
శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని అధికార పక్షాలకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాయి! ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినా కీలకమైన ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ముఖ్యమైన రాజకీయ పరిణామమే అవుతుంది. ఈ ఓటమి కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర టీచర్ల అసంతృప్తికి ప్రతీక.
మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది పెట్టేదే. పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయా వర్గాలు దీనిని అవకాశంగా తీసుకోవచ్చు. టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన పోటీలో లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా, ఒక స్థానంలో బీజేపీ బహిరంగంగా బలపరిచిన వ్యక్తి గెలవడం మాత్రం అధికార పార్టీకి మంచి సంకేతం కాదు. మరో స్థానంలో పీఆర్‌టీయూ తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తున్న బీజేపీకి ఇది కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడం, ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజకీయ సమీకరణలు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయని చెప్పలేం.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. అధికారిక ప్రకటనలు కూడా చేశాయి. కాని బీజేపీ మద్దతివ్వకపోవడం గమనించవలసిన అంశమే. స్వతంత్ర అభ్యర్ధిగా పీఆర్‌టీయూ పక్షాన పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు వర్మను ఓడించడంతో కూటమికి దిమ్మదిరిగినంత పనైంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఏర్పడిన అసమ్మతికి ఇది నిదర్శనమన్న భావన ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వంలో టీడీపీ, జనసేనలు ప్రభుత్వ టీచర్లను విపరీతంగా రెచ్చగొట్టాయి.
ప్రతి నెల మొదటి తేదీకల్లా జీతాలు ఇవ్వడం లేదని, స్కూళ్లలో విద్యార్థులకు అజమాయిషీ బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం చేశాయి. సీపీఎస్ రద్దు పై పరిశీలన చేస్తామని, డీఏ బకాయిలు ఇస్తామని,.. ఇలా రకరకాల హామీలను గుప్పించారు. విద్యా వ్యవస్థకు జగన్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు తెచ్చినా, ఒక ఐఏఎస్ అధికారి కొంత కఠినంగా వ్యవహరించారన్న భావన అప్పట్లో టీచర్లలో ఉండేది. దానివల్ల కూడా అప్పట్లో వైఎస్సార్‌సీపీకి కొంత నష్టం జరిగింది.
శాసనసభ ఎన్నికలలో ఆ మేరకు కూటమి లబ్ది పొందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశించాయి. కాని ప్రభుత్వంలో వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పీఆర్సీ ఊసే ఎత్తలేదు. ఇక మధ్యంతర భృతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? సీపీఎస్ బదులు జగన్ ప్రభుత్వం జీపీఎస్ తీసుకు వస్తే విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు ప్రభుత్వంలోకి వచ్చాక దానినే కొనసాగిస్తున్నాయి. అంతేకాక సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారన్న భావన ఎటూ ఉంది.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో కూటమి సాగిస్తున్న విధ్వంసాన్ని, అరాచక పరిస్థితులను టీచర్లు గమనించి కూడా ఈ ఫలితాన్ని ఇచ్చారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలో టీచర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. అందుకే బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించడమే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి ప్రచారం చేశారు. తీరా ఓటమి చవిచూసిన తర్వాత వెంటనే టీడీపీ గాత్రం మార్చేసింది. గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూడా తమ అభ్యర్ధేనని కొత్త వాదనను తెచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తాము ఇద్దరు అభ్యర్ధులకు మద్దతు ఇచ్చామని చెప్పగా, శ్రీనివాసులు నాయుడు అలాగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గాలి తీశారు. మరో వైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వర్మకు మద్దతుగా చేసిన వీడియోని అంతా చూశారు. దాంతో అచ్చెన్న పరువు పోయినట్లయింది.
ఇక ఎల్లో మీడియా కూడా తమ లైన్ మార్చుకున్నాయి. ఎన్నికలకు ముందు పీఆర్‌టీయూకు చెందిన గాదె, యుటిఎఫ్ అభ్యర్ధి గౌరి పరస్పరం సహకరించుకుని రెండో ప్రాధాన్య ఓటు విషయంలో అవగాహన పెట్టుకున్నారని రాశారు. వీరిద్దరూ కలిసినా తమకు ఎదురు ఉండదని అనుకుని బోల్తా పడ్డారు.అ క్కడికి డబ్బు, తదితర ప్రలోభాలకు తెరదీసినా, ఉత్తరాంధ్రలో టీచర్లు మాత్రం అధికార కూటమికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఫలితం తేల్చింది. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో కూటమి గెలిచినా, ఉత్తరాంధ్రలో ఓటమి చంద్రబాబును అధికంగా కుంగదీస్తుంది. తన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా టీచర్లు ఈ షాక్ ఇవ్వడం మరీ చికాకు కలిగిస్తుంది.
కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పి.రాజశేఖర్ లు గెలవడం కూటమి పాలనకు సర్టిఫికెట్టా అన్న చర్చ రావచ్చు. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ తీరుపై అభిప్రాయ వ్యక్తీకరణకన్నా, ఆయా అభ్యర్ధుల ప్రభావం. వారు చేసే కసరత్తు, కుల సమీకరణలు, డబ్బు వ్యయం చేసే వైనం, అధికార దుర్వినియోగం, గొడవలు సృష్టించడం, రిగ్గింగ్ వంటివి ప్రభావం చూపాయన్న భావన ఉంది. పీడీఎఫ్ అభ్యర్ధి కె.ఎస్.లక్ష్మణరావు మాచర్ల ప్రాంతంలో, మరికొన్ని చోట్ల ఎన్నికలలో అక్రమాలు ఎలా జరిగాయో సోదాహరణంగా వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ ఫలితంపై వ్యాఖ్యానిస్తూ శాసనమండలి ఎన్నికలలో సైతం రిగ్గింగ్ చేయించి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని ఎద్దేవ చేశారు. అదే టీచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు ఏ రకంగా పంచారో చెప్పడానికి పిఠాపురంలో బయటకు వచ్చిన వీడియోనే నిదర్శనం. ఆలపాటికి ఉన్నంత ఆర్ధిక వనరు లక్ష్మణరావుకు లేదు. పైగా ఆయన ఆ రకంగా ఖర్చు చేసే వ్యక్తి కూడా కాదు.
మాచర్ల, మంగళగిరి వంటి ప్రాంతాలలో కూటమి నేతలు పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇది తమకు అనుకూల నిర్ణయమని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటో అందరికి తెలుసు. టీడీపీ అభ్యర్ధులు గెలిచారు కనుక ఇక సూపర్ సిక్స్ ఇవ్వనవసరం లేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రణాళికను అమలు చేసేశామని అంటే జనం ఒప్పుకుంటారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్.లక్ష్మణరావుకు మంచిపేరే ఉంది. వామపక్షాల మద్దతు ఉంది.
వైఎస్సార్‌సీపీ నేరుగా మద్దతు ప్రకటించకపోవడం ఒక మైనస్. కానీ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో మాత్రం వైఎస్సార్‌సీపీ మద్దతు వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని దిక్కుమాలిన రాతలు రాశారు. వైఎస్సార్‌సీపీ ముద్రతో విద్యావంతులు దూరం అయ్యారని పిచ్చి విశ్లేషణ చేసింది. లక్ష్మణరావుకు ఓటు వేసిన వారు విద్యావంతులు కాదని ఈ పత్రిక చెప్పదలచినట్లుగా ఉంది. పూర్తి స్వార్ధంతో ,పత్రికా విలువను గాలికి వదలి, జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి ఎల్లో మీడియా కథనాలు ఇస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
అలా పిచ్చి రాతలు రాసిన ఎల్లో మీడియా ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి ఓటమిని మాత్రం కప్పిపుచ్చే యత్నం చేసింది. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో కూటమి పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఒప్పుకుంటారా? టీడీపీ, జనసేనలు మద్దతు ఇచ్చినందునే రఘువర్మ ఓడిపోయారని కూడా విశ్లేషిస్తారా? గాదెని గెలిపించిన టీచర్లు విద్యావంతులు కాదని ఈ ఎల్లో మీడయా రాసినా ఆశ్చర్యం లేదు. మండలి ఎన్నికల ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో వచ్చే మార్పు పెద్దగా ఉండరు. కాని టీచర్లలో ఏర్పడిన వ్యతిరేకత సమజాంలో ఉన్న అశాంతికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.
ఉత్తర తెలంగాణలో టీచర్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు ముఖ్య అభ్యర్థులు బారీగా డబ్బు వ్యయం చేశారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్నికలో నిజాయితీ గెలిచిందని, మోడీ నాయకత్వానికి మద్దతు లభించిందని చెబితే చెప్పవచ్చు.అది మాట వరసకే తప్ప, ఈ ఎన్నికలలో మోడీ ప్రభావంతోనే ఓట్లు వేయడం, వేయకపోవడం ఉండకపోవచ్చు.

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం వారి అభ్యర్ధి మల్క కొమరయ్య, అంజిరెడ్డిల గెలుపునకు ఉపకరించి ఉండవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిథ్యంవహించారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోవడం, బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి గెలవడం కచ్చితంగా కాంగ్రెస్ కు షాక్ వంటిదే. ఇది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని కనబరుస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని సరిదిద్దుకోకపోతే రేవంత్ నాయకత్వానికి కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment