న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్‌ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు.
భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే
వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment