ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.. ఆద్యంతం భట్టికి ఆత్మీయ అనుబంధమే | A successful mark of Batti Padayatra in Adilabad combined district | Sakshi
Sakshi News home page

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.. ఆద్యంతం భట్టికి ఆత్మీయ అనుబంధమే

Published Mon, Apr 17 2023 12:14 AM | Last Updated on Mon, Apr 17 2023 3:46 PM

- - Sakshi

మంచిర్యాల టౌన్‌/ మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌): హాథ్‌సే హాథ్‌ జోడో యత్ర కొనసాగింపులో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం ముగిసింది. ఆదిలాబాద్‌ జిల్లా పిప్రి వద్ద షురూ అయిన ఈ యాత్ర 31 రోజుల పాటు సాగింది.

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి భట్టి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఉత్సవ విగ్రహంలా ఎమ్మెల్యే..

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మంచిర్యాల అ భివృద్ధికి నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మె ల్యే విఫలమయ్యారని ఆరోపించారు. గోదావరి బ్యా క్‌ వాటర్‌ వచ్చి, రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోయినా నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికి పరిహారం ఇవ్వకుండా, ఉత్సవ విగ్రహంలా దివాకర్‌రావు ఉన్నారని విమర్శించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు. పనిచేయని ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. యాత్రలో పాల్గొన్న జనం మాకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. పనిచేసే వారు, ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకులే మనకు కావాలన్నారు. అధికారంలో ఉ న్నా, లేకపోయినా ప్రజల కోసం తపించే నా యకు డు ప్రేమ్‌సాగర్‌రావు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కో రారు. చేతగాని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు.

సమస్యలు తెలుసుకుంటూ...

పాదయాత్రలో భాగంగా మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో దోస, పండ్లు అమ్ముకునే వారిని భట్టి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేదరివాడలో వెదురు బుట్టలు, చాటలు తయారు చేసి అమ్ముకునే బొల్లం రజితతో మాట్లాడగా, తాను బీఈడీ చదివానని చెప్పింది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోగా, డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు సైతం ఇవ్వడం లేదని చెప్పింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే కులవృత్తులకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని భట్టి తెలిపారు.

హాజీపూర్‌ మండలంలో ఘన స్వాగతం..

పాదయాత్ర హాజీపూర్‌ మండలం వేంపల్లికి చేరగానే స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భట్టితోపాటు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీటీసీ డేగ బాపు దంపుతులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతీయ రహదారి మీదుగా ముల్కల్ల, గుడిపేట వరకు యాత్ర చేశారు. గుడిపేటలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత గుడిపేట గోదావరి రోడ్‌ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ మీదుగా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. భట్టి విక్రమార్క పాదయాత్రలో స్థానికులకు అభివాదం చేస్తూ కలిసిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని, నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, భూములు కోల్పోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్‌ కటింగ్‌..

పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్‌ కట్‌ చేశారు. మత్స్యకారులు భట్టికి చేపల వల అందజేశారు. అనంతరం భట్టి పాదయాత్రకు ప్రాజెక్ట్‌ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు భట్టికి జిల్లాలోకి స్వాగతం పలికారు. పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, రఘునాథ్‌రెడ్డి, మంచిర్యాల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఒడ్డె రాజమౌళి, ఎంపీటీసీ బాలరాజు, నాయకులు సురేందర్‌, కుమార్‌ యాదవ్‌, పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ‘భట్టి’1
1/1

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ‘భట్టి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement