
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు రావాలి. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
తులం బంగారం ఎక్కడ?.
ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు.

పెండింగ్ నగరంగా హైదరాబాద్..
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్‌ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment