telangana political news
-
ఇద్దరూ ఇద్దరే..! తగ్గేదేలే..!!
తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్‌ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్‌కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్‌దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.ఇక రేవంత్ కామెంట్స్‌పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్‌ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్‌కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది: కేకే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. అలాగే.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. కేకేకు ప్రత్యేక సలహాదారు పదవి?రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది. -
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?
రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జీవన్‌రెడ్డి..తగ్గేదేలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో రగిలిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తనను సంప్రదించకుండా చిరకాల ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నరంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయం విధితమే. మంగళవారం అధిష్టాన పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఫలితం కనిపించలేదు. కార్యకర్తలతో మాట్లాడాక బుధవారం నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరులు ‘సాక్షి’కి తెలిపారు. జీవన్‌రెడ్డి ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆయన నివాసానికి తరలివెళ్లారు. నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా జీవన్‌రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికపై సరైన వివరణ ఇచ్చేదాకా వెనక్కి తగ్గొద్దని ఎమ్మెల్సీపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.నాయకులు, కార్యకర్తల ఆవేదన..ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికే ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ను వీడటంపై ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌రెడ్డి వెంటే ఉండి, పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు.ఎక్కడ చూసినా ఇదే చర్చ..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డి పయనమెటు? రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సంజయ్ చేరికతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై చర్చించుకుంటున్నారు. -
ప్రణవ్ సవాల్ నేపథ్యంలో.. చెల్పూర్లో టెన్షన్.. టెన్షన్!
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ప్రణవ్, పాడి కౌశిక్‌రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్‌కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్‌కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్బాబును సింగాపూర్‌లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులుతడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణంవొడితెల ప్రణవ్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్‌చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్‌రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్‌బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.రాజకీయ ఉనికి కోసమే..రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.ఉద్యోగాల పేరిట కౌశిక్‌రెడ్డి మోసం చేశారుకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్‌గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్‌రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి.. : బండి సంజయ్
కరీంనగర్: మోసపూరితమైన వాగ్ధానాలతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చె ప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం గన్నేరువరంలో స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి పేరుతో రాజకీయాలంటూ ఇరుపార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.మైనార్టీ ఓట్లు పొందడానికి ఇరు పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నరేంద్ర మోదీకి పెద్ద కుటుంబమని, ఆ కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేరని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని పదేపదే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయని, కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని, మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, కోమల ఆంజనేయులు, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, అనిల్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
వరంగల్ జనసభలో.. మోదీ నినాదం!
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్‌ను గెలిపించాలంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ క్రాస్‌రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.ఓరుగల్లు అంటే అభిమానమంటూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.మూడో దశ పోలింగ్‌ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇనుపగుప్పిటనుంచి వరంగల్‌ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్‌లో మేం టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్‌ను లోక్‌సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్‌గౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్‌కు చెంది న రాక సుధాకర్ అనువదించారు.ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్‌రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్‌రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజేశ్వర్‌రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్‌రావు, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు. -
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం నర్సాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు కాని గ్యారెంటీలపై మాట్లాడిన రాహుల్‌గాం«దీకి, కేసీఆర్‌ను బూతులు తిడుతున్న రేవంత్‌రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవలలని విమర్శించారు.ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ రిజర్వేషన్లు, బీజేపీ మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలను ఎత్తివేస్తానంటున్నారని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికలకు ముందు ఫేక్ వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. హత్నూర మండలం రెడ్డిపాలెంలో పలువురికి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న నర్సాపూర్‌లో నిర్వహించే రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొంటారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, నాయకులు సింగయ్యపల్లి గోపి, చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సత్యంగౌడ్, నయీమ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే! : కిషన్‌రెడ్డి -
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్‌ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్‌రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్‌రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్‌రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
అభివృద్ధి కాంక్షతోనే.. పార్టీ మారా! : కడియం శ్రీహరి
హనమకొండ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్‌లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్‌ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాయిస్ కాల్స్‌తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్‌తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్‌ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్‌పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్‌మెయిల్స్, ఫోన్‌కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
No Headline
ఇంటెలిజెన్స్ నివేదికలు.. స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితులపై రిపోర్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌పై ఉన్న పరిస్థితిపై నివేదిక ఇవ్వడంతో వాటి బలాబలాలు, బలహీనతలపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా ముఖ్యనేతలు ఈ సర్వేల రిపోర్టులతో ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అంతలోపే వాటిని సరిదిద్దుకోగలుగుతామా.. లేదా అన్న మీమాంస వారిని వెంటాడుతుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజల ఆదరణ ఎంత శాతం ఉంది.. తమకెంత ఉంది.. తమ అభ్యర్థిని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను జనం ఏ మేరకు ఆదరిస్తున్నారు.. సెగ్మెంట్ పరిధి లోని ఏయే నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం.. ప్రత్యర్థులు ఎక్కడ గట్టిగా ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి.. లోటుపాట్లను ఎలా సరిదిద్దుకోవాలని ఆయా పార్టీల నుంచి సర్వే చేస్తు న్న కమిటీలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రిపోర్టు అందించారు. ఆదిలాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి పార్టీల పరంగా ఆయా కమిటీలు ఇప్పటికే అధిష్టానాలకు నివేదికలు ఇచ్చా యి. ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన రోజుల్లో ఆ లోపాలు అధిగమించాలని అక్కడి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో తలమునకలయ్యారు. ప్రస్తుతం సర్వేల అలజడి కొనసాగుతుంది. పార్టీ కమిటీల రిపోర్ట్.. బీజేపీ పరంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునిల్ బన్సల్ కమిటీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై కూడా ఇప్పటికీ ఒకట్రెండు సార్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా లోటుపాట్లు సరిదిద్దుకునే చర్యలు ఇప్పటికే చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సునిల్ కనుగోలు కమిటీ నివేదికను తయారు చేసి ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి సివిక్స్ పోల్స్ అనాలసిస్ (సీ–ప్యాక్)కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్రధానంగా అందులో నియోజకవర్గం వారీగా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి బలంగా ఉన్నారు.. ఎక్కడ పార్టీ, అభ్యర్థి బలహీనంగా ఉన్నారు.. అక్క డ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి.. ఇందుకోసం ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ లోటుపాట్లను అధిగమించేలా ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీల్లో చర్యలు చేపడుతున్నారు. -
మరోసారి పీఠమెక్కేదెవరో..?
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో.. ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్ పరిధిలో చర్చగా మారింది.ముగ్గురు ముగ్గురే..2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాంనాయక్‌పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్ ఓటమిపాలవ్వడం గమనార్హం.ఒకరి ఓట్లకు మరొకరు గాలం..మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచారు.కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్‌కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న సీతారాంనాయక్‌కు మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్‌లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్‌తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్‌ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి
కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పంపుతున్న సొమ్ముతో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను, నాయకుల ను కొనాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు.. ఆ డబ్బు తీసుకునేవాళ్లకు మేం చెప్పేదొక్కటే.. మీరు తీసుకునే సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే.. విచారణలో బయటపడితే మీకు గండమే.. జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడ సంగప్ప హెచ్చరించారు.కరీంనగర్‌కు చెందిన కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని మోదీ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల రద్దు అంటూ ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచి నీళ్లు దొరకలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిజమైన బీసీ అయితే మోదీ, సంజయ్ బీసీలేనని, నువ్వు బీసీ పక్షం ఉంటావో.. ఓసీ పక్షం ఉంటావో చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కొలగాని శ్రీనివాస్, బొమ్మ జయశ్రీ,, బొంతల కల్యాణ్, కటకం లోకేశ్ పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
‘బండి’ని గెలిపించాలి..
కరీంనగర్: కరీంనగర్ మండలంలోని బొమ్మకల్‌లో శుక్రవారం బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు.నల్ల చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఎంపీగా సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దాది సుధాకర్, పాశం తిరుపతి, చిందం అశోక్, దాసరి రమణారెడ్డి, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, కాల్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.సంజయ్‌కి పలు బీసీ సంఘాల మద్దతు..బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి శుక్రవారం పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడు తూ.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలందరూ ఏకమై, బీసీ అభ్యర్థి అయిన సంజయ్‌ని గెలి పించాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ మాత్రమే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని,ఈ అవకాశాన్ని ఉపయోగించుకొ ని, ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకా శ్, నాగుల కనకయ్య గౌడ్, నారోజు రాకేశ్‌చారి, దొగ్గలి శ్రీధర్, మియాపురం రవీంద్రాచారి, కాయితోజు బ్రహ్మచారి, రంగు సంపత్ గౌడ్, మాదాసు సంజీవ్, బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్‌పూర్‌కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్‌షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్‌లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్‌రావు, సీతారాంనాయక్‌ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్‌లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్‌సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్‌రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్‌లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
దేవుడి పేరుతో.. బీజేపీ రాజకీయం! : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓటుతో రద్దు చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మండల అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బ్లాక్ అధ్యక్షుడు గుండవార్ సంజయ్, నాయకులు రూపేశ్‌రెడ్డి, వామన్, శంకర్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్నారు..జైనథ్: అభివృద్ధి గురించి అడిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో ఎన్ని కల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం నాయకులతో కలిసి సరదాగా డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. అంతకు ముందు మంత్రి లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకట్ రెడ్డి, గడ్డం జగదీశ్‌రెడ్డి, తదితరులున్నారు.రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్..తాంసి: రైతు రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా భీంపూర్ మండలంలోని అర్లి(టి),తాంసి మండలంలోని కప్పర్ల గ్రామాల్లో రోడ్‌షో చేపట్టారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, తలమడుగు జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, నాయకులు నరేశ్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యం..గుడిహత్నూర్: రాహుల్‌గాంధీని దేశ ప్రధానిగా చూడడమే మన లక్ష్యమని, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణతో కలిసి మండల కేంద్రంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల ఇంటికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి సుగుణ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక యువకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మాధవ్ మస్కే తదితరులు పాల్గొన్నారు.ఆడబిడ్డను పార్లమెంట్‌కు పంపుదాం..బోథ్: ఈ ప్రాంత ఆడబిడ్డ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపుదామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రాత్రి బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుగుణ విజయం దాదాపు ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. జొన్న పంట కొనుగోళ్లను ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి మరింత పెంచుతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పసుల చంటి, ఇంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు..