సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !
— Perni Nani (@perni_nani) July 6, 2024
కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.
విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్‌లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్‌భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment