Aligireddy Praveen Reddy
-
ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో కీలకమైన పార్లమెంటు స్థానం కరీంనగర్. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం ఇంకా ఏ అభ్యర్థినీ ఖరారు చేయలేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఈ స్థానానికి సైతం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ రెండుస్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఇటు కేడర్‌లో అటు ఆశావహుల్లో గందరగోళం చెలరేగేలా చేస్తున్నాయి. హైకమాండ్ ఆలోచన ఏంటన్నది అర్థం కాక క్షేత్రస్థాయి హస్తం పార్టీ నేతలు సతమతమవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పారాచూట్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్, ఎప్పుడో అనుకున్న జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పేర్లపై ఇంకా జాప్యం చేస్తుండటం పార్టీలో ఉత్కంఠకు, కేడర్‌లో గందరగోళానికి కారణమవుతోంది. పెద్దపల్లి తరహాలో నిజామాబాద్, కరీంనగర్లో పారాచూట్ లీడర్లకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఆయా అభ్యర్థుల అనుచరుల్లో అయోమయానికి దారి తీస్తోంది. నేటికీ నెరవేరని ఢిల్లీ పెద్దల హామీ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీ ఢిల్లీ పెద్దల నుంచి రావడంతో అంతా తదుపరి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి అనే అనుకున్నారు. అదే హామీపై అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న ప్రవీణ్‌రెడ్డి సెగ్మెంట్లోని హుస్నాబాద్, మానకొండూరు, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ప్రచార పోస్టర్లను కూడా అంటించారు. అయితే, ఇప్పటి వరకూ రెండుసార్లు ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించినా అందులో ప్రవీణ్‌రెడ్డికి చోటు దక్కకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం తనకు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పెద్దలను రాజేందర్రావు కలిసిన సందర్భంలోనూ ప్రవీణ్‌రెడ్డికే అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆయన మాత్రం తన అభ్యర్థిత్వంపై వెనకడుగు వేయడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. తన విజయావకాశాలపై కరీంనగర్ ఎంపీ సెగ్మెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మల్లన్న అనుచరులు ఏకంగా బహిరంగ సర్వే చేపట్టారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ప్రకటిస్తారని అనుకున్నా.. తొలి రెండులిస్టుల్లో ఆయనకూ చాన్స్ రాలేదు. దీంతో ఈ రెండుస్థానాల్లో అధిష్టానం అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తుండటం, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం, అయోమయాలకు కారణమవుతోంది. అసలు అధిష్టానం మనసులో ఏముందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. పాఠాలు నేర్వలేదా? రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులో ఈడీ దూకుడు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఈడీ దర్యాప్తు దూకుడు తదితర అంశాలను బీజేపీ ఆయుధాలుగా మార్చుకుని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ హస్తం పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. అయితే, ఈ సందర్భంలో నిజామాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే వారు కరవయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా అభ్యర్థుల ప్రకటనలో కాలం గడిపేస్తున్న కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేసి చేతులు కాల్చుకున్న సంగతిని మర్చిపోయిందా? గతం నుంచి పాఠాలు నేర్వకపోతే ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గాలి వీచినా.. అభ్యర్థి ప్రకటనను జాప్యం చేసి కరీంనగర్లో దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో హస్తం పార్టీ విఫలమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలోనూ అదే మల్లగుల్లాలు పడుతోంది. పోనీ, ప్రకటించిన వారిలోనూ పారాచూట్ నేతలకే పెద్ద పీట వేయడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో తమ నాయకులను పక్కనబెట్టి.. ఎక్కడ పారాచూట్ లీడర్లకు టికెట్ కేటాయిస్తారో? అని జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇవి చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
చర్చనీయాంశంగా మారిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరిక
సాక్షిప్రతినిధి, వరంగల్: హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆ పార్టీని వీడి.. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి వరంగల్‌లో సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో గులాబీ తీర్థం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జాతీయ స్థాయిలో పేరున్న ముల్కనూర్ రైతు సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు.. ఆ ఎన్నికల్లో వైఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో విజయం సునాయాసంగా వరించింది. వైఎస్సార్ మరణం తదనంతర పరిణామాల్లో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కాగా.. అతనితో సన్నిహిత సంబంధాలున్న ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు సాధించగలిగారు. 2014 ఎన్నికల్లో వొడితెల సతీశ్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో సైతం టికెట్ ఇస్తామనడంతో నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. చివరి నిమిషంలో పొత్తుల్లో భాగంగా వ్యూహాత్మకంగా సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి హుస్నాబాద్ టికెట్ దక్కించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్‌రెడ్డి కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటూ.. 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. టికెట్ పక్కాతోనే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హస్నాబాద్ నుంచి 2014 ఎన్నికల్లో ఓటమి చెందగా.. 2018లో కాంగ్రెస్ టికెట్ చేజారింది. వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పటికీ.. హుస్నాబాద్ నుంచి టికెట్ లభించే అవకాశం లేదు. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తదనంతరం వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే ఎన్నికల్లో(2023) వొడితెల సతీశ్‌కుమార్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపుతారన్న వార్తలొచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హుస్నాబాద్ టికెట్ సతీశ్కుమార్కే పక్కా అన్న చర్చ జోరందుకోవడంతో ఇక్కడ చాన్స్ లేదని భావించిన ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు సైతం సంప్రదింపులు జరిపారన్న ప్రచారం ఉన్నా.. టార్గెట్–2023 లక్ష్యంగా హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న అల్గిరెడ్డి.. టికెట్ పక్కా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. (క్లిక్: మళ్లీ ‘షేక్‌హ్యాండ్’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు) -
కారెక్కనున్నఆరెపల్లి, అల్గిరెడ్డి
టెస్కాబ్ చైర్మన్ కొండూరితో మంతనాలు అదే బాటలో ఏనుగు మనోహర్‌రెడ్డి కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మళ్లీ షాకింగ్. మాజీ ఎంపీ వివేక్ బ్రదర్స్ బుధవారం టీఆర్ఎస్లో చేరడం ఖాయం కాగా... తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే, ఇఫ్కో డెరైక్టర్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యూరు. సోమవారం కరీంనగర్‌లోని ఆరెపల్లి మోహన్ నివాసానికి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు వచ్చి ఆయనతో చాలాసేపు మంతనాలు జరపడం విశేషం. మానకొండూరు నియోజకవర్గానికి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్తు ఏమిటనే దానిపైనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్లో చేర్చుకునే అంశంపై అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డితోనూ టీఆర్ఎస్ పెద్దలు చర్చించిన ట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏనుగు మనోహర్‌రెడ్డి సైతం కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సోమవారం మనోహర్‌రెడ్డి ఆరెపల్లి నివాసానికి వచ్చి మంతనాలు జరిపారు. అనంతరం మోహన్, ప్రవీణ్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయారు. తమ రాజకీయ భవిష్యత్తుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఆయనతో హామీ పొందేందుకే వెళ్లినట్లు తెలిసింది. ఈ అంశంపై ఆరెపల్లిని వివరణ కోరగా తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, టీఆర్ఎస్లో చేరే ఆలోచన లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రవీణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఉత్తమ్‌తో ఆరెపల్లి భేటీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆరెపల్లి మోహన్ సోమవారం సమావేశమయ్యారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తమ్‌ను కలిసిన ఆరెపల్లి ఈ గొడవకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయమే కారణమని, ఆయనే రెచ్చగొట్టారని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.