
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కార్యాలయంతోపాటు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు.
పన్ను ఎగవేత ఆరోపణలపై అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రతతో సోదాలు కొనసాగాయి. కాలేజీల నిర్వహణ, విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, సంస్థ ఆయా బ్రాంచీలవారీగా చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందుకు విద్యార్థుల నుంచి అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్టు గుర్తించారు.
రూ. 5 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్‌వేర్లను ఐటీ అధికారులు పరిశీలించారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటి సోదాలు నిర్వహించగా, గతంలోనూ 11 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తోంది. మాదాపూర్‌లోని శ్రీచైతన్య హెడ్ ఆఫీస్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment