జీవన్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
ఖరారుకాని కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులు
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఆలస్యం చేసిన హస్తం పార్టీ
ప్రవీణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్ల ప్రకటనలో తీవ్ర జాప్యం
తెరపైకి వెలిచాల, తీన్మార్.. కేడర్‌లో గందరగోళం
పెద్దపల్లి తరహాలో పారాచూట్ లీడర్లకు ఇస్తారంటూ ప్రచారం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో కీలకమైన పార్లమెంటు స్థానం కరీంనగర్. ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం ఇంకా ఏ అభ్యర్థినీ ఖరారు చేయలేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి.
ఈ స్థానానికి సైతం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ రెండుస్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఇటు కేడర్‌లో అటు ఆశావహుల్లో గందరగోళం చెలరేగేలా చేస్తున్నాయి. హైకమాండ్ ఆలోచన ఏంటన్నది అర్థం కాక క్షేత్రస్థాయి హస్తం పార్టీ నేతలు సతమతమవుతున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పారాచూట్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్, ఎప్పుడో అనుకున్న జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పేర్లపై ఇంకా జాప్యం చేస్తుండటం పార్టీలో ఉత్కంఠకు, కేడర్‌లో గందరగోళానికి కారణమవుతోంది. పెద్దపల్లి తరహాలో నిజామాబాద్, కరీంనగర్‌లో పారాచూట్ లీడర్లకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఆయా అభ్యర్థుల అనుచరుల్లో అయోమయానికి దారి తీస్తోంది.
నేటికీ నెరవేరని ఢిల్లీ పెద్దల హామీ..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీ ఢిల్లీ పెద్దల నుంచి రావడంతో అంతా తదుపరి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి అనే అనుకున్నారు. అదే హామీపై అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న ప్రవీణ్‌రెడ్డి సెగ్మెంట్‌లోని హుస్నాబాద్, మానకొండూరు, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ప్రచార పోస్టర్లను కూడా అంటించారు.
అయితే, ఇప్పటి వరకూ రెండుసార్లు ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించినా అందులో ప్రవీణ్‌రెడ్డికి చోటు దక్కకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెలిచాల రాజేందర్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం తనకు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పెద్దలను రాజేందర్‌రావు కలిసిన సందర్భంలోనూ ప్రవీణ్‌రెడ్డికే అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆయన మాత్రం తన అభ్యర్థిత్వంపై వెనకడుగు వేయడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది.
తన విజయావకాశాలపై కరీంనగర్ ఎంపీ సెగ్మెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మల్లన్న అనుచరులు ఏకంగా బహిరంగ సర్వే చేపట్టారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ప్రకటిస్తారని అనుకున్నా.. తొలి రెండులిస్టుల్లో ఆయనకూ చాన్స్ రాలేదు. దీంతో ఈ రెండుస్థానాల్లో అధిష్టానం అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తుండటం, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం, అయోమయాలకు కారణమవుతోంది. అసలు అధిష్టానం మనసులో ఏముందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
పాఠాలు నేర్వలేదా?
రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులో ఈడీ దూకుడు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఈడీ దర్యాప్తు దూకుడు తదితర అంశాలను బీజేపీ ఆయుధాలుగా మార్చుకుని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ పార్టీ హస్తం పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది.
అయితే, ఈ సందర్భంలో నిజామాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే వారు కరవయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా అభ్యర్థుల ప్రకటనలో కాలం గడిపేస్తున్న కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేసి చేతులు కాల్చుకున్న సంగతిని మర్చిపోయిందా? గతం నుంచి పాఠాలు నేర్వకపోతే ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గాలి వీచినా.. అభ్యర్థి ప్రకటనను జాప్యం చేసి కరీంనగర్‌లో దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో హస్తం పార్టీ విఫలమైందన్న విమర్శలు మూటగట్టుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలోనూ అదే మల్లగుల్లాలు పడుతోంది. పోనీ, ప్రకటించిన వారిలోనూ పారాచూట్ నేతలకే పెద్ద పీట వేయడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో తమ నాయకులను పక్కనబెట్టి.. ఎక్కడ పారాచూట్ లీడర్లకు టికెట్ కేటాయిస్తారో? అని జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment