
సంతకాల సేకరణలో పాల్గొన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు.
ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment