రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.
అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.
అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!
అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుకున్నారట.
రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్‌సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!.
ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!
జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.
సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment