
‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.
కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.
జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.
తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.
ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.
కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.