
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఓటర్ల గణన తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు జరిగాయని, అయితే ఓటర్ల గణనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల వారిగా కులసంఘాలతో చర్చించి రిజర్వేషన్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఒక్క సిరిసిల్లలోనే దళితులపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయని మోహన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకు బడ్డెట్ ఎంత కేటాయించిందో?, అందులో ఎంత ఖర్చు చేసిందో?, మిగులు నిధులు ఏం చేసిందో? ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment