నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్‌.కృష్ణయ్య | Stone Attack On BC Welfare Association Leader Krishnaiah, More Details Inside | Sakshi
Sakshi News home page

నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్‌.కృష్ణయ్య

Published Fri, May 10 2024 5:15 AM | Last Updated on Fri, May 10 2024 10:39 AM

తిరుపతి జిల్లా ఏర్పేడులో దుండగుడు రాయి  విసరడంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ  అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వీపుకైన గాయం

తిరుపతి జిల్లా ఏర్పేడులో దుండగుడు రాయి విసరడంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వీపుకైన గాయం

బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యపై దాడి

రాయి విసిరిన గుర్తు తెలియని దుండగుడు 

వీపు భాగంలో తీవ్ర గాయం

ఏర్పేడు బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఘటన

నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే 

మండిపడ్డ కృష్ణయ్య

ఏర్పేడు/రేణిగుంట (తిరుపతి జిల్లా): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్రగాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళ­హస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌­రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని ఆయన చొక్కాను పైకి లేపి వీపుపైన గాయాన్ని గుర్తించారు. 

తలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని అయితే రాయి వీపునకు తగిలిందని చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ప్రజాస్పందనను తట్టుకోలేకే టీడీపీ నేతలే దాడికి పురికొల్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి జరిగినా కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడ నుంచి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ శ్రీరామ శ్రీనివాసులుకు ఫిర్యాదు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది కృష్ణయ్య గాయానికి బ్యాండేజ్‌ వేసి కట్టు కట్టారు. ఆయనకు నీరసంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు సెలైన్‌ ఎక్కించారు.

చంద్రబాబే దాడి చేయించారు.. 
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం తనపై దాడి కాదని.. యావత్‌ బీసీలందరిపై జరిగిన దాడని ధ్వజమెత్తారు. తనను రాయితో కొట్టారని.. బీసీలు, బడుగులు, పేదలు ఓటు అనే ఆయుధంతో టీడీపీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయడం ఖాయమని తెలిపారు. బీసీల బాగోగుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైపే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలంతా ఉన్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు.



బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది జగన్‌
ఒంగోలు: బీసీ ప్రధానిగా ఉన్నంత మాత్రాన బీసీలంతా అభివృద్ధి చెందరని, పరిపాలించే నేతలకు బీసీలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష అవసరమని కృష్ణయ్య చెప్పారు. ఆయన గురువారం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే ఓటర్లు మాత్రమే అని, సీఎం జగన్‌కు మాత్రం బీసీలంటే బ్యాక్‌బోన్‌ అని తెలిపారు. అందుకే బీసీల ఆత్మగౌరవాన్ని జగన్‌ పెంపొందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పనిముట్లు ఇచ్చి.. పదవులు మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెట్టేవారని గుర్తు చేశారు. 

జగన్‌ పాలనలో బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చట్టసభల్లో అనేక పదవులిచ్చారన్నారు. ఇటీవల 18 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తే అందులో 11 సీట్లు బీసీలకే ఇచ్చారని తెలిపారు. 23 మంది మంత్రులుంటే వారిలో నలుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు మరో ఏడుగురు మంత్రులుగా బీసీలే ఉన్నారన్నారు. ఇక నామినేటెడ్‌ పదవుల్లో అయితే 60 శాతం నుంచి 70 శాతం పదవులు బీసీలకే జగన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. 

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కావాలంటూ పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు సైతం ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదన్నారు. కాగా దాన్ని అడ్డుకున్న చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆ రాష్ట్రాల కన్నా ఏపీలోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇది కొనసాగాలంటే సీఎం వైఎస్‌ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement