nirudyoga garjana Sabha
-
‘ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో టీఆర్ఎస్ మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పేర్లు మార్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని.. అందుకు టైం షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పాతిక లక్షల మందితో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లు పెట్టడం కాదు.. పాతిక లక్షల మందికి నియామకాలు ఎప్పుడో చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకైనా ఓటమి తప్పదని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణలో తిరగనీయకుండా చేయాలన్నారు. -
21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు. -
కేసీఆర్..ఖబర్దార్.. : బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లక్షా 12వేల ఉద్యోగాల నియామకం జరిగే వరకు బీజేపీ మడమ తిప్పదు..ఖబర్దార్ కేసీఆర్’ అని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటున్న ప్రభుత్వం భర్తీ మాత్రం చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టూడియంలో నిరుద్యోగ సమర భేరి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని ఎన్నికల్లో అన్న కేసీఆర్..దాని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. యువత జీవితాలతో ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు. యూనివర్సిటీలను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్యోగ కాలెండర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెగించి కొట్లాడిన యువత తెలంగాణలో దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం కాదు ఊరికో ఉద్యోగం కూడా రాలేదన్నారు. ప్రతి విషయంలో ఏపీని పోల్చే కేసీఆర్ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ఎందుకు పోల్చరని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడువుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టిందని బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల బలిదానాలపై కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట తప్పారని తెలిపారు. ప్రారంభించిన ప్రతి పథకం కోర్టుల్లో ఆగిపోవాలని కేసీఆర్ కోరుకుంటారని ఎద్దేవాచేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కార చేయకపోతే ..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ రాజకీయ నిరుద్యోగి కాక తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, గౌడ్ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని’
హైదరాబాద్: కాంగ్రెస్, ఎంఐఎంలతో సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిన్ మే కాంగ్రెస్.. రాత్ మే ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో ‘నిరుద్యోగుల సమరభేరి‘ పేరిట బీజేవైఎం ఆదివారం భారీ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూనం మహాజన్ ... తెలంగాణ యువకుల స్వప్నాలను కేసీఆర్ నీరుగార్చారని మండిపడ్డారు. ఆయన తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. అధికార టీఆర్ఎస్ ఒక ప్రయివేట్ లిమిటెడ్ పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జనవరిలో జరిగే ర్యాలీలో బైక్ పై తానే ముందుంటానని పూనమ్ తెలిపారు. నిజాంను కేసీఆర్ పొగడటాన్ని బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. కేసీఆర్..కలెక్టర్ ఆఫీస్‌లు వచ్చాయి.. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తావ్ అని పూనం మహాజాన్ సూటిగా ప్రశ్నించారు. క్యా హువా తేరా వాదా అని బీజేవైఎం కేసీఆర్ ను నిలదీస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఢమరుకం వాయించి సమరభేరి మోగించి కార్యకర్తలను పూనమ్ ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రభుత్వంతో ఫైట్‌కు రెడీ నా అంటూ కార్యకర్తలను అడిగారు. తెలంగాణ బిడ్డను ఆంధ్రకు కోడలిని అని తెలిపారు. తెలంగాణ ఖుష్భు మహాజన్ రక్తంలో ఉందన్నారు. తెలంగాణ సర్కార్ పై ఈ సభ యుద్ధ భేరి అని తెలిపారు. కాగా పూనం మహాజన్ మహారాష్ట్రలో పుట్టినప్పటికీ తెలంగాణకు చెందిన ... వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లను వివాహం చేసుకున్నారు. అలాగే ఆనంద్‌రావు పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. -
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
నిరుద్యోగ గర్జన సభలో ఆర్. కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బి.సి.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బి.సి.యువజన సంఘాలు, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో జరిగిన రాష్ట్రస్థాయి నిరుద్యోగ గర్జనసభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మొక్కుబడిగా 1,055 ఇంజనీరింగ్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు లేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగులు లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఖాళీలను వెంటనే భర్తీచేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాగాయకురాలు విమలక్క మాట్లాడుతూ సమర్థులైన యువ అధికారులు పాలనాయంత్రాంగంలో పాలు పంచుకున్నప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిరుద్యోగులు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా తాను ముందుంటానన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బి.సి.సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు నర్రి స్వామి, రమేష్, శ్రీనివాస్, జి.రాంబాబు, అశోక్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూపై కక్ష తీర్చుకుంటున్నారు
* విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో కేసీఆర్‌పై మండిపడ్డ ప్రొ. హరగోపాల్ * సీమాంధ్రుల పాలనకు కేసీఆర్ పాలనకు తేడా లేదు హైదరాబాద్: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు గతంలోని సీమాంధ్రుల పాలనకు పెద్దగా తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆదివారం ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీవీవీ, పీడీఎస్‌యూ(విజృంభణ), ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ(తిరుగుబాటు) ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలలో జాప్యం, ఓయూ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, వీసీలుగా ఐఏఎస్‌ల నియామకాలు తదితర వ్యవహారాలతో ఓయూపైనా, విద్యార్థులపైనా సీఎం కేసీఆర్ కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని మండిపడ్డారు. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది ఉద్యోగాల కోసమే అని పేర్కొన్నా రు. పోరాడుతున్న విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను తీసుకోకుండా ఉజ్వలమైన విశ్వవిద్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. యూనివర్సిటీలకు డిగ్రీ అర్హతతో ఐఏఎస్ అయిన అధికారులను వీసీలుగా కాక.. అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యా సాలు రాసిన నిష్ణాతులైన సీనియర్ ప్రొఫెసర్ల నే నియమించాలన్నారు. కార్యక్రమంలో విమలక్క, డాక్టర్ కాశీం, ఎస్ఎల్ పద్మ, స్టాలిన్, శేషు, ముసవీర్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.