బోయినపల్లి వినోద్‌కుమార్, కొప్పుల ఈశ్వర్
కరీంనగర్‌కు వినోద్‌కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి నుంచి తొలిసారి లోక్‌సభ బరిలో మాజీ మంత్రి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించింది. మొదటి జాబితాలోనే ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల క్యాండిడేట్ల జాబితా విడుదల చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు గులాబీ దళపతి మరోసారి అవకాశం కల్పించారు.
పెద్దపల్లి నుంచి కొత్తగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం కల్పించారు. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో బీఆర్‌ఎస్ సైతం తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్‌ను పెంచింది. మరోవారం పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం తొలిజాబితాను విడుదల చేసేందుకు కసరుత్తు చేస్తోంది.
బోయినపల్లి వినోద్‌కుమార్
పుట్టిన తేదీ: 1959 జూలై 22
విద్యార్హతలు: ఎల్‌ఎల్‌బీ (కేయూ)
అనుభవం: టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు, లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
అదనపు సమాచారం: సీపీఐలో వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంతో టీఆర్‌ఎస్‌లో చేరి 2004–09 మధ్యలో వరంగల్ ఎంపీగా, 2014–19లో కరీంనగర్ ఎంపీగా పని చేశారు. 2019లో బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.
సామాజిక వర్గం: వెలమ (ఓసీ)
కొప్పుల ఈశ్వర్
పుట్టిన తేదీ: 1959 ఏప్రిల్ 20
విద్యార్హతలు: బీఏ
అనుభవం: సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు.
అదనపు సమాచారం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో మేడారం నుంచి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 08లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2009, 10, 14, 18లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. 2014–18 వరకు ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు. 2019 నుంచి మంత్రిగా పని చేశారు.
సామాజిక వర్గం: ఎస్సీ (మాల)
Comments
Please login to add a commentAdd a comment