన్ పానీయాలపై కొరడా.. కెఫిన్ ఉన్న పానీయాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్నును పెంచింది. ప్రస్తుతం కెఫిన్ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అదనంగా 12 శాతం సెస్ విధిస్తామని తెలిపింది. దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. అలాగే బాదంపాలపై 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. మెరైన్ ఫ్యూయెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చమురు–గ్యాస్ అన్వేషణ కోసం వాడే కొన్ని వస్తువులపై 5 శాతం పన్నును విధించనున్నారు. ఆతిథ్య పరిశ్రమకు ప్రోత్సాహం అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా జీఎస్టీ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించారు. ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఔట్‌డోర్ కేటరింగ్‌పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. దీనివల్ల హోటళ్లలో ధరలు తగ్గుతాయనీ, తద్వారా ఆతిథ్య పరిశ్రమకు ఊతం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. -
పన్ను రేట్ల కోత..?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో బిస్కెట్ల నుంచి ఆటోమొబైల్ విభాగం వరకూ, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) నుంచి హోటెల్స్ వరకూ వివిధ రంగాల నుంచి రేట్ల తగ్గింపునకు గట్టి డిమాండ్ వస్తోంది. పన్ను కోతల వల్ల వినియోగం, దేశీయ డిమాండ్ పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే పన్నుల తగ్గింపువల్ల అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థ మరింత ఇబ్బందుల్లో పడుతుందని జీఎస్టీ కౌన్షిల్ ఫిట్మెంట్ కమిటీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో చర్చించే అవకాశమున్న మరిన్ని అంశాలు... ► జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు జీఎస్టీ చట్ట నిబంధనల వర్తింపునకు సవరణలపై చర్చ ►పసిడి, ఇతర విలువైన రాళ్ల రవాణా విషయంలో కేరళ ప్రతిపాదిస్తున్న ఈ–వే బిల్ వ్యవస్థపై దృష్టి ►ఆధార్ నంబర్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనుసంధానించాలని∙ప్రతిపాదన. దశలవారీగా వాహనాలపై జీఎస్టీని తగ్గించాలి: హీరో మోటో ఆటోమొబైల్ వాహనాలపై దశలవారీగా అయినా జీఎస్టీ రేటును తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని హీరో మోటోకార్ప్ కోరింది. ముందుగా ద్విచక్ర వాహనాలపై వెంటనే రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తర్వాత దశలో కార్లపై రేట్లను తగ్గించాలని సూచించింది. కీలకమైన జీఎస్టీ భేటీ శుక్రవారం జరగనుండగా, దానికి ఒక్క రోజు ముందు హీరో మోటో కార్ప్ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఒకేసారి ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉండదని పేర్కొంది. అదే సమయంలో 2 కోట్ల ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఇది ఉపశమనం ఇస్తుందని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్‌గుప్తా అన్నారు. కాగా, ఆటోమొబైల్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ తిరస్కరించిన విషయం గమనార్హం. సానుకూల నిర్ణయం...: టాటా మోటార్స్ వాహన రంగం రంగం పురోగతికి సంబంధించి జీఎస్టీ మండలి నుంచి ఒక కీలక సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుంటర్ బషెక్ వ్యాఖ్యానించారు.