GST council approves
-
బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.ఇదీ చదవండి: ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టుఎవరు హాజరయ్యారంటే..కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. -
మిల్లెట్ల పిండిపై 5% పన్ను
న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. -
జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు!
రెండు రోజుల పాటు జరిగిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి నిర్ణయక మండలి 47వ సమావేశం ముగిసింది. చండీగఢ్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ కొత్త పన్ను రేట్లను విధించింది. విధించిన ఆ పన్ను రేట్లు జులై 18 నుంచి అమల్లోకి రానుండగా..ఏ వస్తువులపై ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం. ♦ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వంటింట్లో విరివిరిగా వినియోగించే ప్యాకింగ్,లేబుల్ వేసిన పాలు,పెరుగు, చేపలపై 5శాతం జీఎస్టీ, బ్యాంక్ ఖాతాదారులకు అందించే చెక్ బుక్‌లపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. ♦వీటితో పాటు రూ.1000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హోటల్ రూమ్స్‌పై జీఎస్టీ లేదు. ♦రూ.5వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న హాస్పిటల్ రూమ్స్‌లో ఉంటే వాటిపై 5శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంది. గతంలో హాస్పిటల్ రూమ్స్‌పై ఎలాంటి జీఎస్టీ లేదు. తాజాగా హాస్పిటల్ రూమ్స్ పై పన్ను వసూలు చేయడంపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ఎండు చిక్కుళ్లు, మకనా, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్ ఎరువుపై 5 శాతం జీఎస్టీ ♦సోలార్ వాటర్ హీటర్,లెదర్ ప్రొడక్ట్‌లపై 5 శాతం నుంచి 12శాతం జీఎస్టీ పెంపు ♦ప్రింటింగ్, డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడీ బల్బులు, డ్రాయింగ్ చేసేందుకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్(ఉదా: డ్రాఫ్టింగ్ బోర్డ్, డ్రాఫ్టింగ్ మెషిన్, రూలర్స్, టెంప్లెట్స్, కంపాస్) బ్రేడ్లు,స్పూన్లు, ఫోర్క్లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తగ్గేవి ఇవే ♦ఆర్ధోపెడిక్ ఉపకరణాలపై 12నుంచి 5శాతానికి పన్ను తగ్గింపు ♦ట్రాన్స్ పోర్ట్ గూడ్స్, రోప్ వేస్ పై 18శాతం నుంచి 5శాతానికి కుదింపు ♦ఇంధనం ధర కలిపి అద్దెకు తీసుకునే ట్రక్, సరుకు రవాణా వాహనాల అద్దెపై పన్ను తగ్గింపు చదవండి👉 సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. -
20% జీఎస్టీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. -
పెద్ద కార్ల రేట్లకు రెక్కలు
♦ 25 శాతానికి పెరగనున్న సెస్సు ♦ పెంపు ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం ♦ ఆందోళనలో కార్ల కంపెనీలు న్యూఢిల్లీ: గత నెల 1న వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఖరీదైన లగ్జరీ కార్ల రేట్లు తాత్కాలికంగా కాస్త తగ్గినా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. ఈ దిశగా పెద్దకార్లపై సెస్సును 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కార్లు అత్యధిక శ్లాబ్ రేటు 28 శాతం పరిధిలోకి రాగా, అదనంగా 1–15 శాతం దాకా సెస్సు ఉంటోంది. వస్తు, సేవల పన్నుల విధానం అమల్లోకి వచ్చాక గత విధానంలో కన్నా వాహనాలపై మొత్తం పన్ను భారం తగ్గడంతో .. ఆగస్టు 5న జరిగిన 20వ సమావేశంలో ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8702, 8703 విభాగాల కిందకి వచ్చే వాహనాలపై గరిష్ట సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చట్ట సవరణలు చేయొచ్చంటూ కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అయితే పెంపు ఎప్పట్నుంచి విధించేదీ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని పేర్కొంది. కార్లు, పొగాకు, బొగ్గు మొదలైన వాటిపై వసూలు చేసే సెస్సును .. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయనష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇందుకోసం గరిష్ట సెస్సు రేటును నిర్దేశించే ప్రత్యేక చట్టాన్నీ రూపొందించింది. తాజాగా సెస్సు రేటును సవరించాలంటే.. సదరు చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలు.. 8702, 8703 హెడింగ్స్ కింద వర్గీకరించిన వాహనాల్లో మధ్య స్థాయి, పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (ఎస్యూవీ), సంఖ్యాపరంగా పది మంది కన్నా ఎక్కువ.. 13 కన్నా తక్కువ మంది ప్రయాణించగలిగే వాహనాలు ఉన్నాయి. అలాగే 1500 సీసీ పైబడిన హైబ్రీడ్ కార్లు కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. చాలా మటుకు కార్లకు 28 శాతం గరిష్ట పన్ను పరిధిలో ఉన్నప్పటికీ, పెద్ద వాహనాలు, ఎస్‌యూవీలు, హైబ్రీడ్ కార్లు మొదలైన వాటికి అదనంగా మరో 15 శాతం సెస్సు ఉంటోంది. 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1200 సీసీ సామర్థ్యం గల చిన్న పెట్రోల్ కార్లపై సెస్సు 1 శాతంగా ఉండగా, అదే పొడవుతో 1500 సీసీ సామర్థ్య మున్న చిన్న డీజిల్ కార్లపై సెస్సు 3 శాతంగా ఉంటోంది. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు... మోటారు వాహనాలపై గరిష్ట పన్ను 52–54.72 శాతం స్థాయిలో ఉండేది. సీఎస్టీ, ఆక్ట్రాయ్ మొదలైన వాటికి సంబంధించి మరో 2.5 శాతం దీనికి తోడయ్యేది. అయితే, జీఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం పన్ను పరిమితి 43 శాతానికి తగ్గింది. దీంతో చాలా మటుకు కంపెనీలు తమ ఎస్‌యూవీల రేట్లను రూ. 1.1 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా తగ్గించాయి. అయితే, గత విధానం తరహాలోనే ఈ పరిమితిని కొనసాగించేందుకు ప్రస్తుతం గరిష్టంగా ఉన్న 28 శాతం జీఎస్టీకి మరో 25 శాతం సెస్సును జోడించాల్సిన అవసరం ఉందని జీఎస్టీ కౌన్సిల్ భావించి తాజా నిర్ణయం తీసుకుంది. ఇలాగైతే విస్తరణ ప్రణాళికలకు విఘాతం.. పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంపు ప్రతిపాదనపై వాహన తయారీ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. జీఎస్టీ తర్వాత చౌకగా మారిన పెద్ద కార్ల రేట్లు మళ్లీ పెరిగేలా సెస్సు విధించే ప్రతిపాదన పరిశ్రమ సెంటిమెంటును దెబ్బతీస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్పందనలు ఇలా... ‘దీన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్ రంగం తోడ్పాటుపై ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి‘ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ చెప్పారు. ‘లగ్జరీ కార్ల తయారీ దిగ్గజమైన మా కంపెనీ.. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తలపెట్టిన భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఇలాంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి‘ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ పేర్కొన్నారు. తప్పనిసరిగా తమ వ్యాపార ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ చెప్పారు. సెస్సు పెంపు నిర్ణయం కంపెనీలు, డీలర్లు, కస్టమర్లతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులపైనా ప్రతికూల ప్రభావం తప్పదన్నారు. తక్షణమే ఇలా సెస్సులను మార్చేస్తుండటం.. భారత్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ అభిప్రాయపడ్డారు.