Signature Collection
-
21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు. -
‘సంతకాల సేకరణను విజయవంతం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘కొలువుల కోసం సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ఆగస్టు 8 నుంచి 16 వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పట్టుదలతో నిర్వహించాలన్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిన తీరును ఓటర్లకు వివరించాలని కోరారు. పార్టీ జూలై 25న మండల కేంద్రాలలో, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే పనిచేస్తుందని విమర్శించారు. -
కొలువుల కోసం సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు భర్తీ కాక నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని, అయినా సర్కారు వారి గురించి ఆలోచించట్లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కొలువుల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందన్నారు. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిందన్నా రు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 25న మండల కేంద్రాలు, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యోగ ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నా రు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతు న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఏవిధంగా మోసం చేసిందో నిరుద్యోగులకు వివ రించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రతి మండ ల, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఆగస్టు 8 నుండి 16 వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలు పునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. వారి పక్షాన అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ గర్జనకు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆకాంక్షను బలంగా వినిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్‌రెడ్డి, మతీన్ ముజదుద్దీన్, బి.సంజీవరావు, బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐపై అభిశంసనకు వెనక్కి తగ్గుతున్న విపక్షాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం కోసం కాంగ్రెస్ ప్రారంభించిన సంతకాల ఉద్యమం క్రమంగా చల్లారిపోతోంది. సైద్ధాంతికంగా ఆ పార్టీతో కలిసొచ్చే కొన్ని పార్టీలే ఈ అంశంపై వెనక్కితగ్గాయి. కాంగ్రెస్ తీర్మానంపై బుధవారం ముగ్గురు డీఎంకే ఎంపీలు సంతకం చేయగా.. పార్టీ నాయకత్వం ఆదేశాలతో వారు మద్దతును వెనక్కి తీసుకున్నారు. తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ సంతకాలు చేసినా తరువాత ఉపసంహరించుకుంది. పార్లమెంట్లో కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలు సంతకం చేశాకే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు సమాచారం.