
బీసీ సంఘాల ప్రతినిధుల విన్నపం
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్న వించారు. గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజు ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, దాసు సురేశ్ తదితరులు సమావేశమయ్యారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి.. ఈ నెల 16 నుండి 28 తేదీల మధ్య అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు: కృష్ణయ్య
ఈ నెల 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి గురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment