పేదల అక్షరంపై కక్ష | Kancha Ilaiah fires on amit shah and babu Over English Medium Schools | Sakshi
Sakshi News home page

పేదల అక్షరంపై కక్ష

Published Tue, May 7 2024 12:12 AM | Last Updated on Tue, May 7 2024 12:12 AM

Kancha Ilaiah fires on amit shah and babu Over English Medium Schools

పుట్టుకతో వచ్చే మాతృభాషను చంపడం సాధ్యమా? 

పెత్తందార్ల పిల్లలే ఇంగ్లిష్‌లో చదివి పెద్ద కొలువులు చేయాలా? 

పేద బిడ్డలకు మాత్రం ఇంగ్లిష్‌ విద్యను దూరం చేయాలని కుట్రలు చేస్తారా? 

పేదోళ్ల బిడ్డలు ఎప్పటికీ కూలీలుగానే ఉండిపోవాలా? 

పెత్తందార్ల పోకడలను తప్పుబడుతున్న మేధావులు, విద్యావంతులు 

ఇంగ్లిష్‌ మీడియంపై ఇంకా కొనసాగుతున్న ఏడుపు 

ఏపీలో ఇంగ్లిష్‌ మీడియం సృష్టించిన ప్రభంజనంతో కుళ్లు 

పేదల పిల్లలంతా తెలుగు మీడియంలోనే చదువుకోవాలంటున్న పెత్తందార్లు

తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటారట 

చంద్రబాబు మాటలను అమిత్‌ షా నోటితో పలికించడంపై సర్వత్రా ఆగ్రహం 

కంచ ఐలయ్య, కత్తి పద్మారావు, ఆర్‌ కృష్ణయ్య, జస్టిస్‌ ఈశ్వరయ్య తదితర మేధావుల మండిపాటు 

నిరుపేదల చదువుపై ఇంకా పెత్తందార్ల కక్ష తీరడం లేదు. జగన్‌ ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియం చదువు చెప్పిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీ విధానాలపై ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు సైతం ఇక్కడి విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలను వేనోళ్ల పొగుడుతుంటే వీరికి గిట్టడం లేదు.

ఉన్న పళంగా వారికి మాతృభాషపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానిని జగన్‌ తొక్కేస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదోలా జగన్‌ను ఇరుకున పెట్టాలని వారు లేనిపోని కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా సైతం ఇక్కడి పచ్చనేతల స్క్రిప్టునే వల్లె వేస్తూ నిరుపేదల చదువుపై కుట్రకు పన్నాగం పన్నుతున్నారు.  –సాక్షి, అమరావతి  

బడుగులు ఎదుగుతున్నారనే బాబు భయం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో బడుగులు ప్రపంచ మానవులుగా ఎదుగుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగడం మానేసి ఇంగ్లిష్‌పై విషం నూరిపోశారు.

చంద్రబాబు మొదట్నుంచి కులవాది, తన కుల ఆధిపత్యం కోరుకునే వ్యక్తి. అందుకే తన సామాజికవర్గం వారే ఇంగ్లిష్‌ చదువులతో విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పేద పిల్లలు మాత్రం ఇక్కడే అరకొర వేతనాలతో ఉండిపోవాలన్నది ఆయన దురుద్దేశం. విభజనాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లపాటు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహించి, వారి ఆర్థిక సహకారంతో రాజకీయం నడిపారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను కులతత్వ పూరితంగా మార్చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంగ్లిష్‌ చదువులను దూరం చేసే కుట్ర చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు అందించారు. ఇంగ్లిష్‌ మీడియంను ప్రోత్సహించారు. ఖరీదైన బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా అందించారు. ట్యాబ్‌లు ఇచ్చారు. విశ్వవిజ్ఞానాన్ని అందుకునేలా పేద పిల్లలను తీర్చిదిద్దారు. దీనిపై పెత్తందార్లు కుయుక్తులు పన్నడం సరికాదు.  

ఇంగ్లిష్‌ మీడియం పెత్తందారులకే పరిమితమా? 
పేదలకు ఇంగ్లిష్‌ వస్తే ఎదుగుతారని భయమా..

తెలుగు కోసం కాదు విద్యా వెలుగు అడ్డుకోవాలనే.. 
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా జగన్‌ అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్‌ విద్యా బోధన కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే క్రమంలో నిరుపేద విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఇంగ్లిష్‌ మీడియం కూడా తీసుకువచ్చారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి దేశం మొత్తం అనుసరిస్తే విద్యా వ్యాపారానికి నూకలు చెల్లుతాయనే కేంద్రంలోని పెద్దల భయం. 

అయినా ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌ ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ భాషలో చదివారు? తెలుగు మీడియంలో చదువుకున్నవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా, లేదా చిరుద్యోగులుగా ఎందుకు మిగిలారు? అమిత్‌ షా పిల్లలు ఎక్కడ చదివారు? మన రాష్ట్రంలో తెలుగు భాషకు కంకణం కట్టుకున్నామని చెబుతున్న భాజాపా నేత వెంకయ్యనాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు... వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదివించారు? అదే చదువు బడుగు బలహీన వర్గాల వారికి వద్దని ఎలా చెబుతారు? అయినా ఇక్కడ తెలుగు భాషనేమీ తీసేయడం లేదు కదా.

 ఇంగ్లిష్‌ మీడియం అదనంగా తెచ్చారు. అందరూ విద్యావంతులైతే హెచ్చుతగ్గులుండవన్నది అంబేడ్కర్‌ మాట. అందుకు తగ్గట్టుగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. ఇది చూసి తమ ఆధిపత్యం ఎక్కడపోతుందోనని కొందరు భయపడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.  – జస్టిస్‌ ఈశ్వరయ్య 

అమిత్‌ షా ఇంట పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు 
అమిత్‌షా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి. డబ్బున్నవారంతా తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు భాష గురించి అమిత్‌షా మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు? ఏం మీడియంలో చదివాడు? పేద ప్రజల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే తప్పేంటి? విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్‌. ఓటుకి ఇంగ్లిష్‌ మీడియానికి ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లిష్‌ మీడియం తీసుకు రాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?  – యార్లగడ్డ వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కో–ఆర్డినేటర్‌  

 అమిత్‌ షా,చంద్రబాబు పిల్లలు మాతృభాషలోనే చదివారా? 
మాతృభాషకు మద్దతు సాకుతో జరుగుతున్న ప్రచారం వెనుక పేదల చదువులను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. మాతృభాషను చంపేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న అమిత్‌ షా, చంద్రబాబు, రామోజీరావు వంటి పెద్దల వారసులు, మనుమలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చెందిన పేదోళ్లు మాత్రం మాతృభాషను బతికించాలనే నిబంధనతో ప్యూన్లు, క్లర్కులు, గుమాస్తాలు, కూలీలుగా మిగిలిపోవాలా? ఇదెక్కడి ఆటవిక న్యాయం. 

పేద పిల్లలు ఇంగ్లిష్‌ చదువులు చదవకూడదా? పెత్తందార్లకు మాత్రమే ఇంగ్లిష్‌ చదువులు రాసిపెట్టారా? ఏ బిడ్డ అయినా పుట్టినప్పటి నుంచి మాతృభాషలోనే అక్షరాభ్యాసం చేస్తారు కదా. అలాంటి మాతృభాషను ఎవరో చంపేస్తే చచ్చిపోతుందా? చంద్రబాబు చెబితే మాత్రం అమిత్‌ షాకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. 

ఆయన కృషివల్లే ఈ రోజు మన పేద బిడ్డలు అమెరికాలోని శ్వేతసౌధం, ఐక్యరాజ్యసమితి, వరల్డ్‌ బ్యాంకు, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి సత్తా చూపారు. ఇక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్‌ మీడియంనే కోరుకుంటున్నారు. ఎన్నికల వేళ దీనిపై రాజకీయం తగదు.         –ఆర్‌.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు

బాబోస్తే ఇంగ్లిష్‌ మీడియం తీసేయడం తథ్యం 
భవిష్యత్తులో చంద్రబాబు తీసుకోబోయే చర్యలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మోదీ, అమిత్‌ షాల మాటను బాబు తూచా తప్పరు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లిష్‌ మీడియం తీసేయడం తథ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు మంచి స్కూళ్లు, మౌలిక సదుపాయాలు, భోజన వసతి, బైలింగ్వల్‌ బుక్స్‌ అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల రానున్న రోజుల్లో పెట్టుబడి దారుల పిల్లలకు పోటీపడే స్థాయిలో పేద వర్గాల పిల్లలు ఎదుగుతారు. ప్రాంతీయ భాషలోనే చదువు అంటున్న అమిత్‌ షా కొడుకు జయ్‌ షా పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని  చిన్న వయసులోనే నేషనల్‌ క్రికెట్‌ బోర్డ్‌ చైర్మన్‌ అయ్యాడు.

మరి తన కొడుకుని అమిత్‌ షా గుజరాతీలో ఎందుకు చదివించలేదు? అంబానీకి ధీరూబాయ్‌ అంబానీ పేరుతో ముంబయిలో పెద్ద ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ఉంది. అక్కడ గుజరాతీ, మరాఠీ సబ్జెక్టే లేదు. మరి వాటిని మరాఠీ లోకో, గుజరాతీ భాషలోకో అమిత్‌ షా ఎందుకు మార్పించలేదు? గుజరాత్‌లోనే అదానీ స్కూల్‌ ఉంది అది కూడా పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌. బిర్లా కూడా ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు నడుపుతున్నారు.

మరి వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నారు? వాళ్లంతా ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా చందాలు ఇస్తున్నారనా?  గ్రామీణులు, వ్యవసాయదారుల పిల్లలు అంబానీ అదానీ పిల్లలతో సమానమైపోతారేమోననే భయంతోనే ఇంగ్లిష్‌ వద్దంటున్నారా? ఏ మీడియంలో చదివితే పిల్లలు బాగా రాణించగలరో అదే మీడియంలో చదివించాలి కదా.  తాజాగా వచ్చిన పదోతరగతి ఫలితాల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నవారు 91శాతం పాసైతే తెలుగు మీడియంలో చదువుకున్నవారు 81 శాతమే పాసయ్యారు.

అంటే దీనర్థం ఏమిటి? ఇంగ్లిష్‌లో పిల్లలు మరింత సులభంగా చదువుకోగలుగుతున్నారనే కదా. ఇంగ్లిష్‌ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాకుండా ఎలా పోతుంది? పల్లెల్లో వ్యవసాయ కూలీలు, చెప్పులు కుట్టేవారు, కుండలు చేసుకునేవారికి ఇంగ్లిష్‌ చదువులు వస్తే తమ పిల్లలతో పోటీ పడతారని వీరి భయం. కూటమి అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను కుక్కలు చింపిన విస్తరి చేద్దామని చూస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం, ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిరుపేదలు ఆదివాసీలు, దళితులు దేశం గుర్తించే విజయాలు సాధిస్తారు.  –కంచ ఐలయ్య, విద్యావేత్త   

ఎన్డీఏ ప్రభుత్వంలోనే తెలుగు భాష నిర్వీర్యం
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తెలుగు భాషను భ్రష్టు పట్టించారు. అయినా ధర్మవరం సభలో అమిత్‌షా తెలుగును పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు రాసిచ్చిన అబద్ధాలను అమిత్‌షా వల్లెవేయడం సిగ్గుచేటు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, తెలుగు భాష ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా భాషా స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు.

ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కనీసం భాషా సంఘాన్ని పెట్టలేని చంద్రబాబు తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో నియమించి తెలుగు వికాసానికి బాటలువేశారు. ఎన్నడూ లేనివిధంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను వారంరోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. వేమన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులతో వేమన పద్యాలను చదివించి ఉభయ భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించారు.

అల్లూరి సీతారామరాజు శత జయంతి, జాషువా వంటి మహోన్నత కవుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటారు. అందువల్లే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే స్థాయికి తెలుగు విద్యార్థులు ఎదిగారు. తెలుగుభాషా పరిరక్షణ కంటే ముందుగా లోకేశ్‌కు మంచి తెలుగు నేర్పించాలి..’ అని విజయబాబు అన్నారు.  –విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement