ముంబై: ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పరమైన చర్చలు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈవారంలో మార్కెట్లను ప్రభావితం చేసే దేశీ ఆర్థిక అంశాలు ఏమీ లేనందున.. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలు సూచీలపై ప్రభావం చూపనున్నాయి.’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ వెల్లడించారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే సానుకూల అంశాలు లేకపోవడం, ముడిచమురు ధరలు పెరుగుతుండడం వంటి ప్రతికూలతలు ఉన్న కారణంగా ఈవారంలో అధిక శాతం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం!
మంగళవారం హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్ డేటా వెల్లడితో ఈవారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రారంభంకానున్నాయి. 20న (బుధవారం) రెడ్‌బుక్ ఈ–కామర్స్ రిటైల్ సేల్స్, ఫిబ్రవరి 15తో ముగిసే వారానికి యూఎస్ ఎంబీఏ మార్టిగేజ్ అప్లికేషన్ డేటా వెల్లడికానుంది. గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్, ఏపీఐ క్రూడ్ వివరాలు... ఫిబ్రవరి 16తో ముగిసే వారానికి జాబ్‌లెస్ క్లెయిమ్స్, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వెల్లడికానున్నాయి. అదే రోజున ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల గణాంకాలు, ఫిబ్రవరి కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ డేటా కూడా గురువారమే వెల్లడికానుంది.
ఇతర ప్రధాన దేశాల స్థూల ఆర్థిక అంశాల విషయానికి వస్తే.. సోమవారం జనవరి నెలకు సంబంధించిన చైనా వాహన విక్రయ గణాంకాలు, జపాన్ డిసెంబర్ మెషినరీ ఆర్డర్స్ వెలువడనుండగా.. మంగళవారం యూరో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్, డిసెంబర్ నిర్మాణ డేటా వెల్లడికానుంది. గురువారం యూరో జోన్ ఫిబ్రవరి తయారీ, కాంపోజిట్ అండ్ సర్వీసెస్ పీఎంఐ వెల్లడికానుంది. ఈ ప్రాంత జనవరి ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ఇదే రోజున చైనా జనవరి నెల గృహ ధరల సూచీ, జపాన్ జనవరి ద్రవ్యోల్బణం వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంతర్జాతీయ అంశాలకు తోడు ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట..!
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ ఈనెల 20న (బుధవారం) సమావేశంకానుంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సుల మేరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్నటువంటి 28% పన్నురేటును 18%కి తగ్గించాలని ప్రతిపాదన ఉండగా.. అందుబాటు గృహాల విభాగానికి చెందిన ప్రాజెక్టులపై అమల్లో ఉన్న 8% పన్నును 3%కి తగ్గించాలనే సిఫార్సులను కౌన్సిల్ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందని అంచనా.
మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలా వద్దా..?
ఈ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిపై కేంద్ర బ్యాంక్ సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ మేరకు ఢిల్లీలో సమావేశంకానున్న ఆర్‌బీఐ బోర్డు సమావేశం జరగనుంది.
ముడిచమురు ధరల ప్రభావం..
గతేడాది డిసెంబర్‌లో 50 డాలర్ల కనిష్టాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర.. గతవారం చివరినాటికి 31% పెరిగింది. గతవారంలో 6.7% పెరిగి 66.25 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ గతవారం 9 పైసలు బలహీనపడింది. ఈవారంలో రూపాయి విలువ 71.60–70.90 స్థాయిలో ఉండొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చెబుతోంది.
ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు
ఫిబ్రవరి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,322 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే ఇదే సమయంలో రూ.248 కోట్లను వీరు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.5,074 కోట్లను ఈ 15 రోజుల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడి పెట్టారు. ఇకపై వీరు ఎటువంటి ధోరణి అవలంభిస్తారనే అంశం లోక్ సభ ఎన్నికలు, క్రూడ్ ఆయిల్ ధరలపై ఆధారపడి ఉందని బజాజ్ క్యాపిటల్ హెడ్ అలోక్ అగర్వాల్ అన్నారు.
అంతర్జాతీయ పరిణామాలు కీలకం..!
Published Mon, Feb 18 2019 5:09 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment