బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇదీ చదవండి: ఎస్‌సీడీఆర్‌సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఎవరు హాజరయ్యారంటే..
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment