చర్చనీయాంశమైన కేంద్ర మంత్రి ఆకస్మిక పర్యటన
♦ బీజేపీ రాష్ర్ట కార్యాలయానికీ సమాచారమివ్వని పీయూష్
♦ ఉదయం చంద్రబాబు, మధ్యాహ్నం కేసీఆర్‌తో భేటీ
♦ ఇద్దరు సీఎంలతో సుదీర్ఘ చర్చలపై సర్వత్రా విస్మయం
♦ రేవంత్ కేసులో బాబు తరఫున మధ్యవర్తిత్వమా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మిక పర్యటన రాష్ర్టంలో చర్చనీయాంశమైంది.
ఆయన హైదరాబాద్ రావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ర్ట కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆయన రాష్ట్రానికి రావడం ఆ పార్టీ నేతలనే విస్తుగొలిపింది. గురువారం ఉదయం వచ్చిన గోయల్.. ఏపీ సీఎం చంద్రబాబుతో అల్పాహార విందులో పాల్గొని సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భోజన విరామ సమయంలో చర్చలు జరిపారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు కావడం, దానికి సూత్రధారి చంద్రబాబేనంటూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ నోటీసులు జారీ చేయనుందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో గోయల్ భేటీ చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికే ఆయన వచ్చి ఉంటారని బీజేపీలో జోరుగా ప్రచారం జరిగింది.
బాబు తరఫున మధ్యవర్తిత్వం?
రేవంత్ ముడుపుల కేసులో చంద్రబాబుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ విచారించబోతున్నదని ప్రచారం జరిగిన 24 గంటల్లోనే పీయూష్ రాష్ట్రానికి రావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు వ్యవహారంలో మధ్యవర్తిత్వం నెరపడానికే ఆయన వచ్చారేమోనని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అనుమానం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి పర్యటన అనుమానాస్పదంగా ఉందని సీపీఎం వ్యాఖ్యానించింది.
గోయల్.. మధ్యాహ్నం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. రేవంత్ కేసును ప్రస్తావించి చంద్రబాబు వ్యవహారాన్ని కేసీఆర్ ముందు పెట్టినట్లు సమాచారం. బాబును గోయల్ వెనకేసుకురావడం పట్ల ఒక దశలో కేసీఆర్.. బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తినట్లు తెలిసింది. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తామన్న చంద్రబాబును వెనకేసుకువస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఎవరు పంపి ఉంటారు...
పీయూష్ గోయల్‌ను హైదరాబాద్‌కు ఎవరు పంపించారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ కేంద్ర మంత్రి ఈ వ్యవహారంలో తలదూర్చి గోయల్‌ను పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సాధారణంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు వచ్చే ముందు రాష్ట్ర కార్యాలయానికి సమాచారమిస్తారు. అయితే, గోయల్ తన పర్యటన సమాచారాన్ని తెలపలేదు.
మధ్యవర్తిగా రాలేదు: రేవంత్ కేసులో సీఎం కేసీఆర్‌తో మాట్లాడటానికి తాను మధ్యవర్తిగా రాలేదని గోయల్ వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా స్థానిక అంశంపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. విద్యుత్ అంశాలపైనే సీఎంలతో చర్చించినట్లు తెలిపారు.
పీయూష్ ఎందుకొచ్చారు?
Published Fri, Jun 5 2015 3:26 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement