
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రపూరితంగా ఈడీ నోటీసులు ఇప్పించిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇప్పించినంత మాత్రాన దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ వారసులు భయపడతారా? అని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ‘1978 నవంబర్‌లో ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నికైనప్పుడు అధికారంలో ఉన్న జనతా పార్టీ కక్షపూరితంగా వ్యవహరించింది. కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పేరిట ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించి అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత దేశం మొత్తం తిరగబడి ఇందిరకు అండగా నిలబడింది. 1980లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని 350 సీట్లతో గెలిపించి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారు. ఇప్పుడు అదే తరహాలో సోనియా, రాహుల్‌లకు దేశ ప్రజలు అండగా నిలబడతారు’అని భట్టి తెలిపారు.