కరీంనగర్: పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదివరకు ప్రతిపక్ష నాయకులుగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. తాము కోరుకున్న కమిటీలో స్థానం కల్పించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హు జూరాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్(సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
గ్రంథాలయ సంస్థకు తీవ్ర పోటీ..
జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఎలాంటి రాజ కీయ ఒత్తిళ్లు లేకుండా గౌరవప్రదమైన హోదా కలి గిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తమ మనసులో మాట చెప్పినట్లు సమాచారం. చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
రైతుబంధు సమితులు కొనసాగేనా?
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో రైతుబంధు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వీటిని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా.. కొనసాగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవులను తమకు ఇవ్వాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
7 మార్కెట్లు, 3 ఉప మార్కెట్లు
జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, మానకొండూర్, గోపాల్‌రావుపేటలతోపాటు 3 ఉప మార్కెట్లు కమలాపూర్, కేశవపట్నం, ఎల్కతుర్తి ఉన్నాయి. గత ప్రభుత్వం చైర్మన్ పదవులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం అదే పద్ధతిని పాటిస్తుందా లేదా పాత పద్ధతిలో కమిటీలను నియమిస్తుందో వేచిచూడాలి.
దేవస్థాన కమిటీలు..
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామాలయం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌లో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలకు రూ.25 లక్షల పైబడి ఆదాయం వస్తుంది. వీటికి దేవాదాయ పాలక కమిటీలు నియమించి, ఉత్సవాలను నిర్వహించే ఆనవాయితీ ఉంది. జిల్లాలో కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి, జిల్లా కేంద్రంలోని విజయగణపతి సాయిబాబా, గౌరీశంకర, భక్తాంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి(మంకమ్మతోట), పొద్దుటూరి వారి ధర్మసంస్థ, హరిహర, గిద్దెపెరుమాండ్ల స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కోతిరాంపూర్ పోచమ్మ, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ్‌నగర్ ప్రసన్నాంజనేయ, హనుమాన్(హుజూరాబాద్), సీతా రామస్వామి (నల్గొండ, తిమ్మాపూర్), వెంకటేశ్వర స్వామి(జమ్మికుంట) ఆలయాలకు దేవస్థాన కమిటీల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు.
జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా అధికార పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్‌లలో కాంగ్రెస్ ఇన్‌చార్జీలుగా పురమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ వ్యవహరిస్తున్నారు. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాలకు వీరినే ఇన్‌చార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవి చదవండి: సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి!
Comments
Please login to add a commentAdd a comment