సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. యాత్రలజోరు పెరిగింది. ముఖ్యనాయకులు ‘నడక మంచిదే’అంటున్నారు. నల్ల వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతుయాత్రలు చేపట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇకముందు కూడా ఇదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ యాత్రల ద్వారా పార్టీ కేడర్‌లో కదలిక వస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టగలుగుతున్నామని భావిస్తున్న టీపీసీసీ నాయకత్వం 2023 ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేపనిలో పడింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని, జై జవాన్, జై కిసాన్ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టేందుకు టీపీసీసీ ముఖ్యులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
రెండు యాత్రలు... రెండు రూట్‌లు
రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్యనేతలు ఈ నెలలో యాత్రలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 7న అనూహ్యంగా అచ్చంపేట దీక్షా శిబిరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించి 10 రోజులపాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను ఆయన కదిలించగలిగారు. రోజుకు నాలుగైదు గ్రామాల చొప్పున 40 గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్ర ముగింపు సమయంలో రావిరాలలో భారీ జనసమీకరణతో బహిరంగసభ నిర్వహించి ఒక్కసారిగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానని ప్రకటించారు. మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాతో యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి రోజూ ఆయన కూడా నాలుగైదు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మమేకం అవుతున్నారు. వీలున్నచోటల్లా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ నెల 22 వరకు తన యాత్రను కొనసాగించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు పార్టీకి ఉపయోగకరంగానే ఉన్నాయనే భావన టీపీసీసీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ యాత్రల గురించి టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ఇన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయలేకపోయామని, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభమైనందున, దీన్ని కొనసాగించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటేనే పార్టీకి మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు త్వరలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికే కొందరిని కలిశారని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. మొత్తంమీద వరుస ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయి యాత్రలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment