28% శ్లాబులో ఇక 35 మాత్రమే | 35 goods in highest tax bracket of GST | Sakshi
Sakshi News home page

28% శ్లాబులో ఇక 35 మాత్రమే

Published Mon, Jul 23 2018 2:07 AM | Last Updated on Mon, Jul 23 2018 2:07 AM

35 goods in highest tax bracket of GST - Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో అత్యధిక పన్ను రేటైన 28 శాతం శ్లాబులో ఇక 35 వస్తువులే మిగిలాయి. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 28 శాతం శ్లాబులో మొత్తం 226 వస్తువులు ఉండేవి. అయితే గత ఏడాది కాలంలో ఈ శ్లాబులోని 191 వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను తగ్గించింది. వాటిలో కొన్నింటిపై పన్ను పూర్తిగా ఎత్తివేయగా, మరి కొన్నింటిని 5, 12, 18 శాతం శ్లాబుల్లో చేర్చింది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రలు కడిగే యంత్రాలు, 27 అంగుళాల కంటే పెద్దవైన టీవీలు, తదితర విలాసవంతమైన వస్తువులతోపాటు సిగరెట్లు, గుట్కా వంటి ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి.

ఈ నెల 27న కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చి, స్థిరమైన ఆదాయం రావడం మొదలైన అనంతరం.. 28 శాతం శ్లాబు నుంచి మరికొన్ని వస్తువులను కూడా ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, ఆరోగ్య హానికారక ఉత్పత్తులపైన మాత్రమే అత్యధిక పన్నును వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చంటున్నారు.పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్‌ కెమెరాలు, ఏసీలు తదితరాలను కూడా ప్రభుత్వం 18 శాతం పన్ను శ్లాబులోనే చేర్చొచ్చని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి ఎంఎస్‌ మణి పేర్కొన్నారు. ఆరోగ్యానికి చేటు చేసే ఉత్పత్తులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. భవిష్యత్తులో అత్యంత విలాస వస్తువులు, ఆరోగ్యం పాడు చేసే ఉత్పత్తులపైనే 28 శాతం పన్ను ఉండేలా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ భాగస్వామి అభిషేక్‌ జైన్‌ అంటున్నారు.

27 నుంచి 28 శాతం శ్లాబులో మిగిలేవి
ఏసీలు, 27 అంగుళాల కన్నా పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో రికార్డర్లు, సిమెంటు, మోటార్‌ వాహనాలు, వాహనాల విడిభాగాలు, టైర్లు, స్టీమర్లు, విమానాలు, శీతల పానీయాలు, బెట్టింగ్, పొగాకు, సిగరెట్, పాన్‌ మసాలా, గుట్కాలు తదితరాలు.

భవిష్యత్తులో మూడు శ్లాబ్‌లే: సుశీల్‌ మోదీ
జీఎస్టీలో పన్ను రేట్ల శ్లాబ్‌లను భవిష్యత్తులో మూడుకు తగ్గించే అవకాశం ఉండొచ్చని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ వెల్లడించారు. జీఎస్టీపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘానికి సుశీల్‌ నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. ‘ప్రస్తుతం జీఎస్టీలో 0, 5, 12, 18, 28 శాతం పన్నులు.. మొత్తం 5 శ్లాబులు ఉన్నాయి. వీటిని మూడుకు తగ్గించే ఆలోచన ఉంది. అయితే, ఇది రాష్ట్రాల ఆదాయానికి సంబంధించింది కాబట్టి సమయం పడుతుందని సుశీల్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement