సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శిబిర్ అనంతరం విడుదల చేసిన ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’లోని అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.
అలాగే రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఆరు కమిటీలను నియమించారు. సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయం, సామాజిక న్యాయం, యువజనం పేరిట ఏర్పాటు చేసిన ఈ కమిటీలకు ఒక్కో దానికి సీనియర్ నేత కన్వీనర్‌గా 10 మంది సభ్యుల చొప్పున నియమించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి అంశంపై ఆయా కమిటీలు చర్చించి సభ్యుల అభిప్రాయాల మేరకు నివేదికను నవసంకల్ప్ శిబిర్ ముఖ్య కమిటీకి అప్పగించనున్నాయి. ఈ కమిటీ ఆ నివేదికలను రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ప్రవేశపెట్టి చర్చించి.. అనంతరం వాటిని పార్టీ పాలసీగా, చింతన్ శిబిర్ నిర్ణయాలుగా అధికారికంగా రెండోరోజు ప్రకటించనుంది.
ఈ నివేదికనే 2023 ఎన్నికల్లో పార్టీ రూట్‌మ్యాప్‌గా తీసుకోనున్నారు. ఈ చింతన్ శిబిర్‌కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ పర్యవేక్షకుడిగా హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఈ శిబిరంలో పాల్గొననున్నారు. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ఏఐసీసీ కమిటీల్లోని ఆఫీస్ బేరర్లు, మాజీ మంత్రులు, ఎంపీలకు ఈ సమావేశ ఆహ్వానం లభించింది.
ప్రజల ఆకాంక్షల మేరకే..: భట్టి
టీపీసీసీ ఆధ్వర్యంలో నవ సంకల్ప శిబిర్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కీసరలో నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేధోమథన శిబిర్ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, ముఖ్య నేతలు అద్దంకి దయాకర్, హజ్మతుల్లా, సునీతారావుతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్ర సాధన ఫలాలను అన్ని వర్గాలకు అందించేందుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో లోతైన అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు.
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..
జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రస్థాయిలో గాంధీ భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నట్టు భట్టి తెలిపారు.
స్థానిక సంస్థలకు నిధులివ్వండి..
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోందని విక్రమార్క దుయ్యబట్టారు. తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేయించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ ఒత్తిడి చేసిన కారణంగానే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేసి సర్పంచ్‌లకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment