సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల కిందటి కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఎనిమిదేళ్లు పరిపాలించిన తర్వాత కూడా ప్రధాని మోదీకి కలలో కూడా కాంగ్రెస్ పార్టీయే వస్తోందని ఎద్దేవా చేశారు. ఈడీ సమన్లు తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆయన బుధవారం ట్విట్టర్‌తోపాటు ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
కాగా, తమ అగ్రనేతలకు ఈడీ సమన్లు జారీ చేయడం బీజేపీ పిరికిపంద చర్య అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈడీ నోటీసులకు తమ నాయకత్వం భయపడబోదని నవసంకల్ప్ శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సోనియా కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా రోడ్ల మీదకు వస్తారని, అప్పుడు తట్టుకోవడం బీజేపీతో సాధ్యం కాదని అన్నారు.
బీజేపీకి మూల్యం తప్పదు: ఉత్తమ్
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి ఈడీ సమన్లు ఇచ్చిన బీజేపీ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎనిమిదేళ్ల క్రితం మూసివేసిన కేసులో విచారణకు పిలుస్తున్నారని మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment