సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లక్షా 12వేల ఉద్యోగాల నియామకం జరిగే వరకు బీజేపీ మడమ తిప్పదు..ఖబర్దార్ కేసీఆర్’ అని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటున్న ప్రభుత్వం భర్తీ మాత్రం చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టూడియంలో నిరుద్యోగ సమర భేరి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని ఎన్నికల్లో అన్న కేసీఆర్..దాని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు.
యువత జీవితాలతో ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు. యూనివర్సిటీలను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్యోగ కాలెండర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెగించి కొట్లాడిన యువత తెలంగాణలో దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం కాదు ఊరికో ఉద్యోగం కూడా రాలేదన్నారు. ప్రతి విషయంలో ఏపీని పోల్చే కేసీఆర్ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ఎందుకు పోల్చరని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడువుతున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టిందని బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల బలిదానాలపై కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట తప్పారని తెలిపారు. ప్రారంభించిన ప్రతి పథకం కోర్టుల్లో ఆగిపోవాలని కేసీఆర్ కోరుకుంటారని ఎద్దేవాచేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కార చేయకపోతే ..వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రాజకీయ నిరుద్యోగి కాక తప్పదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, గౌడ్ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment