నల్లగొండ టౌన్
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్‌బీఆర్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ గర్జనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది గడిచినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆయన కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలను సంపాదించారని విమర్శించారు. మాయమాటలతో నిరుద్యోగులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని జూన్ వరకు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి నేడు మాటమార్చుతూ నిరుద్యోగుల జీవితాల తో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
ఉద్యోగాల సాధన కోసం మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. నిరుద్యోగులతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోరని, ముఖ్యమంత్రిని, మంత్రులను బయట తిరగనివ్వరని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రజరుగుందన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కడుపునిండా తిండితినని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేవలం కమీషన్‌లు, కలెక్షన్లపైనే దృష్టిసారించారని ఆరోపించారు. నిరుద్యోగులకు బీసీ సంఘం అండగా ఉంటుందని తెలపారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేశ్ మాట్లాడుతూ ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు, విద్యార్థులు ఏకమై ఉద్యమించాల్సిన సమయం ఆశన్నమైందన్నారు. సభలో రవి, వెంకన్నగౌడ్, కాసోజు విశ్వనాధం, కంది సూర్యనారాయణ, వైద్యం వెంకటేశ్వర్లు,చిక్కుళ్ల రాములు, వైద్యుల సత్యనారాయణ, నరేందర్‌గౌడ్, నేటపట్ల సత్యనారాయణ,దుడుకు లక్ష్మీనారాయణ, నల్లా సోమమల్లయ్య, చొల్లేటి రమేష్, అరవింద్ పాల్గొన్నారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
Published Thu, Jul 9 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement