గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుందనీ నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. కానీ, రేవంత్ ప్రభుత్వం తన జీ.ఓ.ల ద్వారా ప్రజల్లోగందరగోళం సృష్టిస్తోంది. జీ.ఓ. 199లో బీసీ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగా పేర్కొంది. కాని జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి?
దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ జనాభా వెనుకబడిన తరగతుల వారిదే. రాష్ట్రంలో ఈ వర్గాల జనాభా 56 శాతం. బీసీ జాబితాలోని ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులలో 130 కులాలు ఉన్నాయి. బీసీలు భిన్నమైన సంప్రదా యాలు, ఆచారాలు, కళారూపాలు, కులదైవాలు కలిగి ఉండి తమవైన ప్రత్యేకతలు సంతరించుకుని ఉన్నారు. ఇప్పటికీ అనేక సామాజిక కులాలు, జాతులు ఆధునిక అభివృద్ధికి నోచుకోలేక పోయాయి. వీరిని వర్తమాన ప్రగతిలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సంకల్పశుద్ధితో, నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం కృషిచేయాలి.
ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలలోని సంచార, అర్ధసంచార, విముక్త జాతులు, కులాలు ఏ అభివృద్ధికీ నోచుకోకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో వీరిని ప్రగతి పథంలోకి తీసుకు రావడానికి చేసిన కృషి శూన్యమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గడిచిన పదేళ్లలో కొంతమేరకు గురుకుల పాఠశాలల ద్వారా చదువుకోవడానికి ఈ వర్గాలకు అవకాశం లభించింది. అయితే గత ప్రభుత్వం ఆశించిన మేరకు అండదండలు ఇవ్వలేదనే కారణంగా, ఈసారి బీసీలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారు. అయితే రేవంత్ ప్రభుత్వం కూడా గత పాలకులకన్నా మరింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం పట్ల బీసీలు ఆందోళన చెందుతున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ప్రకటించాక, రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితు లయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతారనీ, స్థానిక సంస్థలలో 42 శాతం ప్రజాప్రాతినిధ్యం లభిస్తుందనీ, బీసీల సమగ్రాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలులోకి వస్తాయనీ సంపూర్ణంగా నమ్మారు. మెజారిటీ బీసీలు ఓట్లు వేసికాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు.
అనుకున్నట్లు గానే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. తమకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరతాయని బీసీలు కొంతకాలం వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. కాగా ప్రభుత్వం ఎంతకీ ఉదాసీన వైఖరిని వీడక పోవడంతో ఉద్యమబాట పట్టక తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కుల సర్వే (కులగణన)కు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తదను గుణంగా మార్చి 15న జీఓఎంఎస్ నం. 26ను విడుదల చేసింది.
కాగా గడిచిన 6 నెలలుగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం తన వైపు నుండి ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. తిరిగి బీసీసంఘాలు తీవ్రంగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. ఆమరణ నిరా హార దీక్షల స్థాయికి ఉద్యమాల తీవ్రత పెరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఉలుకూ, పలుకు లేకపోవడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అనే విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.
ఈ నేపథ్యంలోనే మిక్కిలి అనుభవంతో, క్రియాశీలంగా పని చేస్తున్న డా‘‘ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలోని బీసీ కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. సర్వత్రా ఈ కమిషన్ గడువును పెంపుదల చేస్తారని భావించారు. అలాగే కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్‌లను నిర్ణయించడం లాంటి కీలక అంశాలను త్వరితగతిన చేయడానికి సహకరిస్తుందని అనుకున్నారు. కాగాఅందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురితో బీసీ కమి షన్‌కు కొత్త పాలకమండలిని నియమించింది ప్రభుత్వం. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చినట్టయ్యింది. 6 నెలలు పొడిగిస్తే సులభంగా అయ్యే పనిని, కొత్త పాలకమండలిని వేసి మళ్లీ కొత్తగా పని మొదలు పెట్టడం అనేది కేవలం సమయాన్ని వృధా చేయడమే.
బీసీ రిజర్వేషన్‌లకు విఘాతం కలిగించడానికే కుట్ర జరుగుతున్నదని బీసీలు చేస్తున్న ఆరోపణలు నిజమని భావించడం తప్పేమీ కాదు.బలహీన వర్గాలు చాలా కాలంగా తాము చేస్తున్న డిమాండ్ కులగణన నిర్వహించాలన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందుకే, ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. అయితే కేవలం జీ.ఓ. ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ కార్యక్రమాన్ని అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తిచేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ అలా రావడంలేదు. దీన్ని బట్టి రేవంత్ ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో లేదనే రీతిలో వ్యవహరిస్తోందన్న సామాజిక వేత్తల అభిప్రాయాలు నిజమే అని నమ్మాల్సి వస్తున్నది.
ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక నెలరోజుల పాటు పూర్తి సమ యాన్ని కేటాయిస్తే, కులగణనను సమర్థమంతంగా పూర్తిచేయవచ్చు. కానీ అలాంటి చర్యల దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఇటీవల బీసీ కమిషన్‌కు కొత్త పాలకమండలిని నియమిస్తూ జారీచేసిన జీ.ఓ. 199లో... ఈ కమిషన్ బీసీ జన గణనను చేపట్టి, స్థానిక సంస్థలలో వారి రిజర్వేషన్లను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టంగాపేర్కొంది. ఇది మరొక వివాదానికి దారి తీస్తోంది.
జీ.ఓ. 26లో మొత్తం కులగణన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేన్ని నమ్మాలి? ఈ కారణంగా ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటివి, ప్రత్యేకంగా న్యాయ నిపుణుల సలహాలతో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వం ఆదరాబదరాగా ఇచ్చిన జీ.ఓ. మరింత గందరగోళానికి దారి తీస్తున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. బీసీ గణన, కులగణన అనేవి పూర్తిగా వేరు వేరు ప్రక్రియలు అనే స్పష్టత ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతోంది. బీసీల గణన అంటే... కేవలం బీసీ కులాలకు సంబంధించినటువంటి వివరాలను, గణాంకాలను సేకరించడం.
కులగణన అనగా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల, వర్గాల సమాచారాన్ని సేకరించడం. కులగణన చేయడం వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశంఉంటుంది. కేవలం బీసీ గణన చేయడం ద్వారా బీసీలలో ఉన్న తారతమ్యాల వివరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. దాని వలన పెద్దగా ఉపయోగం లేదు.
అందువలన కులగణన లేదా కుల సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన అనివార్యతను ప్రభుత్వం గమనించి ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. బీసీ గణన, కులగణన అంటూ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో ప్రభుత్వం యావత్ కులగణనకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. న్యాయపరంగా పరిశీలించినప్పుడు కులగణన లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సామాజిక, ఆర్థిక కుల సర్వే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వాటాను నిర్ణయించడానికి అత్యంత ఆవశ్యకమైనది.
దీనికి సంబంధించి రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ క్రింద ప్రత్యేకంగా నిపుణులతో కూడిన ‘డెడికేటెడ్ కమిషన్’లను నియమించాలి. సమగ్రంగా అధ్యయనం చేయించాలి. ఆ కమిషన్‌లు ఇచ్చే సిఫారసులు, నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి డా‘‘ కె. కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి లాంటి కీలక కేసులలో గౌరవ సుప్రీంకోర్టురాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా మార్గదర్శకాలను సూచించాయి. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఉత్తర్వులను జారీచేయడం, సముచితం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
- వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు,జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు
- ఆర్. కృష్ణయ్య
Comments
Please login to add a commentAdd a comment