రేపు ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ | Ap And Telangana Chief Ministers Meet On July 6 | Sakshi
Sakshi News home page

రేపు ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Published Fri, Jul 5 2024 4:02 PM | Last Updated on Fri, Jul 5 2024 5:30 PM

Ap And Telangana Chief Ministers Meet On July 6

సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజా భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.

విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.

షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి.

హైదరాబాద్ లో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ వాటి సంగతేంటి మరి..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement