arepally Mohan
-
కారెక్కనున్న ఆరెపల్లి?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి టికెట్ ఆశించిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆరెపల్లి మోహన్ తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి, అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాకుచెందిన మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిసింది. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడా భేటీ అయి.. భేషరతుగా టీఆర్ఎస్లో చేరి మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరే విషయాన్ని ప్రకటించాలని భావించారు. ఈ మేరకు మీడియాను కూడా ఆహ్వానించారు. అయితే ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నాయకులు ఆరెపల్లి మోహన్ నివాసానికి రావడంతో సమావేశాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం కరీంనగర్లో జరిగే కేసీఆర్ బహిరంగసభలోనే పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా పెద్దపల్లి సభలో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎవరీ చంద్రశేఖర్..? అభ్యర్థులే కరువయ్యారా? పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నాయకులు టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గణనీయంగా ఓట్లు పోలు కావడం.. పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండంలో టీఆర్ఎస్ సిట్టింగులు ఓడిపోవడంతో రాష్ట్రంలోని పలువురు నాయకులు ఈ సీటుపై కన్నేశారు. 32 మంది నాయకులు ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో గతంలో రాష్ట్రంలో కీలకమైన పదవులు నిర్వహించిన వారూ ఉన్నారు. ఎస్సీల్లోని సామాజిక సమీకరణాల నేపథ్యంలో పెద్దపల్లి సీటును మాదిగకు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మాదిగ వర్గానికి చెందిన ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పీసీసీ నేతలతో ఉన్న సంబంధాలతో వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ ఢిల్లీ స్థాయిలో పైరవీ నడిపి టికెట్ తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎవరో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకులకు తప్ప ఇప్పుడెవరికీ తెలియదు. ప్రజలతోగానీ.. ఈ ప్రాంతంతోగానీ సంబంధాలే లేవు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తొలి జాబితాలో చంద్రశేఖర్ పేరు చోటుచేసుకోవడం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనను కాదని రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడికి సీటివ్వడాన్ని ఆరెపల్లి మోహన్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నారు. ఫలించని జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రాయభారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఆదివారం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న టి.జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తది తరులు హాజరయ్యారు. సమావేశానికి ఆరెపల్లి మోహ న్ కూడా వస్తారని భావించినా ఆయన రాలేదు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు విలేకరులకు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హుటాహుటిన ఆరెపల్లి మోహ న్ ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడించారు. ‘ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నీకు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని సముదాయించారు. అవేమీ పట్టించుకోని మోహన్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసినట్లు చెబుతూ హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఎ.చంద్రశేఖర్‌కు సీటు ఖరారైన తరువాత టీఆర్ఎస్ నేతలు మోహన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ వినోద్, ఓ మంత్రితో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం నాటి కేసీఆర్ సభలో మోహన్ పార్టీలో చేరబోరని, విడిగా ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారని జిల్లాకు చెంది న ఓ టీఆర్ఎస్ ప్రముఖుడు తెలిపారు. మోహన్ బాట లోనే పెద్దపల్లి లోక్‌సభకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
ఆదిలాబాద్‌లో హస్తం కుస్తీ
సాక్షి, మంచిర్యాల: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై హస్తం పెద్దలు హస్తినలో చేస్తున్న కసరత్తు కొలిక్కివస్తోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఒకటి, రెండు రోజుల్లో జాబితా ప్రకటించేందుకు ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణలే కీలక భూమికను పోషిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాదిగ ఉప వర్గానికి, ఆదిలాబాద్‌ను ఆదివాసీలకు కేటాయించేందుకు సూచనప్రాయంగా నిర్ణయించినట్లు పార్గీ వర్గాల భోగట్టా. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిత్వాలతో ఈ కేటగిరి మారే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలపై చివరి నిమిషం వరకు సాగదీయడం కూడా ఓటమికి ఒక కారణమనే భావనతో ఉన్న పెద్దలు, ఎంపీ అభ్యర్థుల జాబితాను త్వరగా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆరెపల్లి...చంద్రశేఖర్...కవ్వంపల్లి! పెద్దపల్లి లోకసభ స్థానానికి పలువురు పోటీ పడుతున్నా.. చివరగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ రిజర్వ్ స్థానమైన పెద్దపల్లి టికెట్టును ఈసారి మాదిగ ఉపకులానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో టికెట్ల కేటాయింపు ఆధారంగా పెద్దపల్లిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. ఈ స్థానం నుంచి పార్టీకి దరఖాస్తు చేసుకున్న మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, కవ్వంపల్లి సత్యనారాయణలు ముందువరుసలో ఉన్నారు. అభ్యర్థిత్వంపై వీరిలో ఒకరిద్దరికి ఏఐసీసీ నుంచి ఫోన్లు కూడా వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి మాదిగ ఉపకులానికి పెద్దపల్లి స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ కేటగిరికి చెందిన నేతల్లో ఆశలు చిగురించాయి. రాథోడ్ రమేష్... సోయం బాపూరావు... నరేష్ జాదవ్! ఆదిలాబాద్ లోకసభ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ కాస్త అధికంగానే ఉంది. ఎస్టీ రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి ఆదివాసీ, లంబాడా తెగలకు చెందిన నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోకసభ స్థానాలకు గాను ఆదిలాబాద్, మహబూబాబాద్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌లో ఉన్నాయి. ఇందులో ఒకటి ఆదివాసీకి, మరొకటి లంబాడాలకు ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు సమాచారం. ఈ లెక్కన మహబూబాబాద్ టికెట్ ఆదివాసీలకు ఇస్తే ఆదిలా బాద్ స్థానం లంబాడా తెగకు చెందిన నాయకులకు దక్కే అవకాశం ఉంది. అలాకాకుండా మహబూబాబాద్‌లో లంబాడాలకు అవకాశం ఇస్తే, ఆదిలాబాద్ టికెట్ ఆదివాసీలకు దక్కనుంది. కాగా ఆదిలాబాద్ స్థానానికి ఆదివాసీల నుంచి సోయం బాపూరావు, లంబాడా నుంచి రమేష్ రాథోడ్, నరేశ్జాదవ్లు టికెట్ రేసులో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కూడా కాంగ్రెస్ టికెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఖరారు? కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారులో జరిగిన విపరీత జాప్యం కూడా పార్టీని కొంపముంచిందని నేతలు పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటును పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కానీయరాదని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు సమాచారం. లోకసభ ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో రెండు, మూడు రోజుల్లో టికెట్లు ఖరారు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన పార్టీ, వివాదాలకు తావులేని నియోజకవర్గాలతో తొలిజాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. గురు, శుక్రవారాల్లో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. -
దళితుల కోసం ఖర్చుచేసిందెంత?: ఆరేపల్లి మోహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఓటర్ల గణన తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు జరిగాయని, అయితే ఓటర్ల గణనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల వారిగా కులసంఘాలతో చర్చించి రిజర్వేషన్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఒక్క సిరిసిల్లలోనే దళితులపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయని మోహన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకు బడ్డెట్ ఎంత కేటాయించిందో?, అందులో ఎంత ఖర్చు చేసిందో?, మిగులు నిధులు ఏం చేసిందో? ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌పై ఆరేపల్లి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న దళిత నేతలు కూడా జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించకపోవడం అవమానకరమన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితనేతను కించపరిచేవిధంగా వ్యవహరించిన కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఓట్లకోసం కుయుక్తులు, మాయ మాటలు తప్ప దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. -
కారెక్కనున్నఆరెపల్లి, అల్గిరెడ్డి
టెస్కాబ్ చైర్మన్ కొండూరితో మంతనాలు అదే బాటలో ఏనుగు మనోహర్‌రెడ్డి కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మళ్లీ షాకింగ్. మాజీ ఎంపీ వివేక్ బ్రదర్స్ బుధవారం టీఆర్ఎస్లో చేరడం ఖాయం కాగా... తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే, ఇఫ్కో డెరైక్టర్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యూరు. సోమవారం కరీంనగర్‌లోని ఆరెపల్లి మోహన్ నివాసానికి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు వచ్చి ఆయనతో చాలాసేపు మంతనాలు జరపడం విశేషం. మానకొండూరు నియోజకవర్గానికి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్తు ఏమిటనే దానిపైనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్లో చేర్చుకునే అంశంపై అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డితోనూ టీఆర్ఎస్ పెద్దలు చర్చించిన ట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏనుగు మనోహర్‌రెడ్డి సైతం కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సోమవారం మనోహర్‌రెడ్డి ఆరెపల్లి నివాసానికి వచ్చి మంతనాలు జరిపారు. అనంతరం మోహన్, ప్రవీణ్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయారు. తమ రాజకీయ భవిష్యత్తుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఆయనతో హామీ పొందేందుకే వెళ్లినట్లు తెలిసింది. ఈ అంశంపై ఆరెపల్లిని వివరణ కోరగా తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, టీఆర్ఎస్లో చేరే ఆలోచన లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రవీణ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఉత్తమ్‌తో ఆరెపల్లి భేటీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆరెపల్లి మోహన్ సోమవారం సమావేశమయ్యారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తమ్‌ను కలిసిన ఆరెపల్లి ఈ గొడవకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయమే కారణమని, ఆయనే రెచ్చగొట్టారని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
ఆ ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె. మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ పరస్పర ఆరోపణలపై షోకాజ్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్థన్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లు చేసిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 17న వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురు నేతలను టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ మాజీ ఛైర్మన్ శ్యాంసుందర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేటు వేశారు. శ్వాంసుందర్ను కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ నోటీసులు ఇచ్చినస్టు సమాచారం. -
'పోలీసుల వైఫల్యమే కారణం'
వీణవంక (కరీంనగర్) : దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ లు ఆరోపించారు. అత్యాచార ఘటనపై సోమవారం వారు మాట్లాడుతూ.. బాధితురాలి స్నేహితురాలు చేసిన ఫోన్ కాల్‌కు పోలీసులు స్పందించకపోవడంతోనే ఘోరం చోటుచేసుకుందని, పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని, నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి నాయిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐ, సీఐ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా బాధితురాలు ఈ రోజు ఎస్పీ జోయల్ డేవిస్‌ను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. -
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ఆరెపల్లె మోహన్
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ఆరెపల్లె మోహన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేదీ పేర్కొన్నారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని.. ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ తెలిపారు.