
సాక్షి మహబూబాబాద్/సాక్షి భద్రాద్రి కొత్తగూడెం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవస్థలన్నీ సర్వ నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందులలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. న్యాయవాద దంపతులను హత్య చేసింది టీఆర్‌ఎస్ నాయకులేనని, ఈ ఘటనతో ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుకొని టీఆర్‌ఎస్ గల్లీ కార్యకర్త వరకు ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్‌ల పేరిట భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగ సమస్య రెట్టింపు అయిందన్నారు. మొత్తం 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పే రివిజన్ కమిషన్ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ, ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ మతపరంగా సమాజాన్ని చీలుస్తోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే బీజేపీని ఓడించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. భద్రాద్రి రాముడికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుక రాములునాయక్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కాగా, న్యాయవాద దంపతుల హత్యపై శుక్రవారం గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు.
మానుకోటలో రసాభాస
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పార్టీ అభ్యర్థి రాములు నాయక్ మాట్లాడే క్రమంలో వేదికపై ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన నెహ్రూ నాయక్ పేరు పిలవకపోవడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ దండం పెడుతూ సముదాయించేందుకు ప్రయత్నించగా.. బలరాం నాయక్ గో బ్యాక్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ గొడవతో అరగంట పాటు సభకు అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ చేసిన ప్రయత్నా లూ సఫలం కాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు బలం నిరూపణ చేసుకోవాలంటే హైదరాబాద్‌కు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వేదికపై ఉన్న నేతలందరూ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment