ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :ప్రస్తుత లోక్‌సభలో 115 మంది, రాజ్యసభలో 32 మంది ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ కోసం నోరు విప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మోరంపూడి కల్యాణ మండపంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం నగర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంపీలు బీసీల తరఫున నోరు విప్పకపోతే ప్రజల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. రూ.50 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు 34 నుంచి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచి రాజ్యాంగ బద్ధత కల్పించాలని కోరారు. బీసీ కులానికి చెందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారని, రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించడానికి ఇదే సరైన తరుణమన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు లాంటి డిమాండ్ల సాధనకు పార్లమెంట్‌ను స్తంభింపచేయాలన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు పోరాటాలు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
అనంతరం బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అధ్యక్షునిగా మారగాని చంద్రకిరణ్, ప్రధాన కార్యదర్శిగా వేగి చిన ప్రసాద్, మహిళా అధ్యక్షురాలుగా గుత్తుల బాలా త్రిపుర సుందరిలతో కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నౌడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా నాయకురాలు సరళాదేవి, చనుమోలు అశోక్ గౌడ్, నగర కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ ముజుబూర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నగర శాఖ నూతన అధ్యక్షుడు చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సభావేదికకు చేరుకున్నారు.
బీసీ ఎంపీలూ.. నోరు విప్పండి
Published Tue, May 19 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement