టెస్కాబ్ చైర్మన్ కొండూరితో మంతనాలు
అదే బాటలో ఏనుగు మనోహర్‌రెడ్డి
కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మళ్లీ షాకింగ్. మాజీ ఎంపీ వివేక్ బ్రదర్స్ బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయం కాగా... తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే, ఇఫ్కో డెరైక్టర్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యూరు. సోమవారం కరీంనగర్‌లోని ఆరెపల్లి మోహన్ నివాసానికి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు వచ్చి ఆయనతో చాలాసేపు మంతనాలు జరపడం విశేషం.
మానకొండూరు నియోజకవర్గానికి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున టీఆర్‌ఎస్‌లో చేరితే తన భవిష్యత్తు ఏమిటనే దానిపైనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే అంశంపై అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోనూ టీఆర్‌ఎస్ పెద్దలు చర్చించిన ట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏనుగు మనోహర్‌రెడ్డి సైతం కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సోమవారం మనోహర్‌రెడ్డి ఆరెపల్లి నివాసానికి వచ్చి మంతనాలు జరిపారు. అనంతరం మోహన్, ప్రవీణ్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయారు. తమ రాజకీయ భవిష్యత్తుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఆయనతో హామీ పొందేందుకే వెళ్లినట్లు తెలిసింది. ఈ అంశంపై ఆరెపల్లిని వివరణ కోరగా తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రవీణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.
ఉత్తమ్‌తో ఆరెపల్లి భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆరెపల్లి మోహన్ సోమవారం సమావేశమయ్యారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తమ్‌ను కలిసిన ఆరెపల్లి ఈ గొడవకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయమే కారణమని, ఆయనే రెచ్చగొట్టారని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
కారెక్కనున్నఆరెపల్లి, అల్గిరెడ్డి
Published Tue, Jun 14 2016 11:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement
Advertisement