ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు
- కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
- ‘ఉదయ్’పథకంలోకి ఏపీ
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో నూరు శాతం విద్యుదీకరణ సాధించిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గుజరాత్, పంజాబ్ తరువాత ఏపీలోని అన్ని గృహాలకూ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నూరుశాతం విద్యుదీకరణ సాధించినట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్(ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన) పథకంలో ఆంధ్రప్రదేశ్ చేరింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ డిస్కంలతో కేంద్ర ఇంధనశాఖ శుక్రవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఉదయ్ పథకంలో ఇప్పటివరకు 12 రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోగా 13వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేరింది. సీఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తొలి ‘స్మార్ట్ మీటర్’ రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతోందన్నారు. ఈ కార్యక్రమంకింద ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటివల్ల విద్యుత్ వినియోగం విషయంలో పూర్తి సమాచారం లభిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉదయ్‌తో ఎంతో మేలు చేకూరుతుందన్నారు.
ఆలస్యంగా ఎంవోయు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరుతున్నట్టు అందరికన్నా ముందే ప్రకటించిన రాష్ట్రం.. దాదాపు 12 రాష్ట్రాల తర్వాత కేంద్రంతో ఎంవోయు చేసుకుంది. అమలు చేయాల్సిన సంస్కరణలపై వెనుకడుగు వేయడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది.
ముస్లింల అభ్యున్నతికి కృషి: బాబు
ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం గుంటూరులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.