TRS Governament
-
త్వరలో చెబుతా.. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సబిత రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్.. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. తమిళిసై కామెంట్స్‌పై ఇప్పుడే స్పందించనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తను ఎక్కడా రాజ్‌భవన్‌ను డీగ్రేడ్ చేసేలా మాట్లాడలేదని సబిత అన్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించి త్వరలో అన్ని వివరాలు చెప్తానని మంత్రి అన్నారు. మరోవైపు గవర్నర్‌ను మంత్రి కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినా స్పందన లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు కాగా, రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు ఉన్నాయంటూ మీడియా సమావేశంలో గవర్నర్ విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్.. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని వాటిపై వివరణ అడిగానని బిల్లులు సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని, ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని గవర్నర్ మండిపడ్డారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సీట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది. కాగా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వాన్ని నడిపే వారికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మధ్య ఏర్పడుతున్న విభేదాలు మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై విద్యాశాఖకు చెందిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును నిలిపివేసి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా అన్న మీమాంస సహజంగానే వస్తుంది. తమిళసై తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన ఏడు బిల్లులను పెండింగ్‌లో ఉంచడం సరైన పద్దతి అనిపించదు. చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..? ఆ బిల్లులు ఏవైనా చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని భావిస్తే వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపి, తమ అభ్యంతరాలను తెలియచేసి ఉండవచ్చు. కాని ఆమె ఆలా చేయలేదు. బిల్లుల ఆమోదం తన పరిధిలోనిది అంటూ కొత్త వాదన తీసుకు వచ్చారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఒక భాగమే తప్ప, గవర్నరే ప్రభుత్వం కాదు. గవర్నర్ గౌరవప్రదమైన అధినేతే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం విడుదల చేసే ఏ జిఓలో అయిన బై ఆర్డర్ ఆఫ్ గవర్నర్ అని ఉన్నంత మాత్రాన అన్ని గవర్నరే జారీ చేసినట్లుకాదు తమిళసై కి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ బేధాభిప్రాయాలు ఇప్పుడు కొత్తరూపం దాల్చుతున్నాయి. ఇటీవలికాలంలో కేసీఆర్ కేంద్రంపైన, బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ రియాక్షన్ ఈ విధంగా ఉందన్నది బహిరంగ రహస్యమే. కొన్ని నెలల క్రితం గవర్నర్ తమిళసై రాష్ట్రంలో టూర్లు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సహకరించని మాట నిజమే. హెలికాఫ్టర్ వంటి సదుపాయం కల్పించడం మానే, కనీసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారు వచ్చి ఆమెకు స్వాగతం పలకడం లేదు. ప్రభుత్వం ఇలా చేయడం కూడా సరికాదు. అలాగే కేసీఆర్ పైన, ప్రభుత్వంపైన గవర్నర్ బహిరంగ వ్యాఖ్యలకు పాల్పడడం వల్ల వివాదాలు ముదురుతున్నాయి. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారినే గవర్నర్లుగా నియమిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ టైమ్‌లో కూడా పలువురు గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరించారు. ప్రత్యేకించి ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఈ వివాదాలు తీవ్రంగా ఉంటున్నాయి. నాడు ఎన్టీఆర్‌కు షాక్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి గవర్నర్లు రామ్ లాల్ కాని, కుముద్ బెన్ జోషి వంటివారు కాని అనుసరించిన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురైంది. రామ్ లాల్ అయితే ఏకంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావుకు పట్టంకట్టారు. దాంతో పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి, ఆనాటి ఇందిరాగాంధీనే దిగివచ్చి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరించక తప్పలేదు. కుముద్ బెన్ జోషిపై ఆనాటి మంత్రి శ్రీనివాసులురెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రాజ్‌భవన్‌ను కాంగ్రెస్ ఆఫీస్‌గా మార్చేశారన్న ఆరోపణలు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు పెద్దగా ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకునేవారు కారు. ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా అలాగే జరుగుతోంది. కాని వేరే పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే మాత్రం తేడా వస్తోంది. కేంద్రంతో సఖ్యతతో ఉంటే సరే.. లేకుంటే మాత్రం తగాదానే. గతంలో యూపీలో రమేష్ బండారి అనే గవర్నర్ ఉండేవారు. ఆయన బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ అగ్రనేత వాజ్ పేయి ఢిల్లీలో నిరశన దీక్ష చేశారు. ఇక్కడా బాబు లాబీయింగే.! ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు ఆనాటి ఏపీ గవర్నర్ కృష్ణకాంత్ ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి పదవి పొందడానికి ఇది కూడా కారణమని అంటారు. తదుపరి రాష్ట్రపతి పదవి ఇస్తారని ఆయన ఆశించినా, అది జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురై మనోవేదనతో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన వాజ్ పేయికి మద్దతు ఇచ్చి కేంద్రానికి అనుకూలంగా మారారు. ఆ పలుకుబడితో ఆర్థికవేత్త, ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయింది. సుదీర్ఘ కాలం నరసింహాన్ నిజానికి తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్లను నానా రకాలుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో రాజీ కుదుర్చుకోవడానికి మళ్లీ అదే గవర్నర్‌ను ఏదో రకంగా మేనేజ్ చేయడంలో కూడా ఆయన ఆరితేరారని చెబుతారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు టీడీపీ నేతలు విమర్శించడం కాదు.. దూషించినంత పనిచేశారు. నరసింహన్ రాజకీయవేత్తకాదు. మాజీ బ్యూరోక్రాట్. ఛత్తీస్ గడ్ నుంచి ఏపీకి బదిలిచేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియమించిందని చెబుతుండేవారు. ఆ టైమ్‌లో టీఆర్ఎస్ వారు ఆయనపై తెలంగాణ ద్రోహి అన్న ముద్రవేసేవారు. కాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆయనతో చాలా సత్సంబందాలు నెరిపారు. వారం, వారం వెళ్లి ఆయనతో భేటీ అయ్యేవారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిభద్రతల అంశం అంతా నరసింహనే చూసుకున్నారన్న భావన ఉండేది. పోలీసు అధికారులు గవర్నర్‌కు నేరుగా రిపోర్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నరసింహన్‌కు, ఆయనకు తేడాలు వచ్చాయి. కిరణ్ సిఫారస్ చేసిన ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నరసింహన్ నిరాకరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కిరణ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఇలా జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. సమన్వయం ప్రస్తుతం ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి వివాదాలు లేకుండా, హుందాగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన పట్ల గౌరవ, మర్యాదలతో ప్రవర్తిస్తున్నారు. కాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ఆరంభించినప్పటి నుంచి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలో గవర్నర్ తమిళసైని టీఆర్ఎస్ అవమానించిందన్న భావన కూడా ఉంది. దానికి ప్రతిగా గవర్నర్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ఏకంగా సీఎంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగవచ్చు ఛలో హస్తిన.! రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఫోన్ టాపింగ్‌కు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె ఫిర్యాదు చేసి వచ్చారట. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా ఆమె చర్చించారు. బీజేపీని బదనాం చేయడానికి టీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను తన అధికార పరిధిలో ఉన్నమేరకు తిప్పికొట్టడానికి తమిళసై యత్నిస్తున్నారు. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అక్కడి సీపీఎం ప్రభుత్వంతో పెద్ద గొడవే పెట్టుకున్నారు. మంత్రులను తానే తీసేస్తానంతవరకు వెళ్లారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్లను రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు. తమిళనాడులో గవర్నర్ రవి వివాదాస్పదంగా ప్రవర్తిస్తుండడంతో డిఎంకే ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. మహారాష్ట్రలో బలం లేకపోయినా, కొంతకాలం క్రితం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ క్రియాశీలకంగా ఉండడం పెద్ద వివాదం అయింది. పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ నానా రచ్చ చేసిన ఫలితంగా ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ప్రమోషన్ లభించింది. పరిఢవిల్లాలి ప్రజాస్వామ్యం మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడంలో కూడా గవర్నర్ పాత్ర ఉంటోందన్న భావన ఉంది. ఇది కాంగ్రెస్ టైమ్ లోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలంటే గవర్నర్ల అధికార పరిధిని స్పష్టంగా నిర్వచిస్తూ కేంద్రం చట్టం చేయడమో లేక, రాజ్యాంగంలో మార్పులు చేయడమో జరగకపోతే గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఇలాగే గొడవలు సాగుతుంటాయి. కాని అధికారమే పరమావధిగా మారిన ఈ రోజుల్లో గవర్నర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే కేంద్రంలో ఉన్న అదికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఎప్పటికైనా మారుతుందా అంటే అనుమానమే. మన ప్రజాస్వామ్యంలో గవర్నర్ల వ్యవస్థ ఉండడం ఒకరకంగా మేలు, మరో రకంగా కీడుగా మారింది. దీనికి పరిష్కారం ఇప్పట్లో దొరుకుందా అన్నది ప్రశ్నార్ధకమే. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KTR.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్‌ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్ఎస్ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్లో అన్‌పార్లమెంట్ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్, రేవంత్ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడి -
దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. డిమాండ్లు ఫలించేనా ??
-
క్లబ్బులు, పబ్బులకు కేరాఫ్‌గా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సంస్కృతిని నిర్వీర్యం చేసి కేసీఆర్ ప్రభుత్వం పబ్‌లు, క్లబ్‌లు, గంజాయిని ప్రోత్సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన పాలకులు.. బెల్టుషాప్‌లు, మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తాగుబోతులను తయా రు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి, డ్రగ్స్, పబ్స్‌కు యువతను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల కిందట రూ.10 వేల కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, హైదరాబాద్‌లో ఆరు పబ్‌లుంటే వాటిని 89కి పెంచారని విమర్శించారు. వరంగ ల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, ఏఐసీసీ నేతలు ఏలేటి మహే శ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో కలిసి రేవంత్ గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడు నెలలకోసారి రాహుల్ పర్యటన వరంగల్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా చీప్‌గా ఉన్నాయని, అన్నీ అసత్యాలేనని రేవంత్ అన్నారు. ‘తెలంగాణ ఇస్తే చాలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మీ అయ్య సీఎం కుర్చీ లాక్కోలేదా.. ఉద్యమానికి వెన్నంటి ఉన్న కేకే మహేందర్ రెడ్డిని తప్పించి ఆయన గొంతుకోసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిన నీకు పదవీ వ్యామోహం లేదా? పైగా పదవులు ఎడమకాలి చెప్పు తో సమానమంటావా?’ అంటూ విమర్శలు చేశారు. తెలం గాణలో ఎక్కడ భూఆక్ర మణలు, కబ్జాలు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరిగినా.. వాటి వెనుక టీఆర్ ఎస్ నాయకులే ఉంటున్నారని విమర్శించారు. మే 6, 7న రాహుల్ పర్యటన: రాహుల్ గాంధీ ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని, మే 6, 7న రాహుల్ రాష్ట్ర పర్యటన ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మే 6న జరిగే రైతు సంఘర్షణ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. జీవో 111 రద్దు మరో మోసం: జీవో నంబర్ 111 రద్దు నిర్ణయం మోసగాడి మరో మోసం అని రేవంత్‌రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఈ జీవోపై హైకోర్టు 2007లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదన్నారు. కుర్చీల కోసం కుమ్ములాట టీపీసీసీ అధ్యక్షుడి సాక్షిగా జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు బయటపడింది. రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ముందువరుసలో కూర్చునే విషయమై రెండు వర్గాలు గొడవపడ్డాయి. వరద రాజేశ్వర్‌రావు అనుచరులపై నాయిని రాజేందర్‌రెడ్డి వర్గం వాగ్వాదానికి దిగి పిడిగుద్దులు కురిపించింది. అలాగే, రేవంత్ వెంట కాన్వాయ్ బయలుదేరేటపుడు తామంటే తాము ముందు వెళ్తామంటూ జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు తోపులాటకు దిగారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ మూసివేత
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది. -
Hyderabad: ఆశలు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్లు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం శుక్రవారం బన్సీలాల్‌పేట చాచానెహ్రూనగర్ (సీసీనగర్)లో 264 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనుంది. మురికివాడలు లేని విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పేదలు ఉంటున్న ప్రాంతాల్లోనే వారు నివసిస్తున్న ఇరుకు ఇళ్ల స్థానే కొత్తగా డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు ఏ ఆసరా లేని వారికి సైతం డబుల్ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టింది. లక్ష్యం 2 లక్షలు.. గ్రేటర్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించింది. వాటిల్లో స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 71 ఖాళీ ప్రదేశాల్లో మిగతా 91,102 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అన్నీ కలిపి మౌలిక సదుపాయాలతో సహా మొత్తం 4,038 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2,710 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 1,328 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, శుక్రవారం సీసీనగర్లో 264 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్, తలసాని పంపిణీ చేయనున్నా రు. సంబంధిత జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశాక మిగతా వాటిని పంపిణీ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కోసం.. దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వాటిని పూర్తిచేస్తే లబ్ధిదారులకు పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. నిధుల లేమి.. ప్రభుత్వం నుంచి సకాలంలో అందాల్సిన నిధులందకపోవడంతో పనులు కుంటుపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి రూ. 300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో వారిని వేగిరపెట్టే పరిస్థితి లేదు. ఇళ్లు ఇలా.. ► విస్తీర్ణం: 560 చదరపు అడుగులు ► 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, 2 టాయ్‌లెట్స్ ఖర్చు ► డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌కు మంజూరైన నిధులు: రూ.8598.58 కోట్లు ► పెరిగిన ధరలు, మౌలిక సదుపాయాలతో వెరసి అంచనా వ్యయం: రూ.9714.59 కోట్లు ► ఇప్పటి వరకు చేసిన ఖర్చు దాదాపు: రూ.6,507 కోట్లు ► పనుల పూర్తికి కావాల్సిన నిధులు: రూ.3,207 కోట్లు ► గ్రేటర్ పరిధిలోని జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి ► డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు: 6.50 లక్షలు. ► ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన ఇళ్లు: 1,00,781 ► లక్ష ఇళ్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ: రూ.1500 కోట్లు. ► ఇప్పటి వరకు అందిన సబ్సిడీ: రూ.800 కోట్లు. కోవిడ్ దెబ్బ.. వాస్తవానికి పనులు చేపట్టిన అన్ని ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్మాణ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పనులు కొంత మేర మందగించినప్పటికీ, తిరిగి జరుగుతున్నాయి. బండ మైసమ్మనగర్‌లో 310 ఇళ్లు కూడా ప్రారంభానికి సిద్ధం చేసినప్పటికీ, లబ్ధిదారుల అభీష్టం మేరకు వచ్చేనెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. – వెంకటదాస్‌రెడ్డి, హౌసింగ్ ఈఈ -
‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ గురించి కేసీఆర్‌కే చెబుతారా? అంటే ప్రెస్మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్‌కు అసలు తెలంగాణ గురించి ఏ మీ తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో.. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి ప్రస్తావన అయినా కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? అని సూటిగా ప్రశ్నించారు. చదవండి: రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా? ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలే.. వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా? అని నిలదీశారు. మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలకు అండగా నిలిచాడని మండిపడ్డాచరు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా.. ఇప్పుడు కేటీఆర్ కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్నాడు.. అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లేనని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని మండిపడ్డారు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ.1000 తగ్గింది. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని అన్నారు. దీనిపై సంబంధిత మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. -
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
పేదల నడ్డి విరుస్తోన్న బీజేపీ
ఇల్లందకుంట (హుజూరాబాద్): ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇస్తున్న పింఛన్‌కన్నా మూడు రెట్లు ఎక్కువగా తెలంగాణలో ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం స్వయం సహాయక సంఘా లకు 3.14 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2 వేల పెన్షన్ అమలు చేస్తున్నా రా అని ప్రశ్నించారు. పేదోడికి టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి డబ్బులు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పన్నులు విధించే బీజేపీ వైపు ఉంటారా? ప్రజల అవసరాలు తీర్చే టీఆర్ఎస్ వైపు ఉంటారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇల్లందకుంట మండలంలోని 682 సహాయక సంఘాలకు 3.14 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.1.30 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మండలంలోని 18 పంచాయతీలకుగాను 18 మహిళా సంఘ భవనాలకు 2.36 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. మండల సమాఖ్యకు మరో 70 లక్షలు కేటా యించి, నాలుగు నెలలలోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఒక్క సంఘ భవనం కూడా కట్టించలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నిరుపయోగమని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోరా!
జోగిపేట (అందోల్): రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని శివ్వంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదలతో పంటలు నష్టపోతే రాష్ట్రంలో ఏడేళ్లలో ఏఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పంటలు పండించి కోట్లు సంపాదిస్తుంటే 50 ఎకరాలున్న రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. రైతులను సన్నరకం వడ్లు పండించాలని చెబుతూ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో దొడ్డు రకం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలన్నారు. యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారని, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని చెప్పి ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. పండుగలకు పర్మిషన్ కావాలా? హిందువులు పండుగ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నిం చారు. హిందువులు పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలనడం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి పండుగకు ఆంక్ష లు పెట్టొద్దని డీజీపీని హెచ్చరించారు. డ్రగ్స్ వాడుతున్న టీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు చేయిస్తామని బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ ప్రచారానికి అమిత్‌షా... శుక్రవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగసభ సందర్భంగా రెండురోజుల పాటు పాదయాత్రకు బండి సంజయ్ విరామం పాటించనున్నారు. అక్టోబర్ 2న బాసరలో తొలివిడత పాదయాత్రను ముగించాలని తొలుత భావించినా, ఈ నెల 17న అమిత్‌షా సభ నేపథ్యంలో హుజురాబాద్ వైపు దానిని మార్చాలని భావిస్తున్నారు. -
రూ. 5 వేల కోట్లు తెచ్చి ఓట్లు అడగండి
హుజూరాబాద్: బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని, అప్పుడే ఓట్లు అడగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోంది టీఆర్ఎస్ సర్కారేనని తెలిపారు. అందుకే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్, వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయిందని, వీణవంకలో రూ.10 లక్షల పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే లాభం ఏంటో చెప్పాలని, ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీకి లాభమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మికుంటలో కూడా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి దాదాపు 500 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే హుజూరాబాద్ ప్రాంతం గులాబీ అడ్డాగా ఉండేదని అన్నారు. టీఆర్ఎస్లోకి ఆయన ఒక్కరే వచ్చారని, ఇప్పుడు కూడా ఒక్కరే బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. -
ఈటల మొసలికన్నీళ్లకు ఆగం కావద్దు
హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుంటే వాటిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దండగ అంటున్నారని.. ఆత్మగౌరవం అంటూ తన పదవికి రాజీనామా చేసిన రాజేందర్ మొసలికన్నీళ్లకు, తియ్యటి మాటలకు హుజూరాబాద్ ప్రజలు ఆగం కావద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడియారాలకు, కుంకుమ భరిణెలకు లొంగవద్దని, న్యాయాన్ని, ధర్మాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. గురువారం హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మహిళలను మరింత బలోపేతం చేసేందుకే ఈ రుణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మహిళలకు ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పదహారు గ్రామాల్లో రూ.3.10 కోట్లతో అన్ని వసతులతో మహిళా భవననాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే పెన్షన్ అందజేస్తామని చెప్పారు. 4 వేల డబుల్ ఇళ్లు పూర్తి చేస్తా.. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల రాజేందర్ పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తనదని, ఇళ్లు వెంటనే పూర్తి చేయిస్తామని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శాలపల్లి గ్రామంలో సభ ఏర్పాట్లను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని.. 5 బ్లాకులు మహిళలకు, 5 బ్లాకులను ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలన్నారు. వీఐపీలకు, ప్రెస్‌కు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. -
ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని కట్టుకున్నాడు
సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవినే త్యాగం చేశా.. ప్రొటోకాల్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని.. దీనిపై కోట్లాడే మనస్తత్వం తనది కాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆత్మకూర్(ఎం)లో విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభా వేదికపైకి ఆహ్వానించలేదని.. అయినా గొడవకు దిగలేదని.. గ్రామం అభివృద్ధి చెందుతుందనే మిన్నకుండిపోయినట్లు వివరించారు. మునుగోడులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేశారని.. తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పార్టీలు మారడం, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారిన దాఖలాలు లేవని, అక్రమ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర లేదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా నల్లగొండలో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని గుర్తు చేశారు. 2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు సమస్యలపై స్పందించక పోవడంతో రాష్ట్రానికి ఎటువంటి నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు రూ. 796 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, ఎంపీపీ తండ మంగమ్మశ్రీశైలం, జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా, సర్పంచ్ జెన్నాయికోడె నగేష్ ఉన్నారు. -
Telangana: సంక్షేమం.. ‘సప్త’పథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ.. ఏర్పాటైన ఏడేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోయింది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, పరిశ్రమలు, వైద్యారోగ్య రంగం, విద్య, ఉద్యోగాలు.. ఇలా ప్రతి రంగంలో దేశంలో ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా ఏడేళ్ల అభివృద్ధి ప్రస్థానం కొనసాగింది. 2014–15తో పోలిస్తే 2021–22 నాటికి అన్ని రంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. ఇదంతా ఏడేండ్ల స్వతంత్ర పాలన.. రాష్ట్రం విషయంలో చిత్తశుద్ధి ఇచ్చిన ఆలంబన’.. అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి, విజయాలపై సోమవారం ప్రగతి నివేదన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని ప్రధాన అంశాలివీ.. సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్రంలో 39,07,818 మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా రూ.10,266 కోట్ల మేర వారికి చెల్లిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల్లో అమ్మాయిల వివాహాలకు సాయం కింద ఇప్పటివరకు రూ.5,556 కోట్లు అందించింది. రాష్ట్రంలో 87 లక్షలకుపైగా కుటుంబాల్లోని 2.83 కోట్ల మందికి ఏటా 1,78,754 టన్నుల బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 3,854 సంక్షేమ హాస్టళ్లు, 28,623 ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 12 వేల టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 2014 నుంచి ఇప్పటివరకు రూ.41,253.66 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యానికి చేయూత ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. పీహెచ్‌సీల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు వసతులు పెంచింది. ల్యాబ్‌లు, పరికరాలు, ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించింది. తెలంగాణ వచ్చే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల వరకు బెడ్స్ ఉండేవి. ఇప్పుడు మరో 5,000 పడకలు, వసతులు అదనంగా సమకూరాయి. తొలుత 5 మెడికల్ కాలేజీలే ఉండగా.. కొత్తగా 4 కాలేజీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్‌లో స్వయం సమృద్ధి రాష్ట్రంలో 13 వేల మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చినా ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనతను తెలంగాణ విద్యుత్ సంస్థలు దక్కించుకున్నాయి. ఏర్పాటయ్యే నాటికి విద్యుత్ కొరతతో ఉన్న రాష్ట్రాన్ని.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ఏడేళ్లలో ఎన్నో ప్రణాళికలు అమలు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లు స్థాపిత సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు 16,245 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. వ్యవ ‘సాయం’ వ్యవసాయ రంగానికి 2013–14 బడ్జెట్లో మొత్తం ఉమ్మడి ఏపీకి కేటాయించింది కేవలం రూ.4,040 కోట్లు. అందులో తెలంగాణ వాటా 1,697 కోట్లు మాత్రమే. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఒక్క 2019–20 ఏడాదిలో వ్యవసాయ రంగానికి రూ.33,125 కోట్లు కేటాయించింది. రాష్ట్రం పంటల ఉత్పత్తిలో 23.7 శాతం వృద్ధి సాధించింది. ప్రభుత్వం తొలిదశలో రూ.16,124.37 కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేసింది. తర్వాత 2018 డిసెంబర్లో మరో రూ.25,936 కోట్లు రుణమాఫీకి నిర్ణయించింది. పంట పెట్టుబడుల కోసం ఏటా రూ.10వేల కోట్లకుపైగా రైతు బంధు సాయం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.35,676.22 కోట్లను రైతులకు అందజేసింది. కోటి ఎకరాల మాగాణి దిశగా.. కృష్ణా, గోదావరి నీటిని సమర్ధంగా వినియోగించుకుంటూ కోటి ఎకరాల మాగాణ దిశగా తెలంగాణ అడుగులు వేసింది. ఇప్పటికే ప్రాజెక్టుల కింద 72.55 లక్షల ఎకరాలు సాగవుతుండగా.. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 52.11 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేలా ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. కాళేశ్వరం దాదాపు పూర్తికాగా.. పాలమూరు– రంగారెడ్డి, డిండి, సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్, చనాకా–కోరాట బ్యారేజీ, సదర్మాట్ బ్యారేజీ పనుల పూర్తికి చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు అందుతున్నాయి. విద్యా రంగంలో ప్రగతి రాష్ట్రంలో కొత్తగా 618 రెసిడెన్షియల్ పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, హైదరాబాద్‌లో ఏరో యూనివర్సిటీ, కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు, నిజామాబాద్‌లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ, వరంగల్‌లో సైనిక్ స్కూల్, ములుగులో ట్రైబల్ వర్సిటీ వంటివి రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కొత్తగా 11 పాలిటెక్నిక్ లు ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీపై దృష్టి రాష్ట్రంలో 2014 నుంచి 2021 మార్చి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 128.37 శాతం పెరిగాయి. మొత్తం 6,48,560 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. వారి జీతాలకే ఏటా రూ.39,121 కోట్లు ఖర్చు చేస్తోంది. 2013–14లో జీతాల ఖర్చు రూ.17,130 కోట్లు మాత్రమే. 2,27,782 మంది తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు ఏటా రూ.1,023.43 కోట్ల ఖర్చు అవుతోంది. పరిశ్రమలకు ఊతం రాష్ట్రంలో 2019–20 నాటికి కొత్తగా 250 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. 2013–14లో రూ.57,258 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు (8 శాతం వృద్ధి రేటుతో) జరగ్గా.. 2019–20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు (17.93 శాతం వృద్ధితో) జరిగాయి. అమెజాన్ భారీ పెట్టుబడి, టీ–హబ్, వీ–హబ్, టీ–ఫైబర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు, వరంగల్‌లో సైయంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లు, ఈ గవర్నెన్స్ సేవల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడం, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ వంటివి పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా 2021 మే నాటికి రూ.2,15,450 కోట్ల పెట్టుబడులతో.. 15,64,804 మంది ఉపాధి అందించే 16,129 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. రెవెన్యూలో సంస్కరణలు రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్ రూపొందించి.. భూరికార్డులు ఎవరూ మార్చలేని విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలోనూ మార్పులు తెచ్చింది. గ్రామీణాభివృద్ధిలో ముందంజ! తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామాలకు నిధులు ఇవ్వడంతోపాటు పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే మూడు విడతలుగా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలను మార్చగలిగింది. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి, సంరక్షించడం, ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయడం, నర్సరీలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం, సురక్షిత తాగునీటి సరఫరా వంటివి చేపట్టింది. ఊరికో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ సమకూరింది. 2014–15 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.13,877 కోట్లు కేటాయిస్తే.. 2021–22లో ఏకంగా రూ.29,291 కోట్లు కేటాయించింది. ప్రతి నెలా పంచాయతీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేస్తోంది. ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో 15.05 కోట్ల పనిదినాలు కల్పించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.463 కోట్లతో 2,601 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు. రూ.743 కోట్ల వ్యయంతో 93,328 కల్లాలను మంజూరు చేశారు. -
తెలంగాణలో లాక్డౌన్.. నకిలీ జీవో వైరల్!
సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రానికి ముప్పు ఉండడంతో రాత్రి వేళల్లో లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొంటూ ఓ నకిలీ జీవో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, క్రీడా స్థలాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ.. గుర్తుతెలియని ఆగంతకులు నకిలీ ఉత్తర్వులను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఏప్రిల్ 30 లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు, 2021 ఏప్రిల్ 1వ తేదీతో ఈ నకిలీ జీవోను రూపొందించారు. అచ్చం ప్రభుత్వం జారీ చేసే జీవోలా ఉండడంతో కొందరు నిజంగానే నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని టీవీలు కూడా ఈ వార్త ప్రసారం చేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది నకిలీ జీవో అని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర! మళ్లీ కరోనా పంజా -
రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్‌ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్ఎస్ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్ అన్నారు. పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవస్థలన్నీ నాశనం
సాక్షి మహబూబాబాద్/సాక్షి భద్రాద్రి కొత్తగూడెం: టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలన్నీ సర్వ నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందులలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. న్యాయవాద దంపతులను హత్య చేసింది టీఆర్ఎస్ నాయకులేనని, ఈ ఘటనతో ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుకొని టీఆర్ఎస్ గల్లీ కార్యకర్త వరకు ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్‌ల పేరిట భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ సమస్య రెట్టింపు అయిందన్నారు. మొత్తం 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పే రివిజన్ కమిషన్ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ, ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ మతపరంగా సమాజాన్ని చీలుస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే బీజేపీని ఓడించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. భద్రాద్రి రాముడికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుక రాములునాయక్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కాగా, న్యాయవాద దంపతుల హత్యపై శుక్రవారం గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. మానుకోటలో రసాభాస మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పార్టీ అభ్యర్థి రాములు నాయక్ మాట్లాడే క్రమంలో వేదికపై ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన నెహ్రూ నాయక్ పేరు పిలవకపోవడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ దండం పెడుతూ సముదాయించేందుకు ప్రయత్నించగా.. బలరాం నాయక్ గో బ్యాక్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ గొడవతో అరగంట పాటు సభకు అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ చేసిన ప్రయత్నా లూ సఫలం కాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు బలం నిరూపణ చేసుకోవాలంటే హైదరాబాద్‌కు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వేదికపై ఉన్న నేతలందరూ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
దూకుడు పెంచిన టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. యాత్రలజోరు పెరిగింది. ముఖ్యనాయకులు ‘నడక మంచిదే’అంటున్నారు. నల్ల వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతుయాత్రలు చేపట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇకముందు కూడా ఇదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ యాత్రల ద్వారా పార్టీ కేడర్‌లో కదలిక వస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టగలుగుతున్నామని భావిస్తున్న టీపీసీసీ నాయకత్వం 2023 ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేపనిలో పడింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని, జై జవాన్, జై కిసాన్ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టేందుకు టీపీసీసీ ముఖ్యులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రెండు యాత్రలు... రెండు రూట్లు రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్యనేతలు ఈ నెలలో యాత్రలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 7న అనూహ్యంగా అచ్చంపేట దీక్షా శిబిరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించి 10 రోజులపాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను ఆయన కదిలించగలిగారు. రోజుకు నాలుగైదు గ్రామాల చొప్పున 40 గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్ర ముగింపు సమయంలో రావిరాలలో భారీ జనసమీకరణతో బహిరంగసభ నిర్వహించి ఒక్కసారిగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానని ప్రకటించారు. మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాతో యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి రోజూ ఆయన కూడా నాలుగైదు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మమేకం అవుతున్నారు. వీలున్నచోటల్లా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ నెల 22 వరకు తన యాత్రను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు పార్టీకి ఉపయోగకరంగానే ఉన్నాయనే భావన టీపీసీసీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ యాత్రల గురించి టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ఇన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయలేకపోయామని, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభమైనందున, దీన్ని కొనసాగించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటేనే పార్టీకి మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు త్వరలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికే కొందరిని కలిశారని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. మొత్తంమీద వరుస ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయి యాత్రలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా దేశమంతా ఏక్తా దివస్ నిర్వహిస్తున్నాం. దేశ సమగ్రత కోసం ఐక్యతా దివస్ నిర్వహిస్తున్నాం. దేశాన్ని చిన్నచిన్న సంస్థానాలతో బ్రిటీష్ వారు విచ్చిన్నం చేశారు. వీటిని దేశంలో కలిపిన మహనీయులు సర్దార్. భారత దేశంలో విలీనం కాము. అవసరమయితే పాకిస్తాన్‌తో కలుస్తామని అప్పట్లో కొన్ని సంస్థానాలు ప్రకటించాయి. (పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి) నిజాం మరో అడుగుముందుకేసి ఐక్యరాజ్యసమితిలో కూడా విడిగా ఉంటామని దరఖాస్తు చేసుకున్నాడు. రజాకార్లతో తెలంగాణ ప్రజలు, హిందువులపై, మహిళలపై దాడులు చేసి రక్తపాతం సృష్టించారు. సర్దార్ ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వంతంత్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించారు. ఏడాది తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనమై జాతీయ జెండా ఎగిరింది. తెలంగాణ ప్రజలు దేవుడిలా చూసుకునే సర్దార్‌ను టీఆర్ఎస్ సర్కార్ విస్మరించింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మజ్లిస్ కనుసైగల్లో పాలన చేస్తూ.. వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు. తెలంగాణ ప్రజలు సర్దార్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. పటేల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విమోచన దినోత్సవంను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించాలి. ఆగస్టు 15, జనవరి 26 తరహాలోనే సెప్టెంబర్ 17ను జాతీయ పండుగలా నిర్వహించాలి. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకు లెంపలేసుకొని సెప్టెంబర్‌ను జాతీయ పండగలా నిర్వహించాలి' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్లేందుకే ఏక్తా దివస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పటేల్ దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నిజాం మెడలు వంచిన వ్యక్తి సర్దార్. పటేల్ లేకపోతే తెలంగాణకు స్వంతంత్రం వచ్చేది కాదు. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెబుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడిన పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 17ను గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈ రోజైనా కేసీఆర్ సర్దార్ పటేల్‌కు నివాళులర్పించాలి. ఆయన స్ఫూర్తితో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా అని చెప్పాలి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సర్దార్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన స్పూర్తితో అఖండ భారత నిర్మాణం కోసం ముందుకెళ్తాం' అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
యూపీ కన్నా ఘోరంగా తెలంగాణ
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో దళితులపై అత్యాచార ఘటనలు పెరుగిపోతున్నాయని, వారిపై అత్యాచారాల విషయంలో ఉత్తర ప్రదేశ్ కన్నా ఘోరంగా తెలంగాణ మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దళితులపై అత్యాచారాలు, హింసకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారుతోందన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అత్యాచార ఘటనల్లోని ఎనిమిది బాధిత కుటుంబాలను ఉత్తమ్‌తోపాటు పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ భవన్లో దళిత కుటుంబాల పరామర్శ సందర్భంగా ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తమ్ ప్రకటించారు. -
తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన సర్కారు.. తాజాగా వ్యవసాయేతర భూమి నియోగ మార్పిడి(నాలా) అధికారాల నుంచి ఆర్డీవోలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది ఈ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించాలని యోచిస్తోంది. సాగు భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేయాలంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు, ప్రతిపాదిత భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆర్డీవో ఆదేశిస్తారు. తహసీల్దార్ సిఫారసుకు అనుగుణంగా ఆర్డీవో నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల ‘నాలా’జారీ ఆలస్యం కావడమేగాకుండా.. అక్రమాలు కూడా జరుగుతున్నాయని గుర్తించిన సర్కారు ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. భూ వినియోగ మార్పిడిపై దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపే సాగు భూమి విస్తీర్ణం నుంచి ఇతర అవసరాలకు మళ్లుతున్న భూమిని తొలగించేలా అధికారాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్వోసీలకు మంగళం! నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ)కు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన సర్కారు.. ఎన్వోసీ కమిటీలను కూడా ఎత్తేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైని కులు, అమరులు, పోలీసుల కుటుంబాలకు కేటాయించే భూములను విక్రయించుకునే అధికారాలను కలెక్టర్ నేతృత్వంలోని ఎన్వోసీ కమిటీలు జారీచేస్తాయి. అయితే, ఈ ఎన్వోసీల జారీ కొందరు అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్వోసీలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. చెల్లింపుల ద్వారా కేటాయించిన భూములపై నిర్దేశిత కాల వ్యవధి తర్వాత ఆటోమేటిక్‌గా యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని నిర్ణయించింది. వడివడిగా ‘ధరణి’.. దసరా నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లను తహసీళ్లలోనే చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ నెల మూడో వారంలో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌ను మదింపు చేస్తున్న సాంకేతిక సర్వీసుల శాఖ వచ్చే వారంలో దాని పనితీరును పరిశీలించనుంది. తహసీళ్లకు సాంకేతిక సౌక ర్యాలు సమకూరుస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న స్వాన్ (స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్)కు అదనంగా మరో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వెసులు బాటును తహసీల్దార్లకు కల్పించింది. రాష్ట్రంలోని 590 తహసీళ్లకు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉండగా, స్థానికంగా మంచి నెట్వర్క్ కలిగిన కనెక్షన్ అదనంగా తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
ఆ విషయం కూడా తలసానికి తెలియదా?
సాక్షి, హైదరాబాద్ : ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్ కంపెనీల కోసం పేదల భూముల్ని లాక్కొంటున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కు మూడు ఎకరాలు ఇస్తామంటూ చెప్పి అవి ఇవ్వకపోగా వారి అసైన్డ్ భూములనే ప్రభుత్వం తీసుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వ భూములను ఫార్మాసిటీ పేరుతో దాదాపు 8వేల ఎకరాలను ప్రభుత్వం ఆక్రమణలోకి తీసుకుందని భట్టి వ్యాఖ్యానించారు. అసలు ఫార్మాసిటీ ద్వారా ఎలాంటి ప్రజా ప్రయోజనాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు సామన్య ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కోవడం దుర్మార్గమన్న భట్టి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే సహించమన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి తరపున కాంగ్రెస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. (తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు లేఖ) ఫార్మా వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. ఫార్మాసిటీ ని మొత్తం ప్రభుత్వం బ్రోకరేజ్ గా మార్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2.68 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు 2016-17లో నిర్మిస్తామని కేసీఆర్ సభలో వాగ్దానం చేసి మరిచారని విమర్శించారు. ఇప్పుడు అసలు వాటి జాడే లేదని, ఫీల్డ్‌లో ఉన్న 3428 ఇళ్లు మాత్రమే చూపించారని దుయ్యబట్టారు. మంత్రి తలసానికి కూడా ప్రభుత్వం లక్ష ఇళ్లు కూడా కట్టలేదన్న సంగతి తెలియనట్లుందని, కేవలం కాగితపు లెక్కలే చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని సైతం తొలిగించిదని తెలిపారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి) -
కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా పేదలు పూర్తిగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో పేద కుటుంబాలు, ఎంఎస్ఎంఈల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. టెలీ స్కోపిక్ విధానం ద్వారా బిల్లులు ఇవ్వాలని, ఈ విధానంతో భారం తగ్గుతుందన్నారు. లాక్డౌన్లో బిల్లులు మూడింతలు వచ్చాయని,ఆ సమయంలో ఎలాంటి సహాయం చేయని ప్రభుత్వం.. బిల్లులైనా మాఫీ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబాల విద్యుత్ భారం ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సౌధకు నేరుగా వెళ్లి సీఎండీ ప్రభాకర్ రావు కి వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. -
బీజేపీ నేతల హౌస్ అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నేతలు అరవింద్, రాజాసింగ్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముందస్తుగా ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకుని హౌస్ అరెస్ట్‌లు చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు రద్దు చేసేవరకు నిరసన సాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. బీజేపీ నేతలు అరెస్ట్.. వరంగల్: హన్మకొండ ఎంపీడీసీఎల్ భవనం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. పేదలపై 10 శాతం అధికంగా విద్యుత్ భారం మోపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా, అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రైతుల పక్షాన ప్రశ్నిస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి రైతుల పక్షాన పలు అంశాలపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. సింగూరు-మంజీర నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు మంత్రిగా కొనసాగుతున్నారని.. తాను గత అసెంబ్లీ సమావేశాల నుంచి సంగారెడ్డి కి నీళ్లు కావాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో హరీష్‌రావు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారని... ఆ ప్రాంతంలో 70 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. పంటనష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. లాయర్లకు నెలకు రూ.5వేలు ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. -
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ దిశ కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. దిశ ఘటనలోని నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూశానని.. నిజంగా ఇది ఆ కుటుంబానికి సత్వర న్యాయం అని భావించినట్టు ఆయన చెప్పారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించే విషయమన్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలన్నారు. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభించిందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ఆయన ప్రశంసలు కురిపించారు. సీపీ సజ్జనార్ లాంటి వ్యక్తులు ఉన్న పోలీస్ వ్యవస్థకు.. కేసీఆర్ ప్రభుత్వానికి చిరంజీవి అభినందనలు తెలియజేశారు. చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ 'తమ్ముడు చేసిన పని వారికి కఠినమైన సందేశం' ఈ ఎన్కౌంటర్ హెచ్చరిక కావాలి: అనుపమ -
హైదరాబాద్‌ను బ్రాందీ నగరంగా మార్చారు
భువనగిరి అర్బన్: హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ నగరంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, మరోవైపు బార్లను తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్ కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడైన తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. తన మీద జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇటీవల చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ అంతిమయాత్రలో పాల్గొన్న తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్స్పెక్టర్ అంజయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీజేపీ పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి కామర్స్ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఘటన వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ సమర్పించిన ఫోటోలు, వీడియోలు, పత్రిక కథనాలను ఓం బిర్లా పరిశీలించారు. ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. విచారణ చేపట్టాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ త్వరగా ముగించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దాడి చేసిన పోలీస్ అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. కాగా ఇటీవల తనపై పోలీసులు దాడికి దిగారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మంత్రిపై పోలీసు దాడి ఘటనపై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నంబర్ 1137/36/3/2019గా నమోదు చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
బాధ్యతలు చేపట్టిన గౌరవ్ ఉప్పల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఆర్సీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు ఏఆర్సీ వేదాంతం గిరి, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా మూడేళ్లపాటు విధులు నిర్వర్తించిన గౌరవ్ ఉప్పల్‌ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. గౌరవ్ 2005 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. -
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం
ముషీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. దసరా వేడుకలు కూడా లేకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మద్దతుగా శనివారం బస్‌భవన్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ రోడ్డుపైకి వచ్చిందని, ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని కాపాడుకునేందుకే తాము సమ్మె కొనసాస్తున్నామన్నారు. ఈ ధర్నాలో బీజేపీతో పాటు తెలంగాణ జన సమితి, పలు ప్రజా, మహిళా, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. బస్‌భవన్ ప్రాంగణం అంతా కార్మికులతో కిటకిటలాడింది. మరోవైపు ధర్నా నేపథ్యంలో ఉదయం నుంచే భారీ బందోబస్తు చేపట్టిన పోలీసులు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి వీఎస్టీ వరకు ప్రధాన రహదారి మొత్తం బారికేడ్లతో మూసివేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలతో పాటు వివిధ జిల్లాల బీజేపీ నాయకులతో కలిసి బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి భారీ ర్యాలీగా బస్ భవన్‌కు తరలివచ్చారు. డా.కె.లక్ష్మణ్ బస్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బలవంతంగా అరెస్టు చేశారు. కాగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో బస్‌భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో లక్ష్మణ్ డిశ్చార్జ్ అయ్యారు. -
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ అప్పుల పాలవ్వడానికి ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని, కావాలనే అప్పుల్లోకి నెడుతోందని, దానిని సాకుగా చూపి ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మెకోసం నెల రోజుల కిందటే నోటీస్‌లు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికులను తొలగిస్తూ సీఎం బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి సీఎం మాట్లాడుతున్నారని, బీజేపీ ఉన్న దగ్గర ఎక్కడా రవాణా వ్యవస్థ అప్పుల ఊబిలోకి పోలేదని, కార్మికులు ఆందోళన చేయలేదన్నారు. ప్రజలు మరో విజయదశమి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సకల జనుల సమ్మె చేసినప్పుడు పేద కార్మికుడు కూడా పస్తులుండి పాల్గొన్నారన్నారు. ఇపుడు మాత్రం అదే కార్మికులను రోడ్డున పడేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే నిప్పుతో గోక్కోవడమేనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను రాత్రికి రాత్రే తొలగించడం అలాంటిదేనన్నారు. దసరా పండుగ రోజున సీఎం ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని, జీతాలు ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఆయన జాగీరా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కార్మికుల విషయంలో సీఎం నిర్ణయం ఈ ప్రభుత్వ పతనానికి నాందని అన్నారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ఎన్ఎంయూ నేతల భేటీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతివ్వాలని లక్ష్మణ్‌కు నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఎన్ఎంయూ నేతలు కమల్‌రెడ్డి, మౌలానా, నరేందర్ తదితరులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. -
ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, ఎస్మా, పీడీ యాక్ట్ పేరుతో భయపెడుతున్నారని దుయ్యబట్టారు.ఆర్టీసీని ముంచింది ఈ ప్రభుత్వమేనన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని కలవడంలో తప్పు లేదన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలు, వికారాబాద్ జిల్లా నుంచి పలువురు టీడీపీ, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, కె.మాధవి, ఎన్వీ సుభాష్, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తీర్చాలని, లేకపోతే బీజేపీ తరపున పోరాటాలకు సిద్ధం కావాలని లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల బీజేపీ సెల్ సమావేశంలో లక్ష్మణ్ ప్రసంగించారు. -
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయి: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీని చేపట్టిందని, లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు చనిపోతే బీమా క్లెయిమ్ చేసిన వెంటనే వారికి గొర్రెలను ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.కోట్లలో బీమా సొమ్మును ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులైన రైతులు నష్టపోవాలా అని ప్రశ్నించారు. వచ్చే నెల 5లోగా గొర్రెలకు చెందిన బీమా క్లెయిమ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికలు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏపీ తరుపున ఆయన శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యంకు సమ్మె నోటీసులు అందచేశారు. అనంతరం అశ్వద్ధామ మాట్లాడులూ.. తెలంగాణలో ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని, ఈ నెల 23, 24 తేదీల్లో సంస్థ డిపోల ముందు ధర్నాలు చేయనున్నామని, దీనిని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని గుర్తు చేసిన ఆయన.... మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకే సంస్థను పిచ్చికుక్కలా తయారు చేస్తోందనిడ్డి మండిపడ్డారు. దీనిపై అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో లేదని, ఓఆర్ పెరిగిందని అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే నష్టాల పేరు ఎత్తుతోందని, లాభ నష్టాలతో సంబంధం లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలన్నారు. 2013లోనే ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని, విలీనంపై హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చి నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అశ్వద్ధామ పేర్కొన్నారు. కో-కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు అన్ని యూనియన్లతో కలిసి పోరాడుతామని, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికులను తగ్గించినా సంస్థ ఆదాయం పెంచామని అన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని... ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని గుర్తు చేశారు. కో- కన్వీనర్ వీఎస్ రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.3.6 కోట్లు పన్నుల రూపంలో కడుతున్నామని, ఎవరికీ పన్నులు లేనప్పుడు తమకెందుకు పన్నుల వేస్తారని ప్రశ్నించారు. సామాజిక బాధ్యతగా సర్వీసులు నడుపుతున్నామని, రైతు ఆత్మహత్యలులతో పాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చేసిన చట్టాలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
31,000 పోస్టులు.. 900 కేసులు- హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో 95,345 పోస్టులు మంజూరు చేసిందని, ఇప్పటికే ఏర్పడిన ఖాళీలతో కలిపి 1,49,382 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,17,714 పోస్టులు భర్తీ చేయగా, మరో 31,660 పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉందని బుధవారం అసెంబ్లీలో ప్రశ్నత్తరాల సమయంలో వెల్లడించారు. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై 900 వరకు కేసులు వేశారని, ఇవి కొన్ని స్టే, మరికొన్ని అప్పీల్ దశలో ఉన్నాయన్నారు. దీంతో భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు కేసులు ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డు ఎక్కువ మందిని అన్‌ఫిట్‌గా నిర్ధారిస్తుందనే అంశంపై త్వరలో సింగరేణి సీఎండీ, సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాకతీయ మిషన్‌కు పైసా కూడా ఇవ్వలేదు.. మిషన్ కాకతీయను నీతి ఆయోగ్ మాజీ సీఈవో అర్వింద్ పనగరియా ప్రశంసించడంతో పాటు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానిమస్తూ.. వర్షాభావ పరిస్థితుల్లోనూ చెరువుల్లో జలకళ తీసుకొచ్చేందుకు ప్రాజెక్టుల కాల్వలపై 3 వేలకు పైగా తూములు నిర్మించి 9 వేల చెరువులను నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ కాకతీయ కింద 25,272 చెరువులను పునరుద్ధరించడం ద్వారా 14.15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. కుషు్ట, టీబీ, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్వాడీ సభ్యుల సహకారం తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ చేసి సంబంధిత నివేదికను రోజూ జిల్లా కార్యాలయానికి పంపించాలి. అదే నివేదికను విలేజ్ హెల్త్ సరీ్వస్ యాప్‌లో నమోదు చేయాలని యోగితా రాణా కోరారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలను స్క్రీనింగ్ చేస్తారు. రోజూ 20 ఇళ్ల చొప్పున స్క్రీనింగ్ చేయాలి. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి పని చేయాల్సి ఉంటుంది. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా.. ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించట్లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఇది మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి వీలవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే పరీక్షలకు ఓ మెడికల్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. సబ్ సెంటర్‌కు ఏఎన్ఎం పర్యవేక్షణగా ఉంటారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లేకుంటే సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి నమోదు చేయాలి. వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపాలి. టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ప్రొటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీ కూడా నమోదు చేయాలి. రోజువారీ స్క్రీనింగ్ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్ఎంలు నమోదు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఈ నెల 17న ఉంటుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు. -
‘దామరచర్ల’కు డబుల్ ట్రాక్ లైన్
సాక్షి, హైదరాబాద్: దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి అనుగుణంగా ఈ మార్గంలోని రైల్వేలైనును డబుల్ ట్రాక్ లైన్‌గా మార్చాలని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరా రు. ఇక్కడ 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవ ర్‌ప్లాంటు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్‌ప్లాంటుకు సింగరేణి నుండే మొత్తం బొగ్గు ను తీసుకోవాలని నిర్ణయించినందున కొత్తగూడెం నుంచి డోర్నకల్ వరకు; మోటమర్రి నుంచి విష్ణుపురం వరకు 200 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దామరచర్ల ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని, డబుల్ లైన్ నిర్మాణం, రైల్వేలైన్ పటిష్టం చేసే పనులు కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. దామరచర్ల, భద్రాద్రి, కేటీపీపీకి బొగ్గు రవాణా చేసేందుకు ప్రస్తుత రైల్వేలైన్లు, భవిష్యత్తులో నిర్మించాల్సిన రైల్వే లైన్లపై ప్రభాకర్‌రావు విద్యుత్ సౌధలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్ కె.శివప్రసాద్, చీఫ్ మేనేజర్ డి.నాగ్య, జెన్కో డైరెక్టర్లు నర్సింగ్‌రావు, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు. రోజూ 50 వేల టన్నుల బొగ్గు సరఫరా కావాలి.. ‘‘డోర్నకల్–విజయవాడ లైన్‌లోని మోటమర్రి నుంచి బీబీనగర్–నడికుడి మార్గంలోని విష్ణుపు రం వరకు 100 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ ఉంది. ఇది రోజుకు 5–6 రేక్స్‌కు మించి బొగ్గు ను రవాణా చేయలేదు. దామరచర్ల విద్యుత్ ప్లాంట్‌కు ప్రతిరోజూ 50 వేల టన్నుల బొగ్గు కా వాలి. అంటే ఈ లైనులో 59 బోగీలున్న 14 గూ డ్స్ రైళ్లు ప్రతిరోజూ వచ్చి పోవాలి. ఇంత సామ ర్థ్యం ఇప్పుడున్న లైన్లకు లేదు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం–డొర్నకల్ మార్గంలో 100 కిలోమీటర్లు, మోటమర్రి–విష్ణుపురం మార్గంలో 100 కిలో మీటర్లు, మొత్తం 200 కిలోమీటర్ల మేర డబుల్‌లైన్ నిర్మించాలి’’అని ప్రభాకర్‌రావు చెప్పారు. ప్రత్యేక రైలు మార్గమా.. డంపింగ్ యార్డా... ఖాజీపేట– బల్లార్ష మార్గంలోని ఉప్పల్ నుంచి ప్రస్తుతం భూపాలపల్లి పవర్‌ప్లాంటుకు బొగ్గు సరఫరా అవుతోంది. ఉప్పల్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైళ్లను ఆపి బొగ్గును దిగుమతి చేసి అక్కడ నుంచి లారీల ద్వారా భూపాలపల్లికి తరలిస్తున్నారు. ఈ లైను అత్యంత రద్దీ అయిన చెన్నై– ఢిల్లీమార్గంలోనే ఉంది. ఉప్పల్‌లో అన్లోడింగ్ వల్ల ఇతర రైళ్లకు ఇబ్బంది కలుగుతున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్ నుంచి భూపాలపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించడమో, లేదంటే ఉప్పల్ నుంచి కొద్దిదూరం రైల్వే ట్రాక్ నిర్మించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రైల్వే, జెన్కో అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించాలని నిశ్చయించారు. -
‘రెవెన్యూ’లో స్తబ్దత
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సందడి నెలకొంది. మరో నెలన్నర కాలంలో పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో చివరి స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్టాండింగ్ కమిటీ నియామకం జరిగినా కేవలం 34 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అయినా చివరి స్టాండింగ్ కమిటీలో చోటు కోసం ఆశావాహుల నుంచి భారీగానే పోటీ పెరిగింది. జూలై 2తో పాలకవర్గం గడువు ముగియనుంది. నగరపాలక సంస్థలో పూర్తిస్థాయి బలం టీఆర్ఎస్కు మాత్రమే ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన 15 మంది సభ్యులకు మూడు దఫాల్లో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగే అవకాశం దక్కింది. చివరి కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు మేయర్, ఎమ్మెల్యేలకు విన్నవిస్తున్నారు. సహచర కార్పొరేటర్ల మద్దతు కూడగడుతున్నారు. గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మూడు సార్లు పోటీలో ఉండేందుకు ఆసక్తిచూపించినప్పటికీ ఎమ్మెల్యే, మేయర్ సూచనలతో పోటీ నుంచి తప్పుకున్నామని, ఈసారి మాత్రం తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని కొంతమంది కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. దీంతో ఈ చివరి కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు గతంలో జరిగిన మూడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ దీటుగా రెవెన్యూ ఉద్యోగులు తమ పనులను పూర్తి చేసుకోని 5 గంటలకే తాళాలు వేసి ప్రభుత్వానికి తెలిసేలా నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు అధికారులంతా పోలింగ్ విధుల్లో తలమునకలయ్యారు. తర్వాత సాధారణ విధుల్లో చేరడంతో కార్యాలయానికి వచ్చే పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రక్షాళన అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా డీలాపడ్డారు. మొత్తంగా కొన్ని రోజులు తహసీల్ కార్యాలయాలకు తాకిడి తగ్గుముఖం పట్టింది. నాడు గృహనిర్మాణ.. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో అంటే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఆనంతరం కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు అధికంగా సాగుతున్నాయని, పెద్దగా పనికూడా లేదంటూ గృహ నిర్మాణ శాఖను రద్దు చేసింది. కాంగ్రెస్ హయాంలో రూ.70 వేల నుంచి రూ.లక్ష చొప్పున అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. అప్పట్లో తీవ్ర అవినీతి సాగిందని, కొందరు నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారికి ఇళ్లను మంజూరు చేయించారని, కనీసం వాటిని నిర్మించిన పాపాన పోలేదనే ఆరోపణలు వినిపించాయి. ఒక ఇంటికే రెండు నుంచి నాలుగుసార్లు బిల్లులు పొందారని, ప్రభుత్వ లక్ష్యం ఏ మాత్రం నెరవేరలేదనే అసంతృప్తులు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కొన్ని మండలాలను ఎంపిక చేసి విచారణ చేయించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని డివిజన్లో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు దుమారాని లేపిన విషయం విదితమే. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నివేదిక సైతం అందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు చదివిన తర్వాత అవినీతి పెచ్చుమీరినట్లు గమనించారు. పైగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ.5.04 లక్షలు ఇస్తానంటూ ఎన్నికల్లో ప్రకటించింది. ఈ పనులన్నీ గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తారని అంతా భావించినప్పటికీ చివరకు ప్రభుత్వం శాఖను రద్దు చేసి, నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలకు కట్టబెట్టింది. అప్పట్లో ఆ శాఖలో హౌసింగ్‌లో పని చేస్తున్న పదుల సంఖ్యలోని వర్క్ ఇన్స్పెక్టర్లను, ఏఈలను నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదలాయించింది. తాజాగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంలో గుబులు మొదలైంది. గతంలో గృహ నిర్మాణ శాఖకు తలెత్తిన పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళన.. ఉత్కంఠ రెవెన్యూ సిబ్బందిలో మొదలైంది. కీలకం కానున్న ధరణి... రెవెన్యూ శాఖను రద్దు చేసి ఆ శాఖలోని వీఆర్వోలను పంచాయతీరాజ్ శాఖకు, గిర్దవార్, ఉపతహసీల్దారు, తహసీల్దార్లను వ్యవసాయ శాఖలోకి పంపిస్తారంటూ విసృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో రెవెన్యూ ఉద్యోగులు కొంత మేరకు ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజానీకంలోనూ చర్చనీయాంశంగా మారింది. భూములకు సంబంధించి వ్యవహరాలన్నింటినీ ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న కీలక శాఖ మీద ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగని రీతిలో, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు ఎలాంటి యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ, వడగాడ్పులు ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇళ్ల్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. పరేడ్ గ్రౌండ్ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’అని అధికారులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీ హాల్‌కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులూ దీన్ని అంగీకరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు జరిపే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలోనూ వాటిని మినహాయించడం సముచితమని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్యఅతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు జరపాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం నాటి సమీక్షలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా జరపాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సీఎఎస్ ఎస్.కె..జోషిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంనాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, సీఎం సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎట్ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అవతరణ ఉత్సవాలకు స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నీటి ప్రాజెక్టుల్ని అడ్డుకోం
సాక్షి, హైదరాబాద్ : ‘ఒకరిద్దరి కోసం ప్రాజెక్టుల నిర్మాణాల్ని ఆపలేం. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసమే. కోట్ల మంది దాహార్తిని శాశ్వతంగా తీరుస్తాయి. పైగా పర్యావరణ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు దోహదపడతాయి. కొద్ది మంది కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోజాలం. అదే సమయం లో ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతులకు సకాలంలో చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన పలు కేసుల విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ధిక్కార కేసులకు మినహాయింపు... ‘పునరావాసం, పునర్నిర్మాణం, పరిహారం చెల్లింపులను విచారిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన 177 వ్యాజ్యాలన్నీ కలిపి విచారిస్తాం. అంతే కాకుండా ఇకపై వ్యాజ్యాలు దాఖలైతే వాటిని కూడా ఇక్కడికే నివేదించేలా హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. అయితే సింగిల్ జడ్జి వద్ద తీర్పు వెలువరించాల్సిన మూడు కోర్టు ధిక్కార కేసులను మాత్రం మినహాయింపు ఇస్తున్నాం’అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఎవరి అంగీకారంతోనో రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చట్టం కూడా చెబుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును ఉల్లంఘిస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం పనులు చేస్తోందంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాలను, దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులపై దాఖలైన ఇతర కేసుల్ని, మొత్తం 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సిందే... ‘వాతావరణంలో ప్రతికూల మార్పులు కనబడుతున్నాయి. వర్షాలు పడటం లేదు. నూరు శాతం వర్షాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఈసారి 93 శాతం రుతుపవనాలు వస్తాయని చెప్పడం అదృష్టమే. రాజస్తాన్ ఎడారిగా మారకుండా ఉండాలంటే నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు జరగాల్సిందే. రాజస్తాన్‌లోని బనాస్ ప్రాజెక్టుపై దాఖలైన న్యాయ వివాదాల్ని పరిష్కరించిన ధర్మాసనంలో నేనున్నాను. ఆ ప్రాజెక్టుతో తొమ్మిది జిల్లాలకు నీరు అందింది’అని అదనపు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పరిహార ఒప్పంద పత్రాలు తెలుగులో ఉండేలా చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు వాటిని అందజేసే ముందు వాటిలోని విషయాల్ని తెలుగులోనే వివరించాలని పేర్కొంది. దీంతో బాధిత రైతులకు అన్నీ తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పింది. పరిహారం తీసుకుని పోరాడండి... ‘భూ సేకరణ ప్రజల సమస్య. చట్టపరమైనది కాదు. పదేళ్ల కిత్రం అందుకోవాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని తీసుకుని న్యాయపోరాటం చేస్తే బాధితుడు నష్టపోడు. ఆ పరిహారం తీసుకోకుండా ఇప్పుడు రూ.8 లేదా 9 లక్షలు పరిహారం తీసుకుంటే అది రూ.5 లక్షలతో సమానం అవ్వదు. పరిహారం పెంపు కోసం పాతికేళ్ల వరకూ న్యాయపోరాటం చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతుంటే భూమి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటారు. భూమిని సర్కార్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్వరూ అడ్డకోలేరు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ కథను ధర్మాసనం ఉదహరించింది. ‘గంగా నదిలో ఓ రైతు గొడ్డలి పడిపోయింది. గంగా మాత ప్రత్యక్షమై బంగారం, వెండి, రాగి గొడ్డళ్లు తెచ్చి ఇచ్చింది. అవి నావి కావని రైతు చెప్పాడు. దీంతో గంగా మాత పోయిన ఇనపు గొడ్డలితోపాటు బంగారు, వెండి, రాగి వాటిని కూడా రైతుకు ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా రైతులు తమకు ఏది కావాలో కోరాలి. కానిది అడగొద్దు. ఇచ్చింది తీసుకోవాలి. పట్టుదలకు పోవద్దు. హైకోర్టు మీకు న్యాయపరంగా అండగా నిలుస్తుంది’అని ధర్మాసనం హితవు చెప్పింది. ‘భూ సేకరణ కోసం రైతులు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం వ్యక్తి. గ్రామం కోసం కుటుంబం. పట్టణం కోసం గ్రామం. రాష్ట్రం కోసం పట్టణం. చివరికి దేశం కోసం ఒక రాష్ట్రం త్యాగం చేయాలి. ఇది ఇప్పటి హితోపదేశం కాదు. మహాభారతంలోనే ఉంది. అయిదారు ఎకరాల కోసం ప్రాజెక్టుల్ని అడ్డుకోవడం ధర్మం కాదు. ప్రాజెక్టులు కూడా లక్షలాది మంది ప్రజల కోసమేనని గుర్తించాలి’అని వ్యాఖ్యానించింది. పరిహారం అందజేత... హైకోర్టులో 93 మంది పిటిషన్లు దాఖలు చేస్తే పరిహారం తీసుకోని 33 మందికి, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వేసిన ఆరుగురి చెందిన పరిహారాన్ని రూ.7.5 లక్షల చొప్పున వారి తరఫున వాదించే న్యాయవాది, న్యాయమూర్తుల సమక్షంలో అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అందజేశారు. దీంతో మొత్తం 93 మందికి పరిహారం అందజేసినట్లు అయింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు వద్దని చెప్పి తిరిగి తీసుకోడానికి సమ్మతిని తెలిపిన ఇద్దరికీ కూడా కోర్టులోనే చెక్కుల్ని అందజేశారు. అనసూయ అనే పిటిషనర్ భర్తతో విభేదించి పదేళ్లుగా విడిగా ఉంటున్నారని, భర్తకు పరిహారం ఇచ్చారని, ఆమెకు ఏదీ అందలేదని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని అదనపు ఏజీ బదులిచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 2,500 ఎకరాల రైతులకు పరిహారం చెల్లించామని, ఆర్ఆర్ ప్యాకేజీ నోటీసులు ఇచ్చామని తెలిపారు. గృహాల సేకరణ అంశంపై ప్రాథమిక నోటీసు ఇచ్చామని వివరించారు. డిక్లకేషన్ ఇచ్చేందుకు రైతులు సహరించలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు అదనపు ఏజీ బదులిచ్చారు. విచారణ జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి: లక్ష్మణ్
నల్లగొండ టూటౌన్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించి, వారి సమస్యలు పరిష్కరించాలని తాను శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే పోలీసులతో భగ్నం చేయించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడితే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ఇలాంటి కిరాతక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ కనీ సం స్పందించడం లేదని, కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించార -
మున్నేరు.. ఏదీ నీరు?
మహబూబాబాద్: మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని శివారు కాలనీల ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా వినాయక తండా, పత్తిపాక కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఐదు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. కనీసం మున్నేరువాగు నీరు కూడా సరఫరా కావడం లేదు. మిషన్ భగీరథకు సంబంధించిన నీటి సరఫరా జరగడానికి ఇన్ట్రా విలేజీ పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో సరఫరా కావడానికి చాలా సమయం పడే పరిస్థితి కనిపిస్తోంది. అడుగంటిన చేతి పంపులు జిల్లా కేంద్రం శివారు వినాయక తండాలో సుమారు 50 గృహాలు ఉండగా 250 మంది జనాభా, 120 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఆ తండా వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు రెండు చేతి పంపులు వేయగా.. అందులో పూర్తిస్థాయిలో నీరు లేక అవి పెద్దగా ఉపయోగ పడడం లేదు. ఇక పత్తిపాక కాలనీలో 250 గృహాలు ఉండగా 800 ఓటర్లు, 1100 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో మూడు చేతి పంపులు ఉండగా ఒకటి పని చేయడం లేదు. మరో చేతి పంపులో అరకొర నీరే ఉంది. కేవలం ఒకే ఒక చేతి పంపు ద్వారా మాత్రమే నీరు వస్తోంది. ఒక్క చేతి పంపే ఆధారం వినాయక తండా, పత్తిపాక కలిపి ఒకే చేతి పంపు ఆధారంగా మారింది. పత్తిపాకలో ఉన్న ఈ చేతి పంపులో మాత్రమే నీరు సమృద్ధిగా ఉంది. దీంతో అక్కడికే వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులు వచ్చి బిందెలతో నీరు తీసుకెళ్తున్నారు. కొంత మంది తోపుడు బండ్లతో, మరికొందరు సైకిళ్లు, బైక్‌లపై నీరు తీసుకెళ్తున్నారు. ఆ నీరే తాగడానికి, వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దశాబ్దాలు గడిచినా... వినాయక తండా, పత్తిపాక కాలనీలు ఏర్పాటై ఐదు దశాబ్దాలు గడిచినా ప్రతీ వేసవిలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. మానుకోట శివారులోని మున్నేరువాగు నీటిని కూడా ఈ ప్రాంతాలకు ఇంత వరకు అందించలేదు. అందుకోసం కనీసం పైపులైను కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మిషన్ భగీరథకు సంబంధించిన ఇన్ట్రా విలేజ్ పనులు ఆ ప్రాంతాల్లో ప్రారంభం కాలేదు. ఇంకా ఆరు నెలలైనా పైపులైను పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నల్లాల బావి నీటి సరఫరా.. పత్తిపాక శివారులోని నల్లాల బావి నుంచి మునిసిపల్ సిబ్బంది నీరు సరఫరా చేస్తున్నారు. ఆ బావిలో కూడా నీరు అడుగంటడంతో మూడు రోజులకోసారి ఇంటికి 10 బిందెల చొప్పున మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఆ బావిలోనూ ఫ్లోరైడ్ ఉండటంతో వాటిని తాగడానికి వీలు కావడం లేదు. గతంలోనూ ఆ నీటిని తాగిన కొందరు ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికైనా కాలనీలకు శాశ్వత పైపులైను నిర్మాణం చేసి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. పత్తిపాకలోని చేతి పంపే అందరికీ దిక్కయింది. అధికారులకు పలుమార్లు తెలియజేసినా ఫలితం లేదు. వేసవి కాలంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – తోళ్ల అరుణ, పత్తిపాక కాలనీ వాసి ట్యాంకుల ద్వారా అయినా సరఫరా లేదు నీటి కోసం ఇబ్బంది పడుతున్నా కనీసం మునిసిపాలిటీ అధి కారులు ట్యాంకుల ద్వారా అయినా నీటి సరఫరా చేయడం లేదు. మూడు చేతి పంపుల్లో అరకొర నీరు మాత్రమే ఉంది. దీంతో వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులమంతా పత్తిపాక చేతి పంపు వద్దకే వస్తున్నాం. – జి.తార, పత్తిపాక కాలనీవాసి మూడు రోజులకోసారి నీటి సరఫరా నల్లాల బావి నుంచి మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. కేవలం 10 బిందెల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. బావిలో నీరు అడుగంటింది. ఆ బావిలోనూ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. ఆ నీటిని తాగడానికి ఉపయోగించడం లేదు.– సోమారపు నాగమణి -
‘టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ), యువజన కాం గ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు. విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్ ఇంటర్‌బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్ మాదిగ సంఘీభావం తెలిపారు. దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం 50 శాతం లోబడే ఉండాలని చెబుతుందని కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది రామచందర్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు వింటామన్న కోర్టు.. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. -
‘మియాపూర్’పై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములపై సీల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తక్షణమే ఆ ఉత్తర్వులను నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని తేల్చి చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపట్ల కోర్టుకు సానుభూతి ఉండదని హైకోర్టు తెలిపింది. -
బీమా.. ధీమా
మహబూబ్‌నగర్ రూరల్ : రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి బాసటగా ఉండేలా రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా టీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. గత ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటివరకు.. రైతు బీమా పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో 350 కుటుంబాలకు పరిహారం అందింది. ఈ పథకం అమల్లోకి వచ్చాక జిల్లాలో 375 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఇందులో 350 కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మంది రైతుల కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి బీమా కింద రూ.5 లక్షల పరిహారం అందిస్తారు. ఇందుకు గాను అర్హత ఉన్న రైతులను ఇప్పటికే గుర్తించిన అధికారులు వారి వివరాలు, నామినీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అలా అర్హులుగా గుర్తించిన అన్నదాతల్లో ఎవరైనా అకాల మరణం పొందితే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం అందుతోంది. కుటుంబానికి అండగా నిలిచేలా... రైతు అకాల మరణం పొందితే ఆయన కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం గత ఆగస్టు 14వ తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులు. రైతు ప్రమాదవశాత్తు, అనారోగ్యంతోనో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా.. లేదా ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా వర్తించేలా జీవిత బీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించిన విషయం విదితమే. రైతు మరణించిన 24 గంటల్లోగా అధికారులు బీమా అందించే ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సూచించే నామినీ పేరిట బీమా పరిహారానికి సంబంధించిన చెక్కు మంజూరు చేస్తున్నారు. గతంతో పోలిస్తే భిన్నం గతంలో ఎవరైనా రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే రూ. 6 లక్షలు పరిహారం ఇచ్చే పథకం అమల్లో ఉంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన బాధిత రైతు కుటుంబాలు చాలా తక్కువ. చనిపోయిన రైతుకు ఎంత అప్పు ఉందో వాటిని రుజువు చేసుకోవాల్సి వచ్చేది. రైతులు పంటల సాగు కోసం చేసే ప్రైవేట్ అప్పులకు రుజువులు దొరికేవి కాదు. వడ్డీ వ్యాపారుల నుంచి సాక్ష్యాలు తీసుకురాలేక బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగలేక ఇబ్బందులు పడేవారు. రైతు బీమా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అందడంలో ఆటంకాలు తొలగిపోయాయి. ఏ కారణంతో మరణించినా రైతు కుటుంబానికి బీమా వర్తిస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము వస్తుండడంతో రైతుల కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 350 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మందికి త్వరలోనే పరిహారం అందుతుంది. ఆ ప్రక్రియ నడుస్తోంది. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఏఐసీసీ కార్యదర్శి వీ. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాక కోర్టు కేసులతో వేలాది నిరుద్యోలు వేచి చూడాల్సి వస్తుందని విమర్శించారు. ఈ ఉద్యోగ సమస్య చిలికి చిలికి గాలివానగా మారక ముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచిన పోస్టీంగ్ లేదు: మానవతారాయ్ ‘రెండు సంవత్సరాల క్రితం పీఈటీ పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు కూడా నిర్వహించి, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్లు కూడా అయిపోయాగా పోస్టీంగ్ నిలివేశారు. కోర్టు కేసులంటూ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీఘావిర్భావ దినోత్సవం అని సంబరాలు చేసుకుంటున్నారు కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలేదని విమర్శించారు. గురుకుల విద్య సంస్థల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల సంగతి నిర్లక్ష్యం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒక్క పీఈటీ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. నిరసన కూడా తెలపనీయకుండా అరెస్ట్ చేస్తున్నారు. పీఈటీ ఉద్యోగానికి సెలెక్ట్ కానీ అభ్యర్థులు కేసు వేస్తే ఉద్యోగ భర్తి ఆపుతున్నారు. రెండు సంవత్సరాలు అయినా పోస్టీంగ్ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం టీఎస్సీఎస్సీకి వస్తే అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జైలులోనే ఉండాలా? ప్రజలే బాస్ అంటున్న కేసీఆర్ ఎందుకు ప్రజలను పట్టించుకోవడం లేదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జైలులో పెట్టాల్సిన అవసరం ఏముంది. -సైదులు, భార్గవి, పీఈటీ అభ్యర్థులు -
తొలివిడత కేబినెట్.. ఆ అష్ట దిగ్గజాలెవరు?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన మంత్రివర్గ కూర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కేబినెట్లో ఎవరెవరికి బెర్తు లభిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరులో దాదాపు 8 మందితో తొలివిడత మంత్రివర్గం కొలువుదీరనుందన్న వార్తల నేపథ్యంలో సీనియర్లు, జూనియర్లలో ఎందరిని అదృష్టం వరిస్తుందనే ప్రశ్న రాజకీయ వేడిని పెంచుతోంది. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రులు ఎంత మంది ఎంపీలుగా పోటీ చేస్తారన్న అంశంపైనా టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ ఒకవేళ తొలి మంత్రివర్గ విస్తరణలో 8 మందికే అవకాశం కల్పిస్తే వారిలో రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, వెనుకబడిన తరగతుల నుంచి ఇద్దరికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చొప్పున అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. మరోవైపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా తొలి విస్తరణ సమయంలోనే భర్తీ చేయాలని సీఎం యోచిస్తుండటంతో 11 మందికి ఈ నెలాఖరున లేదా జనవరి మొదటి వారంలో కేబినెట్ పదవులు లభించనున్నాయి. రేసులో ఉన్నది ఎవరు...? తొలి విడత మంత్రివర్గ విస్తరణలో తాజా మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు కచ్చితంగా అవకాశం లభించనుంది. ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించగా పార్టీ బాధ్యతలు మోయడంతోపాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటేనే హామీల అమలు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కూడా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ సామాజికవర్గం నుంచి మరొకరికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అంటున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి మంత్రివర్గంలో తప్పనిసరిగా బెర్త్ దొరుకుతుందని పార్టీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికి తొలి మంత్రివర్గ విస్తరణలోనే స్థానం దక్కే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజా మాజీ మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, సీహెచ్ లక్ష్మారెడ్డిలకు మొదటి విస్తరణలో అవకాశం దక్కుతుందని అంచనా. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రెండో విడత విస్తరణలో అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ‘ఈ టర్మ్‌లో కచ్చితంగా గుత్తాకు అవకాశం లభిస్తుంది. అది తొలి విస్తరణలోనా లేక మలి విస్తరణా అనేది మాత్రం చెప్పలేం’అని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. మలి విస్తరణలో రెడ్డి సామాజికవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలలో ఇద్దరికి అవకాశం రావచ్చు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెనుకబడ్డ తరగతుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మున్నూరు కాపు వర్గానికి, దక్షిణ తెలంగాణ నుంచి యాదవ వర్గానికి చాన్స్ దక్కవచ్చు. ఈ కోటాలో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్‌కు చాన్స్ ఉంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా జోగు రామన్న లేదా బాజిరెడ్డి గోవర్ధన్‌కు మొదటి విడతలో అవకాశం రావచ్చంటున్నారు. ఈ విస్తరణలో అవకాశం లేకపోయినా మలివిడత విస్తరణలో వెనుకబడ్డ తరగతులకు చెందిన ఇతర వర్గాలకు అవకాశం ఇస్తే హైదరాబాద్ నుంచి పద్మారావుగౌడ్, వరంగల్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇక ఎస్సీ వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కోటాలో మలివిడత విస్తరణలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తోపాటు చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లేదా మానకొండూరు నుంచి రెండోసారి గెలిచిన రసమయి బాలకిషన్‌కు అవకాశం లభించవచ్చని అంటున్నారు. ఎస్టీ వర్గం నుంచి వరంగల్ జిల్లాకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేరు వినిపిస్తోంది. మంత్రివర్గంలో మహిళకు అవకాశం కల్పించాలని భావిస్తే ఖానాపూర్ నుంచి రెండోసారి గెలిచిన అజ్మీరా రేఖానాయక్ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి పోచారం లేదా పద్మా దేవేందర్‌రెడ్డి... ఈసారి శాసనసభాపతి స్థానానికి సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మాదేవేందర్‌రెడ్డిల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏ కారణాల వల్ల అయినా పోచారం, ఈటల పేర్లు స్పీకర్ పదవికి పరిశీలించకపోతే తొలి విస్తరణలో వారికి మంత్రులుగా అవకాశం దక్కుతుందని అంటున్నారు. ‘ప్రభుత్వంలో ఎవరు ఏ పాత్ర పోషించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవడమే నా ముందున్న లక్ష్యం’అని ఈటల తన సన్నిహితులతో పేర్కొన్నారు. పోచారం, ఈటలకు మంత్రివర్గంలో స్థానం దొరికితే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి స్పీకర్‌గా పదోన్నతి లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్పీకర్‌గా మహిళకు అవకాశం ఇస్తే మంత్రివర్గంలో మహిళలు లేకపోయినా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్‌గా కొప్పుల ఈశ్వర్, దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది టీఆర్ఎస్ తరఫున గెలవడంతో వారిలో కొందరికి ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్చించవచ్చంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత మలివిడత మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఫుల్ జోష్‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏప్రిల్ నుంచి 57 ఏళ్ల వయస్సు నిండిన పేదలకు వృద్ధాప్య పింఛన్ల పం పిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిం చారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఆయన పంచా యతీరాజ్ అంశాలతో పాటు ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే పల్లెలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియ మించాలన్నారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలన్నారు. 9,355 మంది కార్యదర్శుల నియామకం.. రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామకానికి సంబంధించి కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని అన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019–20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పింఛన్లు అందివ్వాలని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం.. అలాగే ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి, భాన్సువాడ నియోజకవర్గం పరిధిలో చండూరు, మోస్ర, మహబూబాబాద్ పరిధిలో ఇనుమర్తి, సిద్ధిపేట పరిధిలో నారాయణపేట మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు. 19 నుంచి బతుకమ్మ చీరలు.. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుతో ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు... కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు.. కొత్తగా నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యదర్శులతో కలసి మొత్తం 12,751 వేల మంది కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇవోపీఆర్డీలు, డీపీఓలు, డీఎల్పీఓలతో ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. మధ్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
మినీ కేబినెట్.. నెలాఖరుకే!
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈసారి తనదైన శైలిలో ముందుకెళ్లనున్నారు. మంత్రివర్గ కూర్పు, విస్తరణ, ముఖ్య శాఖలకు అధికారుల ఎం పిక, అభివృద్ధి పనుల పురోగతి లాంటి అంశాల్లో కచ్చితత్వంతో ఉండాలని, మొహమాటాలకు పోకుండా నిబద్ధత, పనితీరు ఆధారంగానే నిర్ణ యాలు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. అం దులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని ఆచితూచి చేపట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్... ఈ నెలాఖరు నాటికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 6 నుంచి 8 మందికే మంత్రులుగా అవకాశం కల్పిస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో కేబినెట్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖర్లో అసెంబ్లీ తొలి సెషన్ ఏర్పాటు చేసి అప్పుడే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని, అంతకు ముందు తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అలాగే కీలక శాఖలకు అధికారుల నియామకాన్ని కూడా ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే ముఖ్యమైన శాఖలకు పాలనాదక్షత ఉన్న అధికారులే ఉండాలనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. ఈలోగా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టడం, మిషన్ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. కేబినెట్‌కు తొందరేం లేదు... మంత్రివర్గ విస్తరణకు తొందరేం లేదనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులను, భవిష్యత్తులో చేయాల్సిన పనులను ముఖ్యమంత్రి బేరీజు వేస్తున్నారు. దీనికితోడు రాజకీయంగా జరిగే పరిణమాలను కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకుతోడు పార్టీలో చేరిన ఇద్దరు స్వతంత్రులు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే మొత్తం 97 మంది శాసనసభ్యులు అధికారపక్షం వైపే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది సభ్యులు తమతో కలవడానికి ఇప్పటికే రాయబారాలు పంపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా కనీసం 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. సీఎం అభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అది కూడా తొలి విడతలో 6 నుంచి 8 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవచ్చని సమాచారం. పనితీరే ప్రాతిపదిక... ఈసారి మంత్రివర్గ ఏర్పాటును ముఖ్యమంత్రి ఆషామాషీగా తీసుకోవట్లేదని, వివిధ రకాల సమీకరణాల మేరకు కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన జరిగేలా మంత్రులను నియమించాలనే భావనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. వ్యక్తుల కోసం కాకుండా పని కోసం మంత్రులను నియమించాలని, నూటికి నూరు శాతం విధేయులనే ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ధృడ నిర్ణయం తీసుకున్నారని సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, ఆవశ్యకతల జోలికి పోకుండా, మొహమాటాలకు తావు లేకుండా కేవలం పనితీరు ప్రాతిపదికగానే మంత్రివర్గ సహచరులను నియమించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభం... ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రమాణం చేసిన తర్వాతే ఎమ్మెల్యే అయినట్లనే విశ్లేషణలు సరైనవి కావని, గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభమైనట్లేనని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఒక సభ్యుడిగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడానికి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. గతంలోనూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలున్నాయి. 2014లో ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగి మే 16న ఫలితాలు వెలువడితే జూన్ 9న అంటే 23 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అది మరింత ఆలస్యమయింది. గతంలో కూడా అనేకసార్లు ఎమ్మెల్యేల ప్రమాణం రోజుల తరబడి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అంత తొందర పడాల్సిన అవసరం లేదనే భావనలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ప్రస్తుత హడావుడి ముగిశాక ఈ నెలాఖరు నాటికి అసెంబ్లీని సమావేశపరచి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలూ అప్పుడే నిర్వహించాలని కేసీఆర్నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పెండింగ్ కార్యక్రమాలపై దృష్టి... మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కార్యక్రమాలు నిర్వహించేలోగా గత మూడు నెలలుగా అవాంతరం కలిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ గాడినపెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా సమీక్షలు ప్రారంభించిన ఆయన... మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. వీటన్నింటితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలాగే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తుండటంతో ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. ఈ హడావుడి ముగిశాక నెలాఖరులో అసెంబ్లీ తొలి సెషన్ నిర్వహించాలని, అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. -
పరాజయ సంకేతాలు ఎవరివి?
తెలంగాణలో కేసీఆర్ రాజకీయ ప్రచారాన్ని, సంక్షేమాన్ని పునర్నిర్వచించారు. తన ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు తలొక 21 గొర్రెలు అందించారు. రజకులకు వాషింగ్ మెషిన్లు అందించారు. మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. రైతుబంధు పథకం గురించి చెప్పాల్సిన పనిలేదు. కొందరు మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. దేశంలో పలు ఎన్నికల అనుభవాలను గమనిస్తే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు. తెలంగాణలో, దాని రాజధాని హైదరాబాద్‌లో (భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో దానిసొంతం) గోడలపై రాతలను మీరు చదివినట్లయితే వాటిపై ఉన్న రంగును మీరు చూడండి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రాన్ని గులాబీమయం చేసిపడేశారు. దీన్ని చూస్తే ఈ ఎన్నికల్లో ఒక పార్టీ మాత్రమే పోరాడుతున్నట్లుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నికలను నేను పరిశీలిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ తన కనుచూపు మేరలో ఇంత ఆధిపత్యం చలాయించడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. గుజరాత్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవకాశాలు 20:1గా ఉండగా, తెలంగాణలో కేసీఆర్‌కి 90:1 అవకాశం ఉంటోంది. అయినా మనం ఇప్పటికీ ద్వైదీభావంతోనే ఉంటున్నాం. నా విండో నుంచి కిందికి చూస్తుంటే ఏడు భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. అవన్నీ కేసీఆర్, టీఆర్ఎస్కి సంబంధించినవే. అన్నీ గులాబీ రంగులో అంటే ఆయన పార్టీ రంగులో ఉన్నాయి. ఇలాంటి హోర్డింగులు రాష్ట్ర రాజధానిలో 698 ఉన్నాయని నా నమ్మకం. ఆయన ప్రత్యర్థులవి కూడా ఉండవచ్చు కానీ వాటిని నేను ఇంకా చూడలేదు. ప్రభుత్వం పట్ల అనుకూలత కారణంగా ఆయన తన ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి లేక బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇది ఎంత అరుదైన ఎన్నికల ప్రచారం అంటే, కేసీఆర్ గత పనితీరుపైనే పోరాటం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ఇప్పుడు కొత్త వాగ్దానాలు ఏవీ చేయడం లేదు. కానీ గోడలపై, హోర్డింగులపై పింక్ రంగుతో తన గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఉచితాలు, ప్రజాసంక్షేమ చర్యలపై తాను చేసిన పనుల గురించి తెలిపే వివరాలు వీటిలో కనిపిస్తూ రాత్రిపూట చాలా చక్కగా వెలుగుతుంటాయి. ఆయన ప్రత్యర్థులకు ఇవన్నీ పంపే సందేశం ఏమిటి? ‘మీకు సాధ్యమైతే నాతో పోటీ పడండి’. కేసీఆర్ ఆత్మవిశ్వాసం వివియన్ రిచర్డ్స్ మైదానంలో భీకరంగా విరుచుకుపడే శైలిని తలపిస్తుంది. ఆయన స్కీములన్నీ అనుకూలమేనా? తన లోటు బడ్జెట్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందా? ‘బక్వాస్, సబ్ బక్వాస్’ (చెత్త, అంతా చెత్తే) అనేది కేసీఆర్ లఘు సమాధానం. లోటేమిటి? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక లోటు ఉన్న దేశం ఏది? అమెరికాయేనా? తర్వాత జపాన్. మరి చైనా విషయమేంటి? ప్రజలు ఏమీ తెలీకున్నా వాగుతుంటారు..’ ప్రొఫెసర్ కేసీఆర్ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. ‘ఉచిత’ రాజకీయాలకు తమిళనాడులో ప్రత్యేకించి జయలలిత సుప్రసిద్ధం. కేసీఆర్ దాన్ని మరొక స్థాయికి తీసుకుపోయారు. ఇది పనిచేస్తుందా అనేది ఈ ఎన్నికలు తేల్చిపడేస్తాయి. అయితే ఇలా ఉచితాల అప్పగింతలపై నా అనుమానాలు నా పాఠకులకు సుబోధకమే. బార్మర్‌లోని కెయిర్న్ చమురుక్షేత్రం నుంచి వచ్చిన రాయల్టీల కారణంగా వచ్చిన భారీ మొత్తాన్ని కైవసం చేసుకున్న రాజ స్థాన్ ప్రభుత్వం 2008–13 సంవత్సరాల్లో ఇలాంటి ఉచిత వస్తువుల సరఫరా విషయంలో దేశానికే ప్రయోగశాలగా మారింది. కానీ ఆ రాష్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై ప్రజల తీవ్ర వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ 163–21 తేడాతో శాసససభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. జయలలిత రెండో దఫా కూడా ముఖ్యమంత్రి కాగానే (తమిళనాడులో ఇది అరుదైన ఘటన) నిరుపేదలు పండుగ చేసుకున్నారు. దాంతో ఆమె పరపతి అమాంతం పెరిగిపోయింది. ఆమె ప్రజలకు ఉచిత మిక్సర్ గ్రైండర్స్ వంటి వాటిని అందించారు. నిజానికి రెండో దఫా ఎన్నికల్లో ఆమెపై ప్రజా విశ్వాసం 13 శాతం మేరకు పడిపోయింది. ప్రతిపక్షాలు చీలకుండా కలిసి పోటీ చేసి ఉంటే ఆ ఎన్నికల్లో ఆమెకు పరాజయం తప్పేది కాదు. అందుకే ఉచిత వస్తువుల పంపకం పక్కాగా ఓట్లను సాధించిపెడుతుందనేది నేటికీ రుజువుకాని సత్యమే. కానీ కేసీఆర్ విషయంలో అలా చెప్పలేం. రెండు అంశాల్లో తనను చూసి గర్వించాలి. పంపకంలో అతడి రికార్డు, ఊహాశక్తి. ఆయన రాష్ట్రంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాదనా పటిమను మీరు చూస్తారు. షాదీ ముబారక్ పేరిట మహిళలకు వివాహ సందర్భంగా లక్ష రూపాయల బహుమతిని అందించారు. ఇతరులకు కల్యాణ లక్ష్మినీ ప్రసాదించారు. ఇక ఆయన ప్రకటించిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకం సంచలనాత్మకమైంది. తన తొలి దఫా పాలనలో ఆయన 5 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రచారంలో ఇది అత్యంత ముఖ్యమైనది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరులో నిర్మించనున్న 11 అంతస్తుల టవర్ ఆయన ఘనకార్యాల్లో ఒకటి కాగా, రెండోది తన నియోజకవర్గమైన గజ్వేల్‌లో హైవే రూపకల్పన చేయడం. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయం ఏమిటని అడిగాను. అది చెత్త పథకం అంటూ కొట్టిపడేశారు. సింగిల్ రూమ్‌లో అయినా సరే మహిళలు బట్టలు మార్చుకునే అవకాశం మోదీ ఇచ్చారా అంటూ నిలదీశారు. అయితే రూ. 7.5 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం పథకాన్ని కేసీఆర్ అమలు చేయగలరా? అయితే కేసీఆర్ చేపట్టిన కొన్ని సృజనాత్మక ఆవిష్కరణలను పరిగణిద్దాం. ప్రభుత్వ భూములను పంచారు, సిమెం టుపై పన్నును రద్దుచేశారు. ఉచిత ఇసుకను అందించారు, థెర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుండి సబ్సిడీతో కూడిన ఫ్లై యాష్‌తో ఇటుకలు ఉపయోగించడం అభివృద్ధి చేశారు. గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ. 1.5 లక్షలను రాబట్టి 7.5 లక్షల వ్యయానికి పెంచారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ముంబైలోని మురికివాడల స్థానంలో నిర్మించిన పునరావాస కాలనీల కంటే ఈ డబుల్ బెడ్ రూమ్ పథకం ఎంతో మెరుగ్గా ఉంటోంది. ఇంకా ప్రభుత్వ ఉచిత ఆసుపత్రులు కట్టించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ప్రతి తల్లికీ, ఆమె బిడ్డతో పాటు బట్టలు, టాయెలెట్ సంబంధిత ఉత్పత్తులను గత మూడు నెలలుగా కేసీఆర్ కిట్ రూపంలో అందిస్తున్నారు. కరీంనగర్ ఆసుపత్రిలో తల్లులు, వారి కుటుంబాలతో మాట్లాడుతూ మే ఇదంతా చూశాం. నిజంగానే వారు కేసీఆర్‌కి కృతజ్ఞత చూపుతున్నారు. ఇక రైతు బంధు పథకాన్ని ఎవరైనా చాలా నిశితంగా, దురుద్దేశాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ రంగ దుస్థితి జాతీయ వైపరీత్యం. పైగా కనీస మద్దతు ధరలకోసం ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తూ వస్తున్న పలు ఇన్పుట్ సబ్సిడీలు విఫలమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండు దఫాలుగా ఒక ఎకరాకు రూ.8 వేలను నేరుగా రైతుకు అదజేస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.12,000 కోట్లను వెచ్చించింది. అయితే భూమి సైజుతో పనిలేకుండా ఈ విధానం అమలు చేయడం వల్ల వందఎకరాల భూమి ఉండి వ్యవసాయం చేయని ఆబ్సెంటీ భూస్వాములకు కూడా ఈ పథకం కింద డబ్బులివ్వడం విమర్శలకు దారితీసింది. కానీ ఈ విషయంలో వస్తున్న డేటా మరో కథను చెబుతోంది. 58.3 లక్షలమంది లబ్దిదారులు ఉండగా 14,900 మంది మాత్రమే 50 ఎకరాలు లేక అంతకుమించి కలిగివున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేవలం 1.15 లక్షల మంది అంటే మొత్త లబ్ధిదారుల్లో 2 శాతం మంది మాత్రమే 10 ఎకరాలకు మించి భూమిని కలిగి ఉన్నారు. అంటే ఈ పథకంలో ఎక్కువ మందికి మేలు జరుగుతున్నట్లే కదా. ఇలా అంటున్నందుకు కేసీఆర్ ముద్దుగా తిట్టే ‘బక్వాస్’ నన్ను క్షమించాలి. కేసీఆర్ ఆర్థికశాస్త్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందుతూ ఉంటుంది. గొర్రెల పెంపకం దార్లకు 21 గొర్రెలు అందించారు. చాకలివారికి వాషింగ్ మెషిన్లు అందించారు. మత్స్య కారులకు చేపపిల్లలను సరఫరా చేశారు. అయితే కంచ ఐలయ్య వంటి మేధావులు చెబుతున్నట్లుగా ఇవి పూర్తిగా ఓట్ల కొనుగోలు పథకాలే. కానీ ప్రతి ఒక్కరూ ఉచిత పస్తువును ప్రేమిస్తున్నారు. మరి వీటికోసం మాత్రమే వారు ఓటేస్తారా అన్నదే ప్రశ్న. దీనికి రుజువు మిశ్రమ స్వభావంతో ఉంది. కానీ ప్రధానంగా ఇలాంటివి వ్యతిరేక స్వభావంతో ఉంటాయి. ఉదాహరణకు ప్రజలకు తాయిలాలను భారీగా అందించిన రాజ స్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో కుప్పగూలిపోయింది. ఇక రాయితీ రాజకీయాలకు మారుపేరైన తమిళనాడులో రెండో దఫా అదే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం అరుదైన ఘటన. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌తోపాటు గోధుమ పిండి, తృణధాన్యాలను ఉచి తంగా అందించినప్పటికీ అక్కడి అకాలీ–బీజేపీ మిశ్రమ ప్రభుత్వం ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ముఖ్యమంత్రులను రెండోదఫా ఎన్నుకున్న గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రభుత్వాలు ఇలా ఉచితాలు, రాయితీల విషయంలో ఛాంపియన్లు కావు. జయలలిత లాగా సబ్సిడీలకు తెరతీసినప్పటికీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీని పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయారు. ఒకటి మాత్రం నిజం. ఓటర్లు తెలివైనవారు. ఉచితంగా తమకు ఒకసారి ఏదైనా అందిస్తే వాటిని ఎన్నటికీ వెనక్కు తీసుకోలేరని వారికి తెలుసు. 2014 ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ పథకంపై మొరటు వ్యాఖ్యానాలు చేసిన మోదీ తాను గెలిచాక ఆ పథకంలోకి మరిన్ని నిధులను గుమ్మరించిన విషయం మర్చిపోరాదు. పైగా బీజేపీ ఇప్పుడు ఉచి తంగా ఆవులను ఇచ్చే పని పెట్టుకుంది. ప్రజలకు రాయతీలు కల్పించ డంకంటే ప్రజల అస్తిత్వం, రాష్ట్రాలమధ్య వైరుధ్యాలు, మతం, జాతీ యత, ఉపజాతీయతావాదం వంటి సమస్యల పరిష్కారం ఇపుడు చాలా అవసరం. అందుకే ఈ దఫా ఎన్నికల్లో రాయితీలు మాత్రమే కేసీఆర్‌కి గెలుపు తీసుకురాకపోవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం అనే భావనను కూడా ఈ ఎన్నికల్లో ఆయన పదే పదే వాడుతుండటం గమనార్హం. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మార్కెట్ మాయ...
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను సైతం విభజించింది. ప్రతి జిల్లాకు ఒక మార్కెటింగ్ శాఖ మేనేజర్‌ను నియమిస్తూ జీఓ జారీ చేసింది. అయితే రెండేళ్లకే తిరిగి ‘యూటర్న్’ తీసుకుంది. తాజాగా జీఓ నం.746ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్ జిల్లా స్థాయి కార్యాలయాలను మళ్లీ విలీనం చేయనుంది. జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి మేనేజర్లను కూడా నియమించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోవడంతో కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా మార్కెటింగ్ కార్యాలయం ఏర్పాటైంది. అయితే అందులో డీఎంఓతోపాటు మరొక అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖాధికారులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి, తిరిగి యూటర్న్ తీసుకుని పాత పద్ధతిలోనే హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కో–ఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే జీఓ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతానికి మాత్రంకొత్తగూడెం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జీఓ మినహా మరెలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జె.నరేందర్ నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో డీడీ స్థాయి అధికారిని, విభజన జిల్లాల్లో ఏడీ స్థాయి అధికారులను గతంలో వలె నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా అయిన ఖమ్మంలో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ కార్యాలయం విలీనమై ఖమ్మం కేంద్రంగానే రెండు జిల్లాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే కొత్తగూడెం మార్కెట్ యార్డు సెక్రటరీనే విభజన జిల్లాల నిర్వహణను చూస్తారు. దీని ప్రకారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మార్కెట్ యార్డులో ఉండే సెక్రటరీ జిల్లాలోని కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీడీ స్థాయిలో ఉండే ఆర్.సంతోష్ కుమార్ ఉమ్మడి జిల్లా డీఎంఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఓ నిజమే.. కానీ ఇంకా అమలుకాలేదు ఉమ్మడి జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖలను విలీనం చేస్తున్నమాట వాస్తవమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇంకా అమలు కావడం లేదని భావిస్తున్నాం. భవిష్యత్తులో రెండు జిల్లాల కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే జరుగుతాయి. – జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి -
‘టీఆర్ఎస్ పాలనలో వారికి రక్షణ కరువైంది’
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో అర్చకుడిపై జరిగిన దాడి టీఆర్ఎస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రహ్లాద్ శనివారం మీడియాతో మాట్లాడారు. అర్చకుడి మృతికి కారణమైన హంతకున్ని శిక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అర్చకుడి మృతి కేసులో నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మేకిన్ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్ అమలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె చొప్పదండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శోభ ప్రచారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
నష్టాలతో నడుస్తున్న టీఎస్ ఆర్టీసీ
-
హామీలను టీఆర్ఎస్ విస్మరించింది
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టి, లేనిపోని హామీలను ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన విస్మరించి స్వలాభం, కమీషన్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ అన్నారు. మంగళవారం బోధన్ మండలంలోని నాగన్‌పల్లి, కొప్పర్తి, జాడిజమాల్ పూర్, చిన్నమావంది, సాలూర క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి గ్రామాల్లో మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 100రోజులో ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇచ్చిన హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. ఫ్యాక్టరీ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని, పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించి బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందించడంతో పాటు వడ్డీ లేకుండా రూ.10లక్షలు రుణం అందిస్తామన్నారు. ప్రతి మహిళ సంఘం సభ్యులకు రూ.5లక్షల ప్ర మాద బీమా కూడ కల్పిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు.. పేదల సొతింటి కలను సహకారం చేసేందుకు కొ త్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఆర్థికసా యం అందిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలు అయితే రూ.6లక్షలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అమలు చేసే హామీలే చెపుతున్నాం.. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లాగా తమ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇవ్వదని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందిపాల్జేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మాజీ ము న్సిపాల్ చైర్మన్ గౌసుద్దీన్, నాయకులు గణపతి రెడ్డి, వీరభద్ర రావ్, ఖలీల్ తదితరులున్నారు. -
కలగా మారిన కంటి వెలుగు
ఎల్లారెడ్డిరూరల్: కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆపరేషన్లు నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయమై స్పష్టత కూడా లేదు. దీంతో ఆపరేషన్లు అవసరమైనవారు నిరాశ చెందుతున్నారు. ఆగస్టు 15వ తేదీన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం జిల్లాలో కంటి వెలుగు అమలు కోసం 22 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక సాధారణ వైద్యుడు, ఒక ఆప్తాల్మిక్ వైద్యు డు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 253 గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా లక్షా 92 వేల 892 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దగ్గరి చూపు లోపంతో బాధపడుతున్న 34,699 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. దూరపు చూపు లోపంతో ఉన్న 23,798 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. 17,370 మంది మోతి బిందుతో బాధపడుతున్నారని గుర్తించిన వైద్యులు.. కంటి ఆపరేషన్ల కోసం సిఫారసు చేశారు. ప్రారంభం కాని ఆపరేషన్లు.. జిల్లాలో కంటి వెలుగు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్లు నిర్వహించలేదు. జిల్లాలో 17,370 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా ఒక్కరికి కూడా నిర్వహించకపోవడంపై కంటి చూపుతో బాదపడుతున్న వారు ఆవేదన చెందుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి రెండున్నర నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కంటి ఆపరేషన్లు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్లలో జాప్యం జరుగుతుండడంపై నిరాశ చెందుతున్నారు. వెంటనే శస్త్రచికిత్సల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. ఆపరేషన్లు ప్రారంభం కాలేదు.. జిల్లాలో కంటి వెలుగు కొనసాగుతోంది. ఇప్పటివరకు మోతిబిందు కారణంతో కంటి చూపుతో బాధపడుతున్న వారిని 17,370 మందిని గుర్తించాం. అయితే కంటి వెలుగు పథకం కింద ఇప్పటివరకు ఆపరేషన్లు ప్రారంభించలేదు. నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తరువాత కంటి వెలుగులో ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి -
తెలంగాణలోనే చిన్నచూపు ..
ట్రాన్స్‌జెండర్స్.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. తెలంగాణలో ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతరులు.. వారి డిమాండ్లపై ప్రత్యేక కథనం.. రామగుండం: ట్రాన్స్‌జెండర్స్.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సంక్షేమంపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఇతరులకు ప్రతీ నెల రూ.1,500 పింఛన్ ఇవ్వడంతోపాటు, విద్య, ఉద్యోగావకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అయితే తెలంగాణలోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీస్తామంటున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. సుప్రీం తీర్పు అనంతరం నాలుగేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్స్–హిజ్రాలు తమ ఓటరు నమోదుకు కొందరు పురుషులు, మరికొందరు స్త్రీల జాబితాలో పేర్తు నమోదు చేసుకునే వారు. అయితే 2014లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అన్నిరంగాల్లోని ట్రాన్స్‌జెండర్స్–హిజ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ట్రాన్స్‌జెండర్స్‌కు మూడో వరుస ఏర్పాటు చేసి ఇతరులుగా పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 2,667 మంది నూతనంగా నమోదు చేసుకోగా ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో 153 మంది ఓటరుగా నమోదు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు 1.20 లక్షల మంది ఉన్నట్లు హిజ్రాల రాష్ట్ర ప్రతినిధి లైలా తెలిపారు. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని గోర ఖ్పూర్లలో కార్పొరేషన్ మేయర్లుగా కొనసాగగా, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల వారీగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలుండగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో 36 మంది, రామగుండంలో 29, చొప్పదండిలో ఇద్దరు, హుజూరాబాద్‌లో 17, వేములవాడలో 3, జగిత్యాలలో 15, కోరుట్లలో 6, ధర్మపురిలో 3, మం థనిలో 21, పెద్దపల్లిలో 21 మంది హిజ్రాలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మానకొండూ ర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు. కొన్ని రాష్ట్రాల్లోనే గుర్తింపు సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు. ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో హిజ్రాలకు రూ.1,500 పింఛన్ ఇస్తున్నారు. వీరి సం క్షేమానికి రాష్ట్ర బడ్జె ట్లో రూ.20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాయి. విద్యావకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వా రి కోసం ప్రత్యేక సంక్షేమ రెసిడెన్షియ ల్ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్ల లో ప్రత్యేక టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యం అవహేళనలే.. మాపై ఇంటితోపాటు సమాజంలోనూ ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఏదోలా చూస్తుంటారు. మా పక్కనే ఉంటూ అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. నిత్యం వింటూ ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా పనికి వెళ్లిన అక్కడ మాపై ఇతరులకు వేరే భావాలు ఉంటాయి. మా క మ్యూనిటీ ని ప్రభుత్వం గుర్తించి విద్య, ఉపా ధి అవకాశా లు కల్పించాలి. – అర్చన, రాష్ట్ర కమిటీ ప్రతినిధి ఇక్కడే భిన్న నిర్ణయాలు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మా కమ్యూనిటీపై ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అవకాశం ఇస్తున్నారు. కానీ తెలంగాణలోనే చిన్నచూపు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలోనే గుర్తింపు లేదు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో భారీ సమావేశం సైతం ఏర్పాటు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. – ప్రగతి, బెల్లంపల్లి గుర్తింపు లేదు మన రాష్ట్రంలో హిజ్రాలకు గుర్తింపు లేదు. పోస్ట్రుగాడ్యుయేట్ ఎంఏ సోషియాలజీ చదివాను. వరంగల్ ఎమ్మెల్యే కొండ సురేఖ గత అసెంబ్లీ సమావేశాల్లో హిజ్రాల సంక్షేమంపై మాట్లాడిని ప్రభుత్వం స్పందించలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తారు.. కానీ మా గురించి పట్టించుకోరు. ఒక సీటు కేటాయించి హిజ్రాలపై మానవత దృక్పథంతో వ్యవహరించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. మేనిఫెస్టోలో ట్రాన్స్‌జెండర్స్ అంశాన్ని చేర్చాలి. ఒక ఎమ్మెల్యే సీటును కేటాయించాలి. – లైలా, అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ – హిజ్రా అసోసియేషన్ -
‘కంటి వెలుగు’ ఉచిత పథకం
కౌడిపల్లి(నర్సాపూర్) : కంటి వెలుగు వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎవరి ఎక్కడ డబ్బులు చెల్లించవద్దని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావ్ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు వైద్యశిబిరాన్ని తనిఖీ నిర్వహించారు. రోగులకు వైద్యసేవలను గురించి అడిగితెలుసుకున్నారు. వైద్యచికిత్సలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 బృందాలు కంటి వెలుగు వైద్యశిబిరంలో చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 354 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మరో 750 మందికి వివిధ రకాల కంటి అద్దాలు అవసరంగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి మూడు వారాలలో కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. 90 మందికి కంటి శుక్లాలు ఇతర ఆపరేషన్లు అవసరంగా గుర్తించామన్నారు. వీరికి 114 కార్పోరేట్ ఆసుపత్రులలో వారి కోరిక మేరకు ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డబ్బులడిగితే ఫిర్యాదు చేయాలి.. గ్రామంలో కొనసాగిని వైద్యశిబిరం పూర్తయిన తరువాత ఆపరేషన్లు అవరంగా గుర్తించిన వారిని వైద్యుల సహాయంతో వాహనంలో పంపించి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఎక్కడ ఎవరకి ఒక్కరూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలుకు కంటి వెలుగు పథకంద్వార పూర్తిగా ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తుందని తెలిపారు. వర్షం కారణంగా కొంత నెమ్మదిగా కొనసాగుతుందన్నారు. రోజుకు 250 మందికి వైద్యం చేయాల్సి ఉండగా కొంత తక్కువగా ఉందన్నారు. ప్రజలు సహకరించి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ శోభన సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్: ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఆయన నర్సాపూర్‌లోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన çప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కంటి పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ నిర్మల, డీఐఓ డాక్టర్ నవీన్ తదితరులు ఉన్నారు. నర్సాపూర్ కేంద్రంలో చేపడుతున్న పరీక్షల వివరాలను డాక్టర్ పావని ఆయనకు వివరించారు. కొల్చారంలో.. కొల్చారం(నర్సాపూర్): కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వం ద్వారా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం తుమ్మలపల్లిలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. దేశంలో ఎక్కువగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడటం మారిన ఆహార అలవాట్లు కొంత వరకు కారణమన్నారు. చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న కంటి వెలుగు పథకం ద్వారా గ్రామీణస్థాయిలో వైద్య శిబిరాలలను ఏర్పాటు చేయడం, ఉచితంగా కళ్లద్దాలు అందించడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వైద్యాధికారి రమేష్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు. -
యాదాద్రి ఉదంతం : కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: నేరాలను అదుపులోకి తెచ్చాం, ప్రజలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే గొప్పగా పనిచేస్తోందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంటున్న బాలికల అక్రమ రవాణాపై స్పందించాలని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టలో ఇలాంటి అసాంఘిక , అమానవీయ వ్యభిచార ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి చిన్నపిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపడం క్షమించరాని నేరమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే కిడ్నాప్, అపహరణ కేసులను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,283 మంది చిన్నారులు కనిపించకుండా పోయారనీ, ఇంకా 912 చిన్నారుల ఆచూకీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమాధానమేదీ..? ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని 2017లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రైతులకు నీరివ్వకపోతే పాపం చేసినట్టేనని వ్యాఖ్యానించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మరి పంటలకు సాగునీరు లేక రోడ్డెక్కిన రైతన్నలకు కేసీఆర్ నేడు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసమే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. -
కార్మికులను బెదిరించడం దుర్మార్గం
గద్వాల అర్బన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయకపోగా, సమస్యల కోసం పోరాడుతున్న కార్మికులు తెల్లారేసరికి సమ్మె విరమించకపోతే ఉద్యోగాలుపోతాయని స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే డీకే.అరుణ విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే డీకే.అరుణ మద్దతు ప్రకటించి కార్మికులనుద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇచ్చినమాట ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చి కార్మికులను పర్మినెంట్ చేసే వరకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డంకృష్ణారెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు, రఫీ, మాసుం, అనంతరెడ్డి పాల్గొన్నారు. -
‘బతుకమ్మ’తో భరోసా
సిరిసిల్ల : మరమగ్గాల (పవర్‌లూమ్స్) మధ్య వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు బొమ్మెన నాగరాజు (41). సిరిసిల్లలోని శివనగర్‌లో సాంచాలపై బతుకమ్మ చీరలను నేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు సాంచాల మధ్య నిలబడి వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. నాగరాజుకు వారానికి రూ.4 వేల కూలి వస్తుంది. అంటే నెలకు రూ.16 వేలు వస్తున్నాయి. ఇదే పనికి గతంలో నెలకు రూ.8 వేలకు మించి కూలి రాకపోయేది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్మికులకు చేయూతనందించటం కోసం ప్రభుత్వం ఈ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. దీంతో ఒక్క నాగరాజుకే కాదు.. స్థానికంగా ఉన్న పదివేల మంది నేత కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కూలి రెట్టింపు అయింది. ప్రస్తుతం ఇక్కడ నిత్యం 1.07 లక్షల చీరలను తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో చీరలు.. సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తిచేసినా.. గడువులోగా పూర్తి స్థాయిలో చీరల వస్త్రం అందలేదు. 45 లక్షల చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయగా, మరో 55 లక్షల చీరలను సూరత్ నుంచి టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో నాసిరకం చీరలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ.. మొత్తం ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు అందించారు. దీంతో జరీ అంచుతో కూడిన నాణ్యమైన చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నారు. 20 వేల పవర్‌లూమ్స్‌పై చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 14 వేల మగ్గాలపై ఉత్పత్తి సాగుతోంది. మరో 6 వేల సాంచాలపై బతుకమ్మ చీరల బీములను ఎక్కించేందుకు జౌళిశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తే, గడువులోగా 90 లక్షల చీరలను ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఉంది. కార్మికుల ఉపాధే లక్ష్యం.. సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికుల ఉపాధి లక్ష్యంగా బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులైన ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరను సారెగా ఇవ్వడం.. ఇటు సిరిసిల్ల నేతన్నలకు బతుకుదెరువు చూపడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో చీరల వస్త్రం ఉత్పత్తికి ప్రతీ మీటరుకు రూ.32 ఇస్తుండగా.. ఆసామికి మీటరు వస్త్రం ఉత్పత్తి చేస్తే రూ.8.50, కార్మికుడికి రూ.4.25 చొప్పున ముందే కూలి ధరలను నిర్ధారించారు. వార్పిన్ కార్మికుడికి ఒక్కో బీముకు రూ.430, వైపని కార్మికుడికి ఒక్కో బీముకు రూ.375 కూలి రేట్లను నిర్ణయించడంతో గతంతో పోలిస్తే రెండింతల కూలి కార్మికులకు గిట్టుబాటు అవుతోంది. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో ఈ పథకంవల్ల అన్నిరంగాలకు చెందిన పదివేలమంది కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే తమకు మంచి ఉపాధి లభిస్తోందని కార్మికులు అంటున్నారు. చీరల ఉత్పత్తిపై నిఘా.. ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఎవరైనా వస్త్ర వ్యాపారులు సూరత్, భివండి, షోలాపూర్, ముంబై వంటి ప్రాంతాల నుంచి చీరల బట్టను దిగుమతి చేస్తారనే అనుమానంతో అధికారులు బతుకమ్మ చీరల ఉత్పత్తిపై నిఘా ఉంచారు. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ నుంచి సిరిసిల్లలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జౌళిశాఖకు చెందిన ఏడు బృందాలతో వార్పిన్ యూనిట్లపై నిఘా ఉంచారు. ట్యాబ్‌లలో చీరల ఉత్పత్తి వివరాలను నమోదు చేస్తున్నారు. 20 మంది సాంకేతిక సిబ్బంది చీరల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఉత్పత్తి అయిన చీరల బట్టను ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. గోదాములో నిల్వ చేస్తున్నారు. రేయింబవళ్లు సాంచాలు ఆగకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. శ్రమ అధికమైనా మెరుగైన వేతనాలు రావడంతో కార్మికులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నేడు చైతన్య ర్యాలీ.. 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను నేయాలని కోరుతూ సోమవారం కార్మికులు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నారు. బీవై నగర్‌లోని నేతబజారు నుంచి వస్త్రోత్పత్తిదారులతో బైక్ ర్యాలీని నిర్వహిం చనున్నారు. ‘బతుకమ్మ’తో బతుకుదెరువు ఉందని చాటిచెప్పేందుకు పట్టణాల్లో ఈ ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ అధికారులకు సూచించారు. రోజుకు రూ.వెయ్యి వస్తున్నాయి.. బతుకమ్మ చీరల బీములు నింపితే రోజుకు రూ.వెయ్యి కూలీ లభిస్తుంది. గతంలో రూ.500 వచ్చేవి. రోజూ రెండు, మూడు బీములు నింపుతున్నా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. నా భార్య నవ్య బీడీ కార్మికురాలు. సిరిసిల్లలో కిరాయి ఇంట్లో ఉండి పని చేస్తున్నా. గతంలో భివండిలో పని చేశాను. అక్కడి కంటే సిరిసిల్లలోనే మంచి జీతం వస్తోంది. నా కంటే ఎక్కువ కూలీ సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. – మెండు శ్రీనివాస్, వార్పర్ చెల్లింపులకు ఇబ్బంది లేదు.. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న వారికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేదు. ఆర్డర్ ప్రకారం వస్త్రొత్పత్తిదారులకు చెల్లింపులను ఆన్లైన్లోద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. గడువులోగా అందరూ బతుకమ్మ చీరలను అందించాలి. సిరిసిల్లలో సాంచాలపై ఇతర ఉత్పత్తులను నిలిపివేసి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయాలి. – పి.యాదగిరి, టెస్కో జనరల్ మేనేజర్ అందరికీ ఆర్డర్లు ఇచ్చాం.. సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులందరికీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాం. 120 మ్యాక్స్ సంఘాలకు, మరో 77 చిన్నతరహా పరిశ్రమల యజమానులకు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఇస్తాం. ప్రస్తుతం 14 వేల మగ్గాలపై చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. కొందరు ఇంకా తెల్లని పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లు బతుకమ్మ చీరలు నేయాల్సి ఉంది. – వి.అశోక్‌రావు, జౌళిశాఖ ఏడీ ఇవీ బతుకమ్మ చీరల ఆర్డర్లు.. అవసరమైన చీరలు : 90 లక్షలు ఇప్పటికే ఉత్పత్తయినవి : 30 లక్షలు చీరలు ఉత్పత్తి చేసే పవర్‌లూమ్స్: 14 వేలు అవసరం అయిన వస్త్రం : 5.94 కోట్ల మీటర్లు నిత్యం ఉత్పత్తవుతున్న వస్త్రం : 7 లక్షల మీటర్లు శ్రమించే నేత కార్మికులు : 10వేల మంది (అన్ని విభాగాల్లో) చీరల ఆర్డర్ల ఖరీదు : రూ.300 కోట్లు ఆర్డరు గడువు : సెప్టెంబర్ నెలాఖరు -
ఎన్నారైల సమక్షంలో మంత్రి ప్రసంగం
వాషింగ్టన్ డీసీ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నారైల సమక్షంలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నారైలు తమ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొలపాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే కాక రైతాంగానికి కూడా సహాయం చేయాలని కోరారు. -
ఎన్నారైల సమక్షంలో మంత్రి ప్రసంగం
-
టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వం
ధారూరు: టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని మున్నూరుసోమారంలో రూ.2.95 కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మిషన్ కాకతీయ, నిరంతర ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రికార్డుల ప్రక్షాళన తదితర కార్యక్రమాలతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నామని, జిల్లాలోని 1,350 చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటల్లో నీళ్లు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.60 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మోమిన్‌కలాన్, మున్నూరుసోమారం, ఎన్కతల, గెరిగిట్పల్లి గ్రామాల్లో కొత్త సబ్ స్టేషన్లు నిర్మించినట్లు వివరించారు. మున్నూరుసోమారంలో చెరువు మరమ్మతులు, వంతెన నిర్మాణం, సీసీ రోడ్ల కోసం అవసరమైన ప్రతిపాదనలు అందించాలని పీఆర్ డీఈని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజీవరావు, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, కె.అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ రాంరెడ్డి, జిల్లా సభ్యుడు రాజేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచు బిచ్చన్న, ఎంపీటీసీ దస్తప్ప, విద్యుత్ ఎస్ఈ జానకీరాం, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్ కొండల్‌రెడ్డి, వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు వడ్లనందు, రాములు, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, అవుసుపల్లి అంజయ్య, లక్ష్మయ్య, చిన్నయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అమ్మవారి బోనాలు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 15 నుండి ఘటం ఎదుర్కోలుతో ప్రారంభమవుతాయని, జూలై 29న అమ్మవారికి బోనాలు, 30న రంగం (భవిష్యవాణి) కార్యక్రమాలు ఉంటాయని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించేం దుకు పెద్దఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు గౌడ్‌తో కలసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బంగారు బోనం నమూనాను మం త్రులు ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభు త్వం తరుఫున కోటి రూపాయలతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో బోనం తయారు చేయిస్తున్నా మన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనా లను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఆలయ పరిసరాలలో పారిశు«ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని, బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తులకు తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధులు నిర్వహిస్తారని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున దానిని దృష్టిలో ఉంచు కొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయం ఆవరణలో 24 లక్షల రూపా యల ఖర్చుతో భారీషెడ్డును నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్ యోగితా రాణా, వాటర్‌వర్క్స్ ఎండీ దానకిషోర్, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహంకాళి ఆలయ ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల కోసం ఖర్చుచేసిందెంత?: ఆరేపల్లి మోహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఓటర్ల గణన తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు జరిగాయని, అయితే ఓటర్ల గణనలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల వారిగా కులసంఘాలతో చర్చించి రిజర్వేషన్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఒక్క సిరిసిల్లలోనే దళితులపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయని మోహన్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దళితులకు బడ్డెట్ ఎంత కేటాయించిందో?, అందులో ఎంత ఖర్చు చేసిందో?, మిగులు నిధులు ఏం చేసిందో? ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్.. ద్రోహులమయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉద్యమ నేపథ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుని గూండాల్ల వ్యవహరించిన వాళ్లంతా టీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగుతున్నారని, చీమలపుట్టలో పాములు చేరిన చందంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె ఇన్నయ్య మాట్లాడారు. ‘‘అంకుల్ తెలంగాణ వచ్చేది కాదు సచ్చేదికాదు మా నాన్నను డిస్టర్బ్ చేయకండి.. ఇంకెవరినన్న చూసుకోండి’ అంటూ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ప్రస్తుత మంత్రి కేటీఆర్ తనకు ఫోను చేసి వేడుకున్నాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాడని అన్నారు. టీఆర్ఎస్ మొత్తం కుటుంబపాలన, తెలంగాణ ద్రోహుల మయమైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన వాళ్లే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు కేసీఆర్ ’నాకెవరున్నారు.. నేను నా భార్యే.. నా పిల్లలు రాజకీయాల్లోకి రారు’ అన్నారని, ఇప్పుడు మొత్తం కుటుంబపాలనే అయ్యిందన్నారు. ఉద్యమ ఆకాంక్ష పూర్తిచేసేందుకే టీజేఎస్ పుట్టిందని, అసమానతలు లేని, పరిపాలన మార్పు, మెజార్టీ ప్రజల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను సాధించేందుకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే తమ విజయ ప్రస్థానం మొదలవుతుందని జోస్యం చెప్పారు. తెలం గాణ జన సమితి తరఫున వార్డు అనుబంధ సభ్యులను ప్రకటిస్తామని, ఉద్యమంలో భాగస్వాములైన వారు, సామాజిక సేవ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశమిస్తామన్నారు. దివ్యాంగులకు, అనాథ యువతకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో టీజేఎస్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇన్చార్జిలు, నాయకులు ముక్కెర రాజు, జేవీ రాజు, జనగామ నర్సింగ్, కనకం కుమారస్వామి, స్రవంతి, ఎస్.గంగారెడ్డి, గడ్డం రవిందర్ రెడ్డి, డొంకెన రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బాధ్యత మరిచింది..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : నాయకులు పదవుల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేసి తర్వాత దాని విలువలు మర్చారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభానికి ఆయన బుధవారం మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రిబ్బన్‌కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, కనీస బాధ్యతలను ప్రభుత్వాలు మరిచి, పూర్తిగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా సభలు ఏర్పాటు చేసుకోవడమనేది రాజ్యాంగ హక్కు, ఇందుకు 29న పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా.. అనుమతి ఇవ్వాలని పేర్కొంది. అయితే జన సమితి సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న భయం పట్టకుందని, అందుకే అనుమతి ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఇలా ప్రారంభం నుంచి పోరాటాలతోనే ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, వాస్తవాలను మాత్రమే మాట్లాడామన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఎన్నో త్యాగాలు చేసి కుర్చీ అప్పజెప్పారు.. మా ఇష్టం వచ్చినట్లు పాలిస్తామన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ఊరికే రాలేదు.. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అమరులయితే వచ్చింది.. వారిని స్మరించుకునేందుకు ప్రభుత్వం ఒక స్థూపం కూడా నిర్మించకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ నెల 29న హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే సభకు వచ్చే ప్రతి ఒక్కరు ఒక ఇనుప ముక్కను వెంట తీసుకురావాలని, తెచ్చిన ముక్కను కరగదీసి అక్కడే అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టులు, పైరవీల కోసమే రాజకీయాలు ఎన్నో ఏళ్ల తర్వాత కనీస న్యాయం జరుగుతుందని కళలుగన్న తెలంగాణ ప్రజలకు నాయకులు కనీస న్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు. కాగా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసమే కుర్చీలు ఎక్కారని, ఎక్కడ భూ సెటిల్మెంట్లు చేయవచ్చు అనుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్‌లో బాలికలపై జరిగిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. శ్రీరెడ్డి అనే నటికి అవకాశాలు ఇవ్వకుండా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంటలు పండక.. బోర్లు ఎండిపోయి.. వడగండ్ల వానపడి వేల ఎకరాళ్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం చూపిన తెగువ ఇక్కడి ప్రజలు మరిచి పోలేదని, అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రత్నామ్నాయ పార్టీలు అవసరమని, పార్టీ ఏర్పాటు నిర్ణయం అనేది ముందే తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఒకేఒక్క కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగి పూర్తిస్థాయిలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు బాల్కిషన్, మంత్రి నర్సింహయ్య, ప్రభాకర్, ఆంజనేయులు, వెంకటస్వామి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి మత్స్య అభివృద్ధి పథకం
ఖమ్మంవ్యవసాయం : మత్స్యరంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సమాఖ్య ద్వారా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎన్.హన్మంతరావు తెలిపారు. నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మత్స్య సహకార సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై అవగాహన కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి ప్రభు త్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు రూ.30కోట్ల మేర కు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నా రు. ఆ నిధులను ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు, మహిళా మత్స్య సహకార సంఘాలకు, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలకు, ఆయా సంఘాల సభ్యుల ప్రయోజనానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపా రు. చేప పిల్లల ఉత్పత్తిని పెంచటం, చేపల వేటకు పరికరాలు అందించటం, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు సహాయం అందించటం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ పథకాన్ని వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత లబ్ధిదారులకు చేపల అమ్మకానికి ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, వలలు, క్రాప్టు లు, లగేజీ ఆటోతో చేపల అమ్మకం, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువుల నిర్మాణం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ యూనిట్, అలంకరణ చేపల యూనిట్, విత్తన చేపలపెంపకం చెరువులకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. వీటికి ప్రభుత్వం 75నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. లబ్ధిదారులు రూ.4వేల నుంచి రూ.25లక్షల వరకు కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు. గ్రూపులకు రూ.4లక్షల నుంచి రూ.76లక్షల వరకు సబ్సిడీపై పరికరాలు, రుణాలు ఇస్తున్న ట్లు తెలిపారు. సహకార సంఘాల స్థాయిలో, జిల్లా సంఘం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సబ్సిడీపై రుణాలు, పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మత్స్యకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు యడవల్లి చంద్రయ్య, నీలాల గోపి, ఖమ్మం, వైరా మత్స్య అభివృద్ధి అధికారులు వరదారెడ్డి, శివప్రసాద్, మత్స్యకారులు పాల్గొన్నారు. -
గ్రీన్‌సిగ్నల్!
జిల్లాలో రేషన్‌దుకాణాలు 558 అంత్యోదయ కార్డులు 17,037 ఆహార భద్రత కార్డులు 2,11,566 అన్నపూర్ణ కార్డులు 42 ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం 4,600 మెట్రిక్‌టన్నులు నాగర్‌కర్నూల్ టౌన్ : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లాలో కార్డులు జారీ చేయాలని వారం రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయా జిల్లాల సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సమీప మీసేవ కేంద్రాలలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పాత కార్డులలో కూడా అవసరమైన మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కొత్త కార్డుల ప్రక్రియపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన కూడా చేశారు. దీంతో ఎట్టకేలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై స్పష్టత వచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కార్డులను మంజూరు చేయలేదు. దీంతో మూడున్నరేళ్లుగా లబ్ధిదారులు కొత్త రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక దశలో శాశ్వత రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రక్రియపై నేటికీ ఒక స్పష్టమైన ప్రకటన వెలువర్చలేదు. అదేవిధంగా సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించడంతో శాశ్వత రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక ఉండదనే అధికారులు భావిస్తున్నారు. కేవలం రేషన్‌కార్డు నంబర్‌తో రేషన్ పొందే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్‌కార్డు కేవలం రేషన్ తీసుకునేందుకు మాత్రమే కాకుండా ఒక గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. ఆధార్ కార్డు అందుబాటులోకి రాక ముందు రేషన్‌కార్డు ప్రాముఖ్యత చాలా ఉండేది. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో అప్పట్లో ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్‌కార్డు తీసుకునేందుకు పోటీ పడటంతో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు ఉన్న వారికే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డును ఇచ్చారు. క్రమేణా రేషన్ కార్డు ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుండడంతో కొంతమంది స్వచ్ఛందంగా వీటిని వదులుకున్నారు. మూడేళ్లుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా వరకు ప్రజలు కొత్త కార్డులను తీసుకోలేకపోయారు. ప్రస్తుతం కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామాల్లో వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆయా గ్రామ వీఆర్వోలు, రేషన్ డీలర్లు పరిశీలించిన అనంతరం వాటిని మండల తహసీల్దార్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన వారి జాబితాను చివరగా జిల్లా పౌర సరఫరాల శాఖాధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి డీఎస్ఓ ఆమోదిస్తే వారికి కొత్త కార్డు మంజూరవుతుంది. ఏ ఆధారం లేని ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులను మంజూరు చేయనుంది. అత్యంత దీన స్థితిలో ఉన్న వారికి అన్నపూర్ణ కార్డులను ఇవ్వనుంది. తహసీల్దార్లకు ఆదేశాలు జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల వివరాలను పరిశీలించి జాబితా తయారు చేసి పంపాలని ఆయా మండల తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రజావాణిలోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 558 రేషన్‌షాపులలో 17,037అంత్యోదయ కార్డులు, 2,11,566 ఆహార భద్రత, 42 అన్నపూర్ణ కార్డులు ఉండగా, ప్రతి నెలా 4600 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అర్హులకే కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అన్ని మీసేవ కేంద్రాలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తారు. గ్రామాల్లో కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. – మోహన్‌బాబు, డీఎస్ఓ -
కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి
టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులదే కీలక భూమిక పోషించారు. అలాంటి వారికి కేసీఆర్ హామీలు ఇచ్చి మోసగించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు.. వారి కుటుంబాలకు అన్యాయం జరిగింది. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్కు గురైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి విస్మరించారు.’ రూ.10 లక్షల ఇంటి రుణం హామీ అమలుకాలేదు. కొత్త గనులు, ఉద్యోగాల కల్పన గాలికొదిలారు. అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రలో మాట్లాడారు. గోదావరిఖని : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులే కీలకభూమిక పోషించారని, అలాంటి వారికి అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రెండోవిడత ప్రజాచైత న్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరిగిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ కా ర్మికులను, వారి కుటుంబాలను మోసం చేశారన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్కు గురైన కార్మికులనూ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి మోసం చేశారన్నారు. 2014 ఎన్నికల్లోనే రూ.10లక్షలు ఇంటి రుణం ఇప్పిస్తామన్న హామీ అమలు చేయలేదన్నారు. కొత్తగనులు, ఉద్యోగాల కల్పన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. 20 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి కా ర్మికుల ప్రభావం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజా వ్యతిరేక పాలనపై యుద్ధం : మక్కాన్‌సింగ్ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకులు మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, కానీ నేటి ప్రభుత్వంలో పక్కనే ఉన్న రామగుండంకు తాగు, సాగునీరు ఇప్పించలేని పరిస్థితి ఉందన్నారు. సాగు, తాగునీటి కోసం పాదయాత్ర చేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కానీ అది పూర్తవుతుందా లేదా అనేది నమ్మకం లేదన్నారు. 62.5 మెగావాట్ల రామగుండం విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. ప్రశ్నించేవారిని గొంతునొక్కుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పకతప్పదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్, డి.శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆరెపెల్లి మోహన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, గోమాస శ్రీనివాస్, హర్కర వేణుగోపాల్‌రావు, జనక్‌ప్రసాద్ మాట్లాడారు. బోడ జనార్దన్, ప్రేమ్‌సాగర్‌రావు, నేరెళ్ల శారద, ఫకృద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గంట సత్యనారాయణరెడ్డి, దాసోజు శ్రావణ్, భార్గవ్ దేశ్‌పాండే, అరవిందరెడ్డి, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగసభ నిర్వహించగా.. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లతోపాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల నుంచి ప్రజలను సమీకరించారు. బహిరంగసభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహ నిండింది. సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దూరప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు సభ ముగిసేవరకు ఉన్నారు. రాష్ట్రంలో సోయిలేని పాలన: రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సోయిలేని పాలన సాగుతోందని... గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయానికి వెళ్లేవారని.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే ఉంటూ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. 12 వందల మంది విద్యార్థుల బలిదానంతో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్, వారి కుటుంబం అధికారాన్ని చేపట్టి ఆర్థికంగా బలపడుతున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో ఎన్నికల సమయంలో దసరా పండుగకు ఓటేస్తే.. దీపావళి పండుగకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుల మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న తెలంగాణను.. అప్పుల తెలంగాణగా మార్చారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. -
వారం రోజుల్లోపు కందుల డబ్బులు
గుడిహత్నూర్(బోథ్) : వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. కంది రైతులకు చెల్లించాల్సిన రూ.94 కోట్లు జిల్లాకు చేరాయని, వారంలోగా చెల్లిస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చాలనే సంకల్పంతో సిబ్బంది పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో జిల్లా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో వెనుకబడి ఉందని తెలిపారు. అంగన్వాడీలు, ఉపాధి సిబ్బంది వారి వారి పరిధిని దత్తత తీసుకుని మరుగుదొడ్లు నిర్మిస్తే వారికి పారితోషికం అందిస్తామని తెలిపా రు. అనంతరం శాఖల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీవో పీడీ రాజేశ్వర్‌రాథోడ్, డీఎంఅండ్‌హెచ్‌వో రాజీవ్‌రాజ్, జెడ్పీ సీ ఈవో జితేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారులు డాక్టర్ మనోహర్, సాధన, ఇచ్చోడ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, తహసీల్దార్ అర్క మోతీరాం, ఎంపీడీవో పుష్పలత, ఎంఈవో నారాయణ, ఏవో మహేందర్, ఎంవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన
ఆసిఫాబాద్‌క్రైం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్ అన్నా రు. జిల్లాకేంద్రంలోని స్థానిక రోజ్ గార్డెన్లో మంగళవారం పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని, ఈ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరిస్తూ మాటల గారడీతో ప్రజలను మో సం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని ఆరోపించారు. జిల్లాలో పార్టి బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి పద్మ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కార్యదర్శులు బద్రి సత్యనారాయణ, కళవేణి శంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.తిరుపతి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్, నాయకులు గణేశ్, దివాకర్, పంచపల, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నిజ స్వరూపం చూపిస్తున్నారు..
సాక్షి, జగిత్యాల : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ నిజస్వరూపం చూపుతున్నారని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్నపరిణామాలపై ఆయన జగిత్యాలలో గురువారం మీడియాతో మాట్లాడుతూ...‘ కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారు. టీఆర్ఎస్ అనుచరుల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. అడ్డగోలు భూసేకరణ చేసి రైతులను మోసం చేశారు. ప్రగతి భవన్ పైరవీ కారులకు అడ్డాగా మారింది. మంత్రులకు అపాయింట్మెంట్ దొరకదు కానీ, దొంగలకు మాత్రం దొరుకుతుంది’ అన్నారు. -
ప్రతిపక్షాలంటే ఎందుకంత భయం?
సాక్షి, జగిత్యాల: నేరం నాది కాదు ఆకలిదీ అనే సినిమాలాగా.. ఈ పాపం నాది కాదు కేంద్రానిది అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, ప్రజలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే.. నిర్భందాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వాస్తవాల్ని వక్రీకరించడం, శాశ్వతంగా సభ్యులను సభ నుంచి తొలిగించడం ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు. స్వామిగౌడ్‌ని టీఆర్ఎస్ నాయకునిగా ఎవరూ భావించలేదని ఉద్యమకారునిగానే గుర్తించామన్నారు. గవర్నర్ ప్రసంగం వీడియో రికార్డింగ్ ఫుటేజీ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సభలో జరిగిన దాన్ని స్పీకర్, శాసనమండలి చైర్మన్ సుమోటోగా స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ఘటన ఆధారంగా చేసుకుని శాసనసభ్యులను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికమని, సంఘటన ఫుటేజీ బయట పెట్టే వరకు చర్యలు తీసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, పార్లమెంట్లో మీకోనీతి అసెంబ్లీలో మాకో నీతా అని ప్రశ్నించారు.