రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
నిరుద్యోగ గర్జన సభలో ఆర్. కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బి.సి.సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర బి.సి.యువజన సంఘాలు, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో జరిగిన రాష్ట్రస్థాయి నిరుద్యోగ గర్జనసభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
మొక్కుబడిగా 1,055 ఇంజనీరింగ్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు లేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగులు లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడిందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఖాళీలను వెంటనే భర్తీచేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రజాగాయకురాలు విమలక్క మాట్లాడుతూ సమర్థులైన యువ అధికారులు పాలనాయంత్రాంగంలో పాలు పంచుకున్నప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిరుద్యోగులు చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా తాను ముందుంటానన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బి.సి.సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు నర్రి స్వామి, రమేష్, శ్రీనివాస్, జి.రాంబాబు, అశోక్ చందర్ తదితరులు పాల్గొన్నారు.