ఓయూపై కక్ష తీర్చుకుంటున్నారు
* విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో కేసీఆర్‌పై మండిపడ్డ ప్రొ. హరగోపాల్
* సీమాంధ్రుల పాలనకు కేసీఆర్ పాలనకు తేడా లేదు
హైదరాబాద్: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు గతంలోని సీమాంధ్రుల పాలనకు పెద్దగా తేడా లేదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆదివారం ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీవీవీ, పీడీఎస్‌యూ(విజృంభణ), ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ(తిరుగుబాటు) ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభ జరిగింది.
ఈ సందర్భంగా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలలో జాప్యం, ఓయూ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, వీసీలుగా ఐఏఎస్‌ల నియామకాలు తదితర వ్యవహారాలతో ఓయూపైనా, విద్యార్థులపైనా సీఎం కేసీఆర్ కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని మండిపడ్డారు. వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది ఉద్యోగాల కోసమే అని పేర్కొన్నా రు. పోరాడుతున్న విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ భూములను తీసుకోకుండా ఉజ్వలమైన విశ్వవిద్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. యూనివర్సిటీలకు డిగ్రీ అర్హతతో ఐఏఎస్ అయిన అధికారులను వీసీలుగా కాక.. అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యా సాలు రాసిన నిష్ణాతులైన సీనియర్ ప్రొఫెసర్ల నే నియమించాలన్నారు. కార్యక్రమంలో విమలక్క, డాక్టర్ కాశీం, ఎస్‌ఎల్ పద్మ, స్టాలిన్, శేషు, ముసవీర్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.