Minister Piyush Goyal
-
దేశంలో 1330 విదేశీ కంపెనీల మూత
న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు కలిపి సుమారు 1330 కంపెనీలు గడిచిన మూడేళ్ల కాలంలో భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు వెల్లడించారు. మరోవైపు గత మూడేళ్లలో 4,994 విదేశీ కంపెనీలు లేదా వాటి సబ్సిడరీలు భారత్‌లో కార్యకాలాపాలు ఆరంభించినట్టు చెప్పారు. దేశం మొత్తం మీద 17,432 విదేశీ కంపెనీలు, వాటి సబ్సిడరీలు ప్రస్తుతం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభకు వెల్లడించారు. కార్యకలాపాలు మూసివేయడం అన్నది ఆయా కంపెనీల వ్యక్తిగత వాణిజ్య నిర్ణయాలుగా మంత్రి పేర్కొన్నారు. కార్యకలాపాలు లాభసాటిగా లేకపోవడం, వనరుల లభ్యత, మార్కెట్ పరిమాణం, సదుపాయాలు, రాజకీయ, స్థూల ఆర్థిక వాతావరణం తదితర అంశాలు కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్నారు. మరో ప్రశ్నకు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ స్పందిస్తూ.. భారత్–చైనా మధ్య వాణిజ్య అంతరం 2021–22లో 73 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు తెలిపారు. -
20% జీఎస్టీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. -
రైల్వేలో మరో 20వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుతుందన్నారు. ‘రైల్వేశాఖ దేశంలోని యువత కోసం 1.10 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన భర్తీ ప్రక్రియ మరింత విస్తృతమయింది’ అని గోయల్ ట్వీట్‌చేశారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల్లో రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్)కు సంబంధించి 9 వేల పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ ఉద్యోగాల భర్తీకి ఈఏడాది మేలో నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. रेलवे में 90,000 के स्थान पर 1,10,000 जॉब के अवसरः RPF एवं RPSF में 9,000 तथा L1 व L2 में 10,000 से अधिक पदों के लिये भर्ती होंगी। 1,10,000 jobs in Railways for youth: One of the world's biggest recruitment drive gets even bigger. Get more information at https://t.co/OiflV87xxt pic.twitter.com/OLK32ls6ko — Piyush Goyal (@PiyushGoyal) March 29, 2018 -
ఢిల్లీలో డీజిల్ ఇంజిన్లు మరో ఏడాదే!
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయ్యికి పెంచాల్సి ఉందని గోయల్ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా. -
త్వరలో రైల్వే టికెట్లపై డిస్కౌంట్లు!
న్యూఢిల్లీ: విమానాలు, హోటళ్ల తరహాలోనే త్వరలో సీట్లు భర్తీకాని రైళ్లలో టికెట్ ధరలో డిస్కౌంట్ అందజేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్.. డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. భర్తీకాని రైళ్లలో టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించడంపై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వినీ లోహానీ అనుభవం తమకు ఉపయోగపడుతుందన్నారు. పండుగ సీజన్లలో, వారాంతాల్లో, రద్దీ తక్కువగా ఉండేకాలంలో టికెట్ ధరల్ని సవరించేందుకు ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీలను అమర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
పట్టాలపై ‘అదనపు’ భారం
సాక్షి, హైదరాబాద్: రోడ్డుపై వాహనాల సంఖ్య పెరిగితే ట్రాఫిక్ జాం అవుతుంది.. ఆ సమయంలో వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాదాలకూ అవకాశం కలుగుతుంది. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేదీ ఇదే పరిస్థితి! ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ను గరిష్ట సామర్థ్యాన్ని మించి వినియోగించుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే... తిరగాల్సినవాటి కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా దసరా నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో రైళ్లను తిప్పింది. వీలైనన్ని అదనపు రైళ్లను పట్టాలెక్కించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని కొందరు అధికారులు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఎక్కడో ఓ చోట మానవ తప్పిదం తలెత్తితే భారీ ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమైన మార్గాల్లో రెండు, మూడో లైన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించగలిగితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని బోర్డు ముందుంచినట్టు తెలిసింది. జాప్యం అంశంపై కొత్త రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఆదాయం సరే.. కానీ.. ఈసారి వినాయక చవితి, దసరా కలిసి వచ్చిన సెప్టెంబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్ రైళ్లు కాకుండా 123 ప్రత్యేక రైళ్లను నడిపింది. రూ.7.70 కోట్ల అదనపు ఆదాయం ఆర్జించింది. ఉన్న రైళ్లకు అదనంగా 540 బోగీలను ఏర్పాటు చేసి మరో రూ.1.90 కోట్ల ఆదాయాన్ని పొందింది. గతేడాది దసరా, దీపావళి అక్టోబర్‌లో వచ్చాయి. ఈ రెండు పండుగలకు కలిపి 132 అదనపు రైళ్లు నడిపారు. ఈసారి ఇంకా దీపావళి రాకుండానే 123 అదనపు రైళ్లను నడపడం గమనార్హం. గతేడాది అదనపు ఆదాయం కేవలం రూ.5.80 కోట్లు. ఈసారి దసరాకే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. కానీ.. అదే సమయంలో రైళ్ల ట్రాఫిక్ తీవ్రంగా ఉన్న లైన్లపై అన్ని అదనపు రైళ్లను నడపటం చర్చనీయాంశమైంది. బల్లార్షా, విజయవాడ వైపు మూడో మార్గం పూర్తి కావాల్సి ఉన్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రెండేళ్ల తర్వాతగాని ఇది అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. నడికుడి, బెంగళూరు, నిజామాబాద్ మార్గాల్లోనూ అంతే. మహబూబ్‌నగర్, నిజామాబాద్ మార్గాల్లో ఇంకా సింగిల్ లైనే వాడుతున్నారు. ఈ లైన్ల నిర్మాణం విషయంలో అధికారులు వేగాన్ని పెంచకపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో అదనపు రైళ్లను నడపాల్సి వస్తోంది. -
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు మోక్షం!
పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ సిఫారసు మరో వారం రోజుల్లో అనుమతుల జారీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. రెండేళ్లుగా చిక్కుల్లో ఉన్న ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 20న సమావేశమైన ఈఏసీ.. ఈ మేరకు చేసిన సిఫారసులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మరోవారం రోజుల్లో పర్యావరణ అనుమతులు జారీ కావచ్చని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించేందుకు బీహెచ్ఈఎల్ వద్ద అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బాయిలర్లు ఉపయోగించి తక్కువ కాలంలో 1080 (4‘‘270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రం నిర్మించాలని రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.7,290.60 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారాంపురం గ్రామాల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అప్పట్లో శంకుస్థాపన కూడా నిర్వహించింది. 2016 డిసెంబర్ 31 లోగా ప్లాంటును నిర్మిస్తామని అప్పట్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీ ప్రకటన చేశారు. అయితే అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ అనుమతులు రాకముందే భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో ప్రాజెక్టు మరింత చిక్కుల్లో పడింది. కొంత కాలం తర్వాత ఎన్జీటీ కేసు నుంచి ఉపశమనం లభించినా, పర్యావరణ అనుమతుల కష్టాలు మాత్రం కొనసాగాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ఈ విద్యుత్ కేంద్రాన్ని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది చివర్లో ప్రకటించడంతో భద్రాద్రి ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే ప్లాంట్‌పై జెన్కో రూ.1,000 కోట్లకు పైగా వ్యయం చేయడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. వరుస వివాదాలు, చిక్కులతో ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమై సబ్ క్రిటికల్ నిబంధన విషయంలో భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరగా, సానుకూల నిర్ణయం వచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 2017 డిసెంబర్‌లోగా నిర్మించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అనుమతించగా, దీని ఆధారంగానే తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈఏసీ.. పర్యావరణ అనుమతుల జారీకి సిఫారసు చేసింది. ఏడాదిలోగా పూర్తి చేస్తాం.. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని ఈఏసీ సిఫారసు చేస్తుందని ముందే ఊహించాం. నిర్ణయం సానుకూలంగా వచ్చింది. అనుమతులు అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన ఏడాదిలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం. – జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు -
విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరాలోచించాలి
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ భారత దేశంలో కరెంటు కోత ల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో యూనిట్ కరెంటు ధర ప్రస్తుతం రూ.2.2లకే అందుబాటులో ఉందని, దక్షిణాదికి కరెంటు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దేశమంతా ఒకే గ్రిడ్-ఒకే ధర లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 2400 మెగావాట్ల ఉత్పత్తికి ప్లాంట్ల ప్రారంభంపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, కొత్త థర్మల్ ప్లాంట్ల వల్ల రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం పడుతుందని వివరించారు. అయితే రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను బట్టి ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. -
ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు
- కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి - ‘ఉదయ్’పథకంలోకి ఏపీ సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో నూరు శాతం విద్యుదీకరణ సాధించిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గుజరాత్, పంజాబ్ తరువాత ఏపీలోని అన్ని గృహాలకూ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నూరుశాతం విద్యుదీకరణ సాధించినట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్(ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన) పథకంలో ఆంధ్రప్రదేశ్ చేరింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ డిస్కంలతో కేంద్ర ఇంధనశాఖ శుక్రవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఉదయ్ పథకంలో ఇప్పటివరకు 12 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోగా 13వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేరింది. సీఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తొలి ‘స్మార్ట్ మీటర్’ రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతోందన్నారు. ఈ కార్యక్రమంకింద ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటివల్ల విద్యుత్ వినియోగం విషయంలో పూర్తి సమాచారం లభిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉదయ్‌తో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆలస్యంగా ఎంవోయు సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరుతున్నట్టు అందరికన్నా ముందే ప్రకటించిన రాష్ట్రం.. దాదాపు 12 రాష్ట్రాల తర్వాత కేంద్రంతో ఎంవోయు చేసుకుంది. అమలు చేయాల్సిన సంస్కరణలపై వెనుకడుగు వేయడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. ముస్లింల అభ్యున్నతికి కృషి: బాబు ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం గుంటూరులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. -
2019 నాటికి దేశంలో ప్రతీ ఇంటికి విద్యుత్
- కేంద్రమంత్రి పియూష్ గోయల్ తిరుమల : 2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని, ఆశీస్సులను శ్రీవేంకటేశ్వర స్వామివారు కల్పిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు అందిస్తోందని కితాబిచ్చారు. వందశాతం పారిశుద్ధ్యం ఉన్న దేవస్థానం మరెక్కడా కనిపించదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కేంద్ర మంత్రికి ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. -
వరద సాయం ‘స్వాహా’...!
* పీయూష్ సంచలన వ్యాఖ్య * 1400 కోట్లు మింగేసినట్టు ఆరోపణ సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారుపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ మరో మారు సంచలన ఆరోపనలు చేశారు. కేంద్రం ఇచ్చిన వరద సాయం రూ.రెండు వేల కోట్లలో రూ. 1400 కోట్లను అన్నాడీఎంకే సర్కారు స్వాహా చేసిందని ఆరోపించారు. గోయల్ ఇటీవల రాష్ర్టంలో వార్తల్లో వ్యక్తిగా అవతరించి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జయలలితను ఒక కేంద్ర మంత్రిగా తాను సంప్రదించ లేని పరిస్థితి ఉందని, ఉదయ్ పథకం అమలు చేయని దృష్ట్యా, ఆ రాష్ట్రానికి కోట్లు నష్టం అవుతోందంటూ ఇటీవల తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆయన బాటలో పలువురు మంత్రులు అనుసరించారు. సీఎం అనుమతి కరువు కావడంతో, పోయేస్ గార్డెన్‌కు పరిమితమైన జయలలితపై విసుర్లు, విమర్శలు బయలు దేరాయి. పీయూష్ చేసిన వ్యాఖ్యలు నేటికి చర్చనీయాంశంగానే ఉన్నాయి. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని పదే పదే పీయూష్ స్పందిస్తూనే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం సీఎం జయలలిత ఎన్నికల బరిలో ఉన్న ఆర్కేనగర్ వేదికగా మరో సంచలన ఆరోపణలు చేశారు. అక్కడి బీజేపీ అభ్యర్థి ఎంఎన్ రాజకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పీయూష్ ఓపెన్ టాప్ వాహనం నుంచి ప్రసంగిస్తూ సీఎం జయలలిత సర్కారుపై విరుచుకు పడ్డారు. వరద సాయం స్వాహా : ఉదయ్ పథకం వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నాని స్పందిస్తూ, తన ప్రసంగాన్ని సాగించారు. చెన్నైను వరదలు ముంచెత్తిన సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ తల్లడిల్లారని, తక్షణం ఆయన చెన్నైకు రావడమే కాకుండా రూ. వెయ్యి కోట్లను సాయంగా ప్రకటించారన్నారు. అంతకు ముందుగా వరదసాయం నిమిత్తం రూ. 900 కోట్లకు పైగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం నుంచి వరద సాయంగా రూ. రెండు వేల కోట్ల వరకు నిధులు మంజూరు అయ్యాయని, అయితే, అవన్నీ బాధితులకు మాత్రం చేర లేదని ఆరోపించారు. 60 శాతం మేరకు బాధితులు ఇంకా కష్టాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కేవలం రూ. 600 కోట్లను మాత్రం వెచ్చింది. మిగిలిన 1400 కోట్లను స్వాహా చేసి ఉన్నారని, ప్రజాల సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు నిచ్చారు. ఆర్కేనగర్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి, జయలలితకు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. ముందుగా విరుగంబాక్కం ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరాజన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. విరుగంబాక్కం అభివృద్ధికి తానుచేపట్టబోయే కార్యక్రమాల్ని వివరిస్తూ తమిళి సై రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేశారు. -
ఎన్నికల చట్టంలో సవరణకు ఆమోదం
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎన్నికల చట్టం(సవరణ) బిల్లు, 2016ను న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2002 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభలో... 8 బొగ్గు శాఖకు చెందిన నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 29న సమ్మె చేస్తున్నట్లు నోటీసులిచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. యూనియన్లతో చర్చలు జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యసభలో... 8 సివిల్ సర్వీసు పరీక్షలకు సంబంధించి వివిధ అంశాల అధ్యనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆగస్టులో నివేదిక అందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. -
పీయూష్ ఎందుకొచ్చారు?
చర్చనీయాంశమైన కేంద్ర మంత్రి ఆకస్మిక పర్యటన ♦ బీజేపీ రాష్ర్ట కార్యాలయానికీ సమాచారమివ్వని పీయూష్ ♦ ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం కేసీఆర్‌తో భేటీ ♦ ఇద్దరు సీఎంలతో సుదీర్ఘ చర్చలపై సర్వత్రా విస్మయం ♦ రేవంత్ కేసులో బాబు తరఫున మధ్యవర్తిత్వమా? సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మిక పర్యటన రాష్ర్టంలో చర్చనీయాంశమైంది. ఆయన హైదరాబాద్ రావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ర్ట కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆయన రాష్ట్రానికి రావడం ఆ పార్టీ నేతలనే విస్తుగొలిపింది. గురువారం ఉదయం వచ్చిన గోయల్.. ఏపీ సీఎం చంద్రబాబుతో అల్పాహార విందులో పాల్గొని సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భోజన విరామ సమయంలో చర్చలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు కావడం, దానికి సూత్రధారి చంద్రబాబేనంటూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేయనుందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో గోయల్ భేటీ చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికే ఆయన వచ్చి ఉంటారని బీజేపీలో జోరుగా ప్రచారం జరిగింది. బాబు తరఫున మధ్యవర్తిత్వం? రేవంత్ ముడుపుల కేసులో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ విచారించబోతున్నదని ప్రచారం జరిగిన 24 గంటల్లోనే పీయూష్ రాష్ట్రానికి రావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు వ్యవహారంలో మధ్యవర్తిత్వం నెరపడానికే ఆయన వచ్చారేమోనని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అనుమానం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి పర్యటన అనుమానాస్పదంగా ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది. గోయల్.. మధ్యాహ్నం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. రేవంత్ కేసును ప్రస్తావించి చంద్రబాబు వ్యవహారాన్ని కేసీఆర్ ముందు పెట్టినట్లు సమాచారం. బాబును గోయల్ వెనకేసుకురావడం పట్ల ఒక దశలో కేసీఆర్.. బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తినట్లు తెలిసింది. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తామన్న చంద్రబాబును వెనకేసుకువస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎవరు పంపి ఉంటారు... పీయూష్ గోయల్‌ను హైదరాబాద్‌కు ఎవరు పంపించారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ కేంద్ర మంత్రి ఈ వ్యవహారంలో తలదూర్చి గోయల్‌ను పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సాధారణంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు వచ్చే ముందు రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిస్తారు. అయితే, గోయల్ తన పర్యటన సమాచారాన్ని తెలపలేదు. మధ్యవర్తిగా రాలేదు: రేవంత్ కేసులో సీఎం కేసీఆర్‌తో మాట్లాడటానికి తాను మధ్యవర్తిగా రాలేదని గోయల్ వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా స్థానిక అంశంపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. విద్యుత్ అంశాలపైనే సీఎంలతో చర్చించినట్లు తెలిపారు. -
28 కోట్ల మంది చీకట్లలోనే!
కేంద్ర మంత్రి గోయల్ మొహాలీ: దేశంలో నేటికీ 28 కోట్ల మంది ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారని...వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వంటి మౌలిక సౌకర్యం నేటికీ వారికి అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2019కల్లా దేశంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఆదివారం మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో విస్తృతంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా అవసరమైన మేర ట్రాన్స్మిషన్ లైన్లు లేకపోవడంతో కరెంటును దేశవ్యాప్తంగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు. -
భవిష్యత్ బయోటెక్నాలజీదే
సీఎం సిద్ధరామయ్య రానున్న మూడేళ్లలో ‘ఎల్ఈడీ’ వెలుగులు బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బెంగళూరు: బయోటెక్నాలజీలో భారత్ ప్రధాన శక్తిగా ఎదిగే దిశగా కర్ణాటక ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఇక్కడి బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనను కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధు మాట్లాడుతూ రాష్ట్రంలో జైవిక పరమాణు ఇంజనీరింగ్ సంశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరినట్లు తెలిపారు. దేశంలోని బయోటెక్నాలజీ సంస్థలన్నింటిలోకి దాదాపు 52 శాతం సంస్థలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఉన్న 10 ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థలు రాష్ట్రంలో తన శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో బయో టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా నేతృత్వంలో ఓ ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఇకపై ఎల్ఈడీ వెలుగులు రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీధి దీపాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఏడాదికి 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా 1.5 బిలియన్ డాలర్లను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇప్పటికే న్యూఢిల్లీలో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చామని, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 617 ఎల్ఈడీ బల్బులను అమర్చామని వెల్లడించారు. గతంలో ఒక్కో ఎల్ఈడీ బల్బు ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉండేదని ప్రస్తుతం రూ.150కి ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి వ చ్చేశాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సబ్సిడీలను కనుక ప్రకటిస్తే ఒక్కో ఎల్ఈడీ బల్బు రూ.100కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష జవదేకర్ మాట్లాడుతూ...ప్రస్తుతం బయో ఇంధన రంగంలో యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ కావాల్సినంత విద్యుత్ అందుబాటులో లేదని, అందువల్ల ప్రతి రోజూ డీజిల్‌తో నడిచే జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను అందించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సరికొత్త పధకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, బీటీశాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా తదితరులు పాల్గొన్నారు.