BC Welfare Association president
-
నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
ఏర్పేడు/రేణిగుంట (తిరుపతి జిల్లా): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్రగాయమైంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో గురువారం వైఎస్సార్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డికి మద్దతుగా కృష్ణయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయితో దాడి చేశాడు. రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపునకు బలంగా తగిలింది. వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు తేరుకుని ఆయన చొక్కాను పైకి లేపి వీపుపైన గాయాన్ని గుర్తించారు. తలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని అయితే రాయి వీపునకు తగిలిందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాస్పందనను తట్టుకోలేకే టీడీపీ నేతలే దాడికి పురికొల్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి జరిగినా కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. అక్కడ నుంచి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ శ్రీరామ శ్రీనివాసులుకు ఫిర్యాదు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది కృష్ణయ్య గాయానికి బ్యాండేజ్ వేసి కట్టు కట్టారు. ఆయనకు నీరసంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు సెలైన్ ఎక్కించారు.చంద్రబాబే దాడి చేయించారు.. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలెవరూ టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. దీంతో తనను చంపాలని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థికి చెప్పి దాడి చేయించారని ఆరోపించారు. ఇది కేవలం తనపై దాడి కాదని.. యావత్ బీసీలందరిపై జరిగిన దాడని ధ్వజమెత్తారు. తనను రాయితో కొట్టారని.. బీసీలు, బడుగులు, పేదలు ఓటు అనే ఆయుధంతో టీడీపీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయడం ఖాయమని తెలిపారు. బీసీల బాగోగుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైపే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలంతా ఉన్నారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఖచ్చితంగా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పారు.బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది జగన్ఒంగోలు: బీసీ ప్రధానిగా ఉన్నంత మాత్రాన బీసీలంతా అభివృద్ధి చెందరని, పరిపాలించే నేతలకు బీసీలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష అవసరమని కృష్ణయ్య చెప్పారు. ఆయన గురువారం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే ఓటర్లు మాత్రమే అని, సీఎం జగన్‌కు మాత్రం బీసీలంటే బ్యాక్‌బోన్ అని తెలిపారు. అందుకే బీసీల ఆత్మగౌరవాన్ని జగన్ పెంపొందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పనిముట్లు ఇచ్చి.. పదవులు మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెట్టేవారని గుర్తు చేశారు. జగన్ పాలనలో బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చట్టసభల్లో అనేక పదవులిచ్చారన్నారు. ఇటీవల 18 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తే అందులో 11 సీట్లు బీసీలకే ఇచ్చారని తెలిపారు. 23 మంది మంత్రులుంటే వారిలో నలుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు మరో ఏడుగురు మంత్రులుగా బీసీలే ఉన్నారన్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో అయితే 60 శాతం నుంచి 70 శాతం పదవులు బీసీలకే జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కావాలంటూ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు సైతం ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్సీపీదన్నారు. కాగా దాన్ని అడ్డుకున్న చరిత్ర టీడీపీదని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆ రాష్ట్రాల కన్నా ఏపీలోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇది కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఆయనే’
సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం) స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం) -
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
నల్లగొండ టౌన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్బీఆర్ ఫంక్షన్హాల్లో జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ గర్జనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది గడిచినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆయన కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలను సంపాదించారని విమర్శించారు. మాయమాటలతో నిరుద్యోగులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని జూన్ వరకు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి నేడు మాటమార్చుతూ నిరుద్యోగుల జీవితాల తో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల సాధన కోసం మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. నిరుద్యోగులతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోరని, ముఖ్యమంత్రిని, మంత్రులను బయట తిరగనివ్వరని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రజరుగుందన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కడుపునిండా తిండితినని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం కమీషన్లు, కలెక్షన్లపైనే దృష్టిసారించారని ఆరోపించారు. నిరుద్యోగులకు బీసీ సంఘం అండగా ఉంటుందని తెలపారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేశ్ మాట్లాడుతూ ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు, విద్యార్థులు ఏకమై ఉద్యమించాల్సిన సమయం ఆశన్నమైందన్నారు. సభలో రవి, వెంకన్నగౌడ్, కాసోజు విశ్వనాధం, కంది సూర్యనారాయణ, వైద్యం వెంకటేశ్వర్లు,చిక్కుళ్ల రాములు, వైద్యుల సత్యనారాయణ, నరేందర్‌గౌడ్, నేటపట్ల సత్యనారాయణ,దుడుకు లక్ష్మీనారాయణ, నల్లా సోమమల్లయ్య, చొల్లేటి రమేష్, అరవింద్ పాల్గొన్నారు. -
బీసీ ఎంపీలూ.. నోరు విప్పండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :ప్రస్తుత లోక్‌సభలో 115 మంది, రాజ్యసభలో 32 మంది ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ కోసం నోరు విప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మోరంపూడి కల్యాణ మండపంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం నగర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంపీలు బీసీల తరఫున నోరు విప్పకపోతే ప్రజల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. రూ.50 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు 34 నుంచి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచి రాజ్యాంగ బద్ధత కల్పించాలని కోరారు. బీసీ కులానికి చెందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారని, రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించడానికి ఇదే సరైన తరుణమన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు లాంటి డిమాండ్ల సాధనకు పార్లమెంట్‌ను స్తంభింపచేయాలన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు పోరాటాలు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అధ్యక్షునిగా మారగాని చంద్రకిరణ్, ప్రధాన కార్యదర్శిగా వేగి చిన ప్రసాద్, మహిళా అధ్యక్షురాలుగా గుత్తుల బాలా త్రిపుర సుందరిలతో కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నౌడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా నాయకురాలు సరళాదేవి, చనుమోలు అశోక్ గౌడ్, నగర కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ ముజుబూర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నగర శాఖ నూతన అధ్యక్షుడు చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సభావేదికకు చేరుకున్నారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కడ్తాల: బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తిం పజేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ యాక్ట్లాగే బీసీలకు యాక్ట్ ను అమలుచేయాలన్నారు. నిరుపేద బీసీలకు మూడెకరాల భూమిని కేటాయిం చాలన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలోని ఏంబీఏ గార్డెన్లో నిర్వహించిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో బీసీలుగా పుట్టడమే పాపమైం దని, వారిని ఏ రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో 115 మంది బీసీ సభ్యులున్నా మాట్లాడలేని పరిస్థితి నెలకొం దన్నారు. రాజ్యాధికా రం లేని కులాలు బానిసలతో సమానమని, స్వయంపాలన కోసం బీసీలు ఉద్యమించాలని, అవసరమైతే బోడోలు, గుజ్జర్ల తరహా లో ఆందోళనలు కొనసాగించాలని పిలుపుని చ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ లు పారి శ్రామికవేత్త లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లతో నిండిపోయాయని, దీం తో ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పాటుచేసి బడ్జెట్లో రూ.50వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏ ర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ పథకాన్ని అమలుచేయాలన్నారు. ఈ సందర్భం గా మంగల్‌పల్లి గ్రామంలో లైంగికదాడికి గురైన బాలికను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బీసీలంతా సంఘటితంగా ఉద్యమించాలి అంతకుముందు మాజీమంత్రి జే.చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా హక్కులసాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలో ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఆమనగల్లు ఎంపీపీ లలితమ్మ, బీసీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శారద, నా యకులు రామకృష్ణ, ఆంజనేయులు, నర్సింహా, చందోజీ పాల్గొన్నారు.